సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరులో రూ.355 కోట్లకు సంబంధించిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు బుధవారం సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. అనంతరం వీవీనగర్ వద్ద ఏర్పాటు చేసి ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. అక్కడ నుంచి నేరుగా కళ్యాణమండపానికి చేరుకొని మాజీ మేయర్ షేక్ నూర్జహాన్, పెదబాబు కుమార్తె వివాహానికి హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం తిరిగి హెలిప్యాడ్ వద్దకు చేరుకొని తాడేపల్లికి బయలుదేరారు. పర్యటనలో భాగంగా సీఎం జగన్ వెంట ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని, మంత్రులు తానేటి వనిత, రంగనాథ రాజు, ఎంపీలు కోటగిరి శ్రీధర్, మార్గని భరత్, ఎమ్మెల్యేలు కారుమూరి నాగేశ్వరరావు, అబ్బాయి చౌదరి, ఎలిజా, గ్రంధి శ్రీనివాస్, తెల్లం బాలరాజు ఉన్నారు.
నాడు తండ్రి... నేడు తనయుడు..
ఏలూరు ప్రజలకు తమ్మిలేరు ముంపును తప్పించడం కోసం చేసిన ప్రయత్నాలను జిల్లా ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఏలూరు నగరం చుట్టూ ప్రవహించే తమ్మిలేరు వరదల సమయంలో ఉగ్రరూపం దాల్చుతోంది. ఏలూరు నగరంలోని పల్లపు ప్రాంతాలకు తమ్మిలేరు మంపు ప్రమాదం పొంచి ఉంటోంది. 2006లో భారీ వరదల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఏలూరు పర్యటనకు వచ్చారు. నగరమంతా కలియతిరిగారు. తమ్మిలేరు ముంపును నివారించాలంటే ఏం చేయాలని ఇరిగేషన్ అధికారులతోనూ అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల నానితోను చర్చించారు. ఏలూరు నగరంలో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయడం కోసం రూ.17 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పగానే అప్పటికప్పుడు మంజూరు చేశారు.
వెంటనే పనులు మొదలు పెట్టారు. నగరంలో చాలావరకూ రిటైనింగ్ వాల్ కారణంగా ముంపు ముప్పు తప్పింది. తమ్మిలేరు వరదల నుంచి ఏలూరు ముంపునకు గురికాకుండా ఉండేందుకు 1960వ దశకంలో మిత్రా కమిటీని ప్రభుత్వం నియమించింది. ఆ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా నాగిరెడ్డిగూడెంలో తమ్మిలేరు రిజర్వాయర్‌ను నిర్మించారు. 1995, 2006, 2012, 2020లలో తమ్మిలేరుకు భారీ వరదలు వచ్చాయి. నగరం పెరిగిపోవడంతో తమ్మిలేరు కొంతమేర కుంచించుకు పోయింది. తమ్మిలేరు తూర్పు, పశ్చిమ పాయల సామర్ధ్యం 29 వేల క్యూసెక్కులు కాగా గత నెలలో వరద 41 వేల క్యూసెక్కుల వరకూ వచ్చింది. దీన్ని అధిగమించేందుకు ఎస్‌ఎంఆర్ నగర్ వద్ద గండి కొట్టాల్సి వచ్చింది. నాగిరెడ్డిగూడెం రిజర్వాయర్ నుంచి వచ్చే వరదతో పాటు దిగువన పులివాగు, ఉప్పువాగు, విజయరాయి అనికట్, తమ్మిలేరు పరీవాహక ప్రాంతం నుంచి భారీగా వరద వచ్చింది.
ఈ నేపథ్యంలో ఏలూరు నగరాన్ని శాశ్వతంగా వరదల నుంచి కాపాడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఏలూరులోని మిగిలిన ప్రాంతాలలో రిటైనింగ్ వాల్ నిర్మాణం కోసం రూ.80 కోట్లతో తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగానే ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయా పనులకు వెంటనే పరిపాలనా అనుమతులు ఇచ్చారు. బుధవారం ఆయన స్వయంగా ఏలూరులో తంగెళ్లమూడి వద్ద తమ్మిలేరు రిటైనింగ్‌వాల్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తమ్మిలేరు పశ్చిమ పాయ దిగువ భాగంలో సాయినగర్, పోణంగి, మాదేపల్లి, జాలిపూడి ప్రాంతాలలో రిటైనింగ్ వాల్‌తో పాటు, అశోక్‌నగర్, బాలయోగి వంతెన, కేపీడీటీ స్కూల్, చేపలరేవు ప్రాంతాలలో రిటైనింగ్‌వాల్ ఎత్తు పెంచి పటిష్టం చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోనున్నారు.
ఏలూరు అభివృద్దికి కట్టుబడి ఉన్నారు
ఆళ్ల నాని, ఉప ముఖ్యమంత్రి
ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏలూరు అభివృద్ధికి కట్టుబడి ఉన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా వెంటనే స్పందించడం, నిధులు కేటాయించడం జరుగుతోంది. ఏలూరులో రూ.330 కోట్లతో చేపట్టే వివిధ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment