సాక్షి, అమరావతి: నవరత్నాల పేరుతో ఏపీ ప్రజలకు సంక్షేమ పాలన అందిస్తున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. నాణ్యమైన విద్య, వైద్యం, యువతకి ఉపాధి, పేదలకు ఇళ్లు, బడుగ, బలహీన వర్గాల పేదలకు ఆర్థిక సాయం.. తాతాఅవ్వలు, ఒంటిరి మహిళలకు పెన్షన్, అక్కచెల్లమ్మలకు ఆర్థిక సాయం అందజేస్తూ.. వారికి అండగా నిలబడుతున్నారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటిలో కనీసం ఒక్కరైనా సీఎం జగన్ తీసుకువచ్చిన సంక్షేమ పథకాల లబ్ధిదారు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. పార్టీ, కులం, మతంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. సీఎం జగన్ ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలిచింది. సీఎం జగన్ సంక్షేమ పాలనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రజలు సైతం ప్రశంసించడమేకాక.. తమ రాష్ట్రాల్లోను పలు పథకాలను అమలు పరుస్తున్నారు. కరోనా సంక్షోభ కాలంలోనూ ఏపీలో సంక్షేమ పథకాలను ఆపలేదు. జగన్‌ను బెస్ట్ సీఎంగా నిలిపిన ఘటనలు ఎన్నో ఉండగా.. తాజాగా ఓ సామాన్యుడు రాజన్న బిడ్డపై ప్రశంసలు కురిపించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
టి. తులసిరామ్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో షేర్ చేసిన ఈ వీడియోలో ఓ మధ్యవయస్కుడైన వ్యక్తి సీఎం జగన్ పాలనపై ప్రశంసలు కురిపించాడు. గతంలో టీడీపీ పాలనలో వారికి ఓటేసేవారికే పథకాలు అందేవని.. కానీ జగన్ పాలనలో అలాంటి సంఘటనలు ఎక్కడా చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చాడు. కులం, మతం, పార్టీతో సంబంధం లేకుండా.. చేతికున్న ఐదు వేళ్లలాగా సమాజంలోని అన్ని వర్గాల వారికి సీఎం జగన్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నాడు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకం గురించి వలంటీర్లు ఇంటి వద్దకే వచ్చి సమాచారం ఇవ్వడమేకాక.. లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరే వరకు రోజుకు నాలుగు సార్లు ఇంటికే వచ్చి వివరాలు అందజేస్తున్నారని ప్రశంసించాడు సదరు వ్యక్తి.
ప్రజలకు మేలు చేసే పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి.. దేశంలోనే బెస్ట్ సీఎంగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం జగన్ గొప్పతనం గురించి స్వరాష్ట్రం ఏపీలో కొందరికి తెలయకపోవడం విచారకరం అన్నాడు. తాను వ్యాపార పనుల నిమిత్తం ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు.. అక్కడి ప్రజలు ‘‘మీ సీఎం చాలా గ్రేట్ అండి.. ప్రజల సంక్షేమ కోసం ఏమైనా చేస్తారు’’ అని ప్రశంసిస్తున్నారు.. వారి మాటలు వింటే తన గుండె ఉప్పొంగి పోతుంది అని తెలిపాడు. సీఎం జగన్ ఒక్కసారి చెప్పాడంటే.. ఆరునూరైనా సరే తప్పక చేసి చూపిస్తాడు అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment