వైఎస్సార్ వ్యూపాయింట్ వద్ద నేమ్ బోర్డు ధ్వంసం
విశాఖ సిటీ/ ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖ నగరంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయారు. రుషికొండ పర్యాటక భవనాలపై టీడీపీ జెండా ఎగుర వేశారు. బీచ్‌రోడ్డులో అభివృద్ధి చేసిన వైఎస్సార్ వ్యూపాయింట్ వద్ద ఉన్న వైఎస్సార్ నేమ్ బోర్డును కాళ్లతో తన్నుతూ తొలగించారు. వీఐపీ రోడ్డు జంక్షన్ వద్ద ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఏర్పాటు చేసిన స్టాపర్లను తొలగించారు.
ట్రాఫిక్ పోలీసులు వారిస్తున్నా.. జేసీబీతో కొన్ని స్టాపర్లను తీసేశారు. బుధవారం టీడీపీ విశాఖ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీతో పాటు మరికొందరు నాయకులు, జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ స్టాపర్లను తొలగించారు. సాయంత్రానికి పోలీసులు మళ్లీ వాటిని ఏర్పాటు చేశారు.
విశాలాక్షినగర్ సమీపంలో బీచ్‌రోడ్డులో సీతకొండ వద్ద వైఎస్సార్ సీ వ్యూ పాయింట్ బోర్డును కొందరు ధ్వంసం చేశారు. ఇక్కడ వై.ఎస్.ఆర్. అనే అక్షరాలపై మంగళవారం రాత్రి అబ్దుల్ కలాం పేరుతో ఉన్న సిక్కర్‌ను అంటించారు. బుధవారం ముగ్గురు వ్యక్తులు అబ్దుల్ కలాం స్టిక్కర్‌ను తొలగించారు. బోర్డుపై ఉన్న వై.ఎస్.ఆర్. అక్షరాలను రాడ్డులతో కొట్టి తీసేశారు.
మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ దాడి
సుబ్బారెడ్డి సోదరుడికి తీవ్ర గాయాలు ∙ఎమ్మెల్యేగా ఎన్నికైన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే దాడి
రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి రూరల్ మండలం మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ప్రశాంతంగా ఉన్న ఎండపల్లి గ్రామంలో అలజడి మొదలైంది. అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు సిద్దార్థ గౌడ్, అతని అనుచరులు ఈ దాడికి పాల్పడినట్లు సుబ్బారెడ్డి కుటుంబీకులు చెబుతున్నారు. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన రాంప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఈ దాడి జరిగింది. ఆ సమయంలో అనారోగ్యం కారణంగా సుబ్బారెడ్డి ఇంటిలో లేరని కుటుంబ సభ్యులు తెలిపారు.
బుధవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఎండపల్లి గ్రామం బోయపల్లెలో సుబ్బారెడ్డి ఇంటిపైకి సిద్ధార్ధ గౌడ్, అతని అనుచరులు ఒక్కసారిగా దాడికి దిగారు. రాళ్లు రువ్వుతూ దాడికి తెగబడ్డారు. ఇంటి బయట ఉన్న సుబ్బారెడ్డి కారు అద్దాలను ధ్వంసం చేశారు. దాడిని అడ్డుకోబోయిన సుబ్బారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి పైనా దాడి చేసి, తీవ్రంగా గాయపరిచారు. వెంకటరామిరెడ్డి ఇంట్లోకి చొరబడి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు.
విషయం తెలుసుకున్న రాయచోటి డీఎస్పీ రామచంద్రరావు, అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి హుటాహుటిన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాడికి పాల్పడుతున్న వారిని చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment