సాక్షి, కడప: వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ముగిసింది. శనివారం ఉదయం ఇడుపులపాయ నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. మూడు రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో మొదటిరోజు గురువారం.. పులివెందుల నియోజకవర్గం వేముల మండలం వేల్పులలో నిర్మించిన మోడల్ సచివాలయ భవన ప్రాంగణాన్ని ముఖ్యమంత్రి సందర్శించి ప్రారంభించారు. సచివాలయం, వైఎస్సార్ విలేజ్ హెల్త్‌క్లినిక్, రైతు భరోసా కేంద్రంతో పాటు అన్ని కార్యాలయాలలో కలియదిరిగారు. గ్రామ సచివాలయంలో సీఎం జగన్ అరగంటకు పైగా గడిపారు. స్థానిక నేతలు, కార్యకర్తలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తానున్నానంటూ భరోసా ఇచ్చారు.
చదవండి: సచివాలయాల్లో సేవలు సంతృప్తికరం: సీఎం జగన్
రెండోరోజు..
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. సీఎంతో పాటు ఆయన కుటుంబసభ్యులు వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి, వైఎస్ షర్మిల వైఎస్సార్‌కు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులతో కలిసి వైఎస్ జగన్ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. అనంతరం పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. విడతల వారీగా సాయంత్రం వరకు పులివెందుల నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ఇతర అంశాల పై స్థానిక నాయకులు, అధికారులతో సీఎం సమీక్ష జరిపారు.
Comments
Please login to add a commentAdd a comment