కూటమి నేతల మధ్య కోల్డ్ వార్
కూటమిలో చేరతానన్న దొరబాబు
వర్మకు ప్రాధాన్యం తగ్గించే ఎత్తుగడ
తొలి ఎమ్మెల్సీ అని చంద్రబాబు దగా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పిఠాపురంలో కూటమి నేతల్లో వర్గపోరు ముదిరి పాకాన పడుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలోనే వీరి ఆధిపత్య పోరు కొనసాగుతుండగా వారికి మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు రూపంలో మరో తలపోటు వచ్చి పడింది. పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కల్యాణ్ నియోజకవర్గానికి చుట్టపు చూపుగా వచ్చి పోయే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎప్పుడైతే పవన్ ఉప ముఖ్యమంత్రి అయ్యారో ఆ రోజు నుంచే పిఠాపురంపై పెత్తనం కోసం నేతలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కూటమితో జత కట్టిన పవన్ కల్యాణ్ కోసం పిఠాపురం స్థానాన్ని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్ వర్మ త్యాగం చేసి గెలుపు కోసం కష్టపడ్డారు. ఫలితంగా ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి ఎమ్మెల్సీగా వర్మకు అవకాశం కల్పిస్తామని బాబు మాట ఇచ్చారు. పవన్ కూ డా వర్మను ఆకాశాన్నికెత్తేసినంత పనిచేస్తూ వెంట తిప్పుకున్నారు. ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటవడం.. పిఠాపురం నుంచి గెలిచిన పవన్ కల్యాణ్ ఉప ముఖ్యమంత్రి కావడం చకచకా జరిగిపోయా యి. ఇంతలోనే మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ రానే వచ్చింది.
తొలి ఎమ్మెల్సీ తనదేనని వర్మ గంపెడాశలు పెట్టుకుని తనకే ఆ ఇస్తారని అనుచరులు అందరికీ వర్మ చెప్పేసుకున్నారు. మాట ఇచ్చి మరచిపోవడంలో దిట్ట అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు పవన్ కోసం పిఠాపురం సీటు త్యాగం చేసిన వర్మకు జెల్ల కొట్టి ఆ సీటును రామచంద్రయ్యకు ఇచ్చేశారు. జనసేన నుంచి పిడుగు హరిప్రసాద్‌కు పవన్ సిఫార్సుతో లభించింది. మొదటి అవకాశంలోనే అందలం ఎక్కిస్తారనుకున్న వర్మ ఆశలపై నీళ్లు చల్లారు. వర్మకు ఎమ్మెల్సీ చాన్స్ రాకుండా తెర వెనుక జనసేన నేతలు బ్రేకులు వేశారనే చర్చ ఇరుపార్టీల నేతల మధ్య సాగింది.
తార్కాణాలెన్నో
ఎమ్మెల్సీ దక్కని అవమానం జీర్ణించుకోకుండానే పవన్ అలా వెళ్లగానే ఇలా వర్మ ప్రాధాన్యాన్ని తగ్గించేలా జనసేన నేతలు వ్యవహరిస్తుండటం మొదలు పెట్టారని ఆనోటా ఈనోటా అంటున్న మాట. ఇందుకు అనేక ఉదాహరణలను వర్మ అనుచరవర్గం ఎత్తి చూపుతోంది. పవన్ స్థానే సోదరుడు నాగబాబు నియోజకవర్గంలో అధికార, అనధికార వ్యవహారాలను తనే స్వయంగా చక్కబెడుతున్నారు. అంతే కాకుండా తాను లేదా, మర్రెడ్డి శ్రీనివాస్ సిఫార్సులకే ప్రాధాన్యం ఇవ్వాలని నాగబాబు ఇటీవల పలు సమీక్షల్లో స్పష్టం చేశారని గుర్తు చేస్తున్నారు. నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యేగా, టీడీపీ ఇన్‌చార్జిగా ఉన్న వర్మకు కనీస ప్రాధాన్యం లేకుండా చేయడంతో ఆ వర్గం రగిలిపోతోంది. అలాగని బయటపడి వివాదాలకు పోకుండా అతని అనుచరులు సమయం కోసం కాసుకుని కూర్చున్నట్టుగా కనిపిస్తోంది.
త్యాగానికి అడుగడుగునా అవమానం
పవన్ కోసం త్యాగం చేసిన పాపానికి వర్మను అడుగడుగునా అవమానిస్తున్నారని ఆ వర్గం కారాలు మిరియాలు నూరుతోంది. ఏ క్షణానైన్నా వర్మ వర్గం రోడ్డెక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ తరుణంలో మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూటమిలో చేరనున్నట్టు ఇటీవల ప్రకటించడం వర్మ వర్గీయుల్లో అగ్గి రాజేసింది. కూటమిలో చేరుతానన్న దొరబాబును తేదేపాలో చేర్చుకుంటే మాత్రం మూకుమ్మడిగా పార్టీని వీడి బయటకు పోవాలనే యోచనలో వర్మ వర్గం ఉందనే ప్రచారం సాగుతోంది. ఇటు జనసేన నేతలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నారని చెబుతున్నారు. ఇప్పటికే పిఠాపురంలో కూటమిలోని తేదేపా, జనసేన నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఈ తలపోట్లు సరిపోవన్నట్టు ఇప్పుడు దొరబాబు కూటమిలోకి వస్తే అతనికిచ్చే ప్రాధాన్యం ఏమిటనే ప్రశ్న కూటమి నేతలు ఆయా పార్టీల ముఖ్య నేతలకు సంధిస్తున్నారు. సీటు త్యాగంచేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ప్రాధాన్యం లేకపోగా, ఇప్పుడు కొత్తగా దొరబాబును తీసుకువచ్చే ప్రయత్నాలపై వర్మ వర్గం అగ్గిమీద గుగ్గిలమవుతోంది. వర్మను పొమ్మనకుండా పొగడబెట్టే ఎత్తుగడతోనే దొరబాబును తీసుకువస్తున్నారనే ప్రచారం పిఠాపురంలో విస్తృతంగా జరుగుతోంది. ఎన్నికలు అయిపోయాక ఇప్పుడు దొరబాబును కూటమిలోకి తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇరుపార్టీల నేతలు ముఖ్య నేతలను ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment