న్యూఢిల్లీ: బిడ్డకు చిన్న దెబ్బతగిలితేనే తల్లి హృదయం విలవిల్లాడుతుంది. పిల్లలు ఏ చిన్నాపాటి అనారోగ్యానికి గురైన అమ్మ మనసు సహించదు. బిడ్డలు కోలుకునే వరకు వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. దురదృష్టం కొద్ది బిడ్డ మరణిస్తే.. ఆ తల్లి కడుపుకోతను వర్ణించడానికి మాటలు చాలవు. ఇలాంటి తల్లి ప్రేమ మనుషులకే కాదు.. జంతువులకు కూడా ఉంటుంది. వాటి బిడ్డలకు ఏం జరిగినా అవి కూడా తట్టుకోలేవు. ఇందుకు నిదర్శనంగా నిలిచే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి హృదయం ద్రవిస్తోంది. చనిపోయిన పిల్ల పెంగ్విన్‌ని చూసి దాని తల్లిదండ్రులు హృదయవిదారకంగా విలపించాయి. ఐఎఫ్‌ఎస్ అధికారి సుశాంత నంద తన ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేశారు.
‘‘జీవితం అంటేనే ఇలా ఉంటుంది. తమ బిడ్డను కోల్పోయినందుకు ఈ రెండు పెంగ్విన్‌లు సంతాపం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మహమ్మారి టైంలో తమ ప్రియమైన వారిని కోల్పోయి.. బాధపడుతున్న వారికి దేవుడు ఆత్మనిబ్బరాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అంటూ సుశాంత నంద వీడియో షేర్ చేశారు. ఇక దీనిలో ఓ పెంగ్విన్ జంట చనిపోయిన బిడ్డను అటు ఇటు దొర్లిస్తూ.. ముక్కుతో దాన్ని కదుపుతూ లేపే ప్రయత్నం చేశాయి. కానీ దానిలో ఎలాంటి చలనం లేదు. బిడ్డ చనిపోయిందని తెలిసి ఆ పెంగ్విన్‌ల గుండె పగిలింది. బిడ్డను చూస్తూ.. మౌనంగా రోదించాయి. వాటి వేదన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది.
చదవండి: షాకింగ్: తెలిసిన వాడని ఫోటో పంపితే.. దాన్ని మార్ఫ్ చేసి
Comments
Please login to add a commentAdd a comment