మీ నిర్ణయం మార్చుకోండి | CM YS Jagan Writes Another Letter To PM Modi About Vizag Steel Plant | Sakshi
Sakshi News home page

మీ నిర్ణయం మార్చుకోండి

Published Wed, Mar 10 2021 3:06 AM | Last Updated on Wed, Mar 10 2021 11:02 AM

CM YS Jagan Writes Another Letter To PM Modi About Vizag Steel Plant - Sakshi

గత నెలలో నేను మీకు (ప్రధాని) రాసిన లేఖలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరించాను. ఆర్థిక మంత్రి ప్రకటనతో ప్లాంట్‌ ఉద్యోగులు, రాష్ట్ర ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. మా ఆకాంక్షలు, సెంటిమెంట్‌.. ప్లాంట్‌ను ప్రైవేటీకరించకుండా ఉన్న మార్గాల గురించి మీకు మరోసారి వివరించడానికి అఖిలపక్షం, కార్మిక సంఘాల నేతలను వెంట తీసుకుని వస్తాను. త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతూ మరోమారు మీకు లేఖ రాస్తున్నాను. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రివైవల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను.
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి: దశాబ్దాల పోరాటాలు, ఆత్మ బలి దానాలతో సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఆంధ్రుల ఆత్మాభిమానం, మనోభావాలతో ముడి పడిందని.. అలాంటి ప్లాంటును ప్రైవేటీకరించొద్దని ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి విజ్ఞప్తి చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో పూర్తిగా పెట్టుబడుల ఉప సంహరణ నిర్ణయంపై పునరాలోచన చేయాలని విన్నవించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రధానికి మరో లేఖ రాశారు.

ప్రభుత్వ రంగంలోనే ప్లాంటును కొనసా గించాలని, ప్లాంటు పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయని స్పష్టం చేశారు. విశాఖ స్టీలు ప్లాంటును నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తామంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారని, ఇది రాష్ట్ర ప్రజలతో పాటు ప్లాంటు ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు.

ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇస్తే ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు ప్రత్యామ్నా యాలను స్వయంగా కలిసి వివరిస్తానన్నారు. అఖిల పక్షంతో పాటు కార్మిక సంఘాల నేతలను వెంట పెట్టుకుని వస్తానని పేర్కొన్నారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని, స్టీల్‌ ప్లాంటు లాభాల్లోకి వచ్చేందుకు పలు ప్రత్యామ్నాయాలను సూచిస్తూ ప్రధానికి సీఎం జగన్‌ గతంలోనే లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ రాసిన లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి.

మరోసారి మీ దృష్టికి స్టీల్‌ ప్లాంట్‌ ప్రాధాన్యత 
► సర్, నేను గత నెల (ఫిబ్రవరి 6వ తేదీ)లో మీకు రాసిన లేఖలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (రాష్ట్రీయ ఇస్‌పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ – ఆర్‌ఐఎన్‌ఎల్‌ విశాఖ) ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న మార్గాలన్నింటినీ వివరిస్తూ, ప్లాంట్‌లో వ్యూహాత్మక 100 శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సంబంధించి తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచించాలని కోరాను. అవే విషయాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి కూడా తెలియజేశాను.
► ఇదే సమయంలో ఆర్‌ఐఎన్‌ఎల్‌లో 100 శాతం వ్యూహాత్మక పెట్టుబడుల ఉప సంహరణకు సంబంధించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.  అది రాష్ట్ర ప్రజలను, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యోగులు, కార్మికులను తీవ్ర నిరాశకు గురి చేసింది.
► విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రాధాన్యం, దాంతో రాష్ట్ర ప్రజలకు ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ నేపథ్యంలో, సంస్థ పునరుద్ధరణకు ఉన్న మార్గాలను మరోసారి మీ దృష్టికి తీసుకు వస్తున్నాను.
► ఆర్‌ఐఎన్‌ఎల్‌ అధీనంలో ఒక ప్రత్యేక సంస్థగా నిల్చిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (వీఎస్‌పీ) కేంద్ర ఉక్కు శాఖ కింద పని చేస్తూ, నవరత్నాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. దాదాపు 20 వేల మందికి ప్రత్యక్షంగా, మరెందరికో పరోక్షంగా విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థలలో అతి పెద్దదిగా నిలిచింది.
► దేశంలో సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్‌ ప్లాంట్‌ ఇది. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ, నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలతో పాటు, ఆటోమొబైల్‌ రంగం అవసరాలు కూడా తీరుస్తోంది.
► ఇది దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్న సంస్థ. దాదాపు దశాబ్ధ కాలం పాటు ‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ అన్న నినాదంతో కొనసాగించిన ఉద్యమంలో దాదాపు 32 మంది అసువులు బాసారు. ఆ నేపథ్యంలోనే విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుపై నాటి ప్రధాని 1970 ఏప్రిల్‌ 17న ప్రకటన చేశారు. 
► 2002 నుంచి 2015 వరకు విశాఖ ఉక్కు కర్మాగారం అత్యుత్తమ పని తీరు ప్రదర్శించి లాభాల బాటలో నడిచిందన్న విషయాన్ని మీ దృష్టికి తీసుకువస్తున్నాను. 2002లో దీన్ని ఖాయిలా పరిశ్రమగా బీఐఎఫ్‌ఆర్‌ (బోర్డ్‌ ఫర్‌ ఇండస్ట్రియల్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ రీ కన్‌స్ట్రక్షన్‌)కు నివేదించారు.
► విశాఖ నగరంలోనే స్టీల్‌ ప్లాంట్‌కు దాదాపు 19,700 ఎకరాల భూమి ఉంది. దాని ప్రస్తుత మార్కెట్‌ విలువ సుమారు లక్ష కోట్లకు పైగానే ఉంటుంది. సంస్థ ఉత్పత్తి సామర్థ్యం 7.3 మిలియన్‌ టన్నులు కాగా, ఇటీవలే ఆర్‌ఐఎన్‌ఎల్‌ సంస్థను ఆ«ధునీకరించడంతో పాటు, ఉత్పత్తి సామర్థ్యం పెంచడానికి విస్తరణ చర్యలు చేపట్టింది. ఆ దిశలో వనరుల సేకరణ కోసం ప్రయత్నాలు కూడా మొదలు పెట్టింది. అయితే విశ్వ వ్యాప్తంగా ఈ రంగంలో ఉత్పన్నమైన మాంద్యంతో విశాఖ ఉక్కు కర్మాగారం కూడా 2014–15 నుంచి క్రమంగా నష్టాల బాట పట్టింది. సొంతంగా గనులు లేనందున ఉత్పత్తి వ్యయం దారుణంగా పెరిగింది. ఫలితంగా లాభాలు పూర్తిగా పడిపోయాయి. 
► విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించడం కంటే, ఆ సంస్థకు కాస్త అండగా నిల్చి, చేయూతనిస్తే తప్పనిసరిగా లాభాల బాటలో నడుస్తుందన్న గట్టి నమ్మకంతో చెబుతున్నాను. సంస్థకు అవసరమైన గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం గణనీయంగా తగ్గుతుంది. అదే విధంగా ఎక్కువ వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చడం, రుణాలను వాటాల రూపంలోకి మార్చాలనే ఈ కింది అంశాలను పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

1. రెండేళ్లు గడువు ఇస్తే పరిస్థితిలో మార్పు
ఆర్థిక అంశాలకు సంబంధించిన అన్ని రంగాలతో పాటు, స్టీల్‌ రంగం కూడా ఆర్థిక మాంద్యం నుంచి క్రమంగా కోలుకుంటున్న విషయం తెలిసిందే. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పూర్తి ఉత్పాదక సామర్థ్యం 7.3 లక్షల మెట్రిక్‌ టన్నులు. ఆర్‌ఐఎన్‌ఎల్‌ గత ఏడాది డిసెంబర్‌ నుంచి 6.3 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో గరిష్ట స్థాయిలో పని చేస్తూ ప్రతి నెలా దాదాపు రూ.200 కోట్ల లాభాలు ఆర్జిస్తోంది. ఇదే తరహాలో మరో రెండేళ్లు పని చేస్తే, సంస్థ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోతుంది. 

2. ఉత్పత్తి వ్యయం తగ్గడం కోసం సొంత గనులు కేటాయించాలి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రస్తుతం జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎండీసీ)కు చెందిన బైలదిల్లాలోని గనుల నుంచి మార్కెట్‌ ధరకు ఇనుప ఖనిజం కొనుగోలు చేస్తోంది. ఒక్కో మెట్రిక్‌ టన్ను ఇనుప ఖనిజాన్ని దాదాపు రూ.5,260కు సంస్థ కొనుగోలు చేస్తోంది. కాగా దేశంలోని అన్ని ఉక్కు కర్మాగారాలకు సొంతంగా ఇనుప ఖనిజ గనులు ఉన్నాయి. వాటి ద్వారా ఆయా సంస్థల అవసరాలు 60 శాతం మేర తీరుతుండగా, మిగిలిన ఇనుప ఖనిజాన్ని అవి ఎన్‌ఎండీసీకి చెందిన గనుల నుంచి కొనుగోలు చేస్తున్నాయి. చివరకు కేంద్ర ప్రభుత్వ రంగంలోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సెయిల్‌)కు కూడా 200 ఏళ్లకు సరిపడా ఇనుప ఖనిజం గనులు సొంతంగా ఉన్నాయి.

కానీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు అవసరమైన ఇనుప ఖనిజాన్ని పూర్తిగా ఎన్‌ఎండీసీ గనుల నుంచి కొనుగోలు చేయడం ద్వారా విశాఖ ఆర్‌ఐఎన్‌ఎల్‌పై రూ.3,472 కోట్లకు పైగా భారం పడుతోంది. అందువల్ల ఈ రంగంలో ఉన్న మిగిలిన సంస్థలతో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పోటీ పడే విధంగా సొంత గనులు కేటాయించాలి. ఇది ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఒడిశాలో ఒక ఇనుప ఖనిజం గని ఉంది. అది సంస్థ రివైవల్‌ కోసం ఎంతో దోహదకారిగా నిలుస్తుంది.

3. రుణాలను ఈక్విటీలుగా మార్చాలి
సంస్థ స్వల్పకాలిక, దీర్ఘకాలిక రుణాలను ఈక్విటీలుగా మార్చడం వల్ల సంస్థపై రుణాలు తిరిగి చెల్లించే ఒత్తిడి తగ్గించడంతో పాటు, రుణాలపై వడ్డీల భారం కూడా తగ్గుతుంది. సంస్థ రుణ భారం రూ.22 వేల కోట్లు కాగా, దానికి అత్యధికంగా 14 శాతం వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. ఆ రుణాలను బ్యాంకులు ఈక్విటీలుగా మారిస్తే, వడ్డీ భారం పూర్తిగా పోవడంతో పాటు, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్, విశాఖ) కూడా స్టాక్‌ ఎక్సేంజ్‌లో లిస్ట్‌ అవుతుంది. ఆ ప్రక్రియతో స్టాక్‌ మార్కెట్‌ ద్వారా ప్రజల నుంచి నిధుల సేకరణకు అవకాశం కూడా ఏర్పడుతుంది. ఈ చర్యలు సంస్థపై రుణ భారం తగ్గిస్తాయి. తద్వారా సంస్థ పనితీరు మరింత మెరుగు కావడంతో ఆర్థికంగా వెసులుబాటు కూడా కలుగుతుంది.

4. మిగులు భూమిలో ప్లాటింగ్‌
విశాఖ స్టీల్‌ పునరుద్ధరణకు మరో మార్గం కూడా ఉంది. ఆర్‌ఐఎన్‌ఎల్‌ వద్ద వినియోగించుకోని 7,000 ఎకరాల భూమి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ భూమిని ఆర్‌ఐఎన్‌ఎల్‌ చేత ప్లాటింగ్‌ చేయించి.. ప్లాట్లుగా మార్చి అమ్మితే ప్లాంట్‌ను ఆర్థికంగా బలోపేతం చేయవచ్చు. తద్వారా సంస్థ విలువ పెరుగుతుంది. ఇందుకు అవసరమైన భూ వినియోగ మార్పిడికి అవసరమైన అన్ని అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది.

ఇవన్నీ మీకు స్వయంగా వివరిస్తాం..
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రివైవల్‌తో పాటు సంస్థను తిరిగి లాభాల బాటలోకి మళ్లించడానికి ఏమేం చేయవచ్చన్న అన్ని విషయాలను స్వయంగా వివరించడం కోసం వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతున్నాను. అఖిలపక్ష బృందంతో పాటు, కార్మిక సంఘాల నాయకులను కూడా వెంట తీసుకువస్తాను. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి రాష్ట్ర ప్రజల ఆకాంక్షను, సంస్థతో మాకు ముడిపడి ఉన్న సెంటిమెంట్‌ను స్వయంగా వివరిస్తాము. అందువల్ల వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రివైవల్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయ, సహకారాలను అందిస్తుందని నేను హామీ ఇస్తున్నాను. లక్ష్య సాధన కోసం మీ సమర్థవంతమైన నాయకత్వంలో, మీతో కలిసి అడుగులు వేస్తామని తెలియజేస్తున్నాను. సమాజానికి, ముఖ్యంగా రాష్ట్ర ప్రజలకు ఎంతో విలువైన, ముఖ్యమైన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌  కొనసాగాలని, ఈ ప్రక్రియలో వీలైనంత త్వరగా అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని కోరుతున్నాను. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement