వకుళ మాత ఆలయం, వకుళ మాత మూలవిరాట్
తిరుపతి రూరల్: వందల ఏళ్ల పాటు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన దివ్యక్షేత్రం. పవిత్ర పుష్కరిణి ఓ వైపు.. దప్పిక తీర్చే నారదతీర్థం మరోవైపు. తిరుమలకు నడిచి వెళ్లే ఎందరో భక్తులకు ఆశ్రయం కల్పించి, మరెందరో నిరాశ్రయుల ఆకలి తీర్చిన దివ్యధామం. అది కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి తల్లి వకుళమాత ఆలయం. ఆ ఆలయంలో గంట కొడితేనే తిరుమలలోని కన్నబిడ్డకు నైవేద్యం పెట్టేవారని ప్రతీతి.
తిరుపతికి 5 కిలో మీటర్ల దూరంలో పేరూరు బండపై ఉన్న ఈ ఆలయం సుమారు 320 ఏళ్ల క్రితం మైసూరు పాలకుడు హైదర్ అలీ దండయాత్రల్లో దెబ్బతింది. విగ్రహం మాయమైంది. ఆలయం చుట్టూ ఉన్న కొండను ఏళ్ల పాటు మైనింగ్ మాఫియా కరిగించింది. వందల ఏళ్ల పాటు ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోక, కనీసం భక్తులు దర్శించుకునేందుకు మెట్లు కూడా లేని దుస్థితిలోకి వెళ్లిపోయింది.
ఈ ఆలయం ఇప్పుడు పూర్వవైభవాన్ని సంతరించుకుంది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న ప్రత్యేక చొరవ, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంకల్పం ఫలించింది. సర్వాంగ సుందరమైన దివ్యక్షేత్రంగా ఆలయం రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ఆలయ మహాసంప్రోక్షణ పనులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 23న ఆలయాన్ని సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నారు.
ఇదీ చరిత్ర..
వకుళమాత ఆలయ నిర్మాణ శైలి పూర్తిగా తిరుమల తరహాలోనే ఉండటం విశేషం. అక్కడి అద్భుతమైన శిల్ప కళా వైభవం, అబ్బురపరిచే నిర్మాణ కౌశలం చూపరులను కట్టిపడేస్తుంది. గతంలో ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని చెబుతారు. తిరుమలకు వచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. ఈ ఆలయంతో పాటు తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలనీ హైదర్ అలీ హుకుం జారీ చేశాడు.
ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం మాత్రం పాడుకాలేదు. కానీ విగ్రహాన్ని మాత్రం ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీప, ధూప నైవేద్యాలకు నోచుకోలేదు. ఆ ఆలయం ఆమెది కాదని 2019 వరకూ మైనింగ్ మాఫియా వాదించింది. అయితే.. పేరూరు కొండపైన క్రీ.శ.1198 నాటికే ఆలయం ఉండేదనే చారిత్రకాధారం జీర్ణోద్ధరణ పనులు జరుగుతున్నప్పుడు వెలుగులోకి వచ్చింది.
అభివృద్ధి పనుల్లో భాగంగా 2019లో ఆలయం ఎదుట మట్టిని తొలగిస్తున్నపుడు తమిళ అక్షరాలతో ఓ శిలాశాసనం కనిపించింది. భారత పురావస్తుశాఖ డైరెక్టర్ డాక్టర్ మునిరత్నంరెడ్డి ఆధ్వర్యంలో ఈశాసనాన్ని అధ్యయనం చేశారు. క్రీ.శ.1198లో చోళరాజులు వేసిన తమిళ శాసనంగా దానిని నిర్ధారించారు. చోళరాజ్యంలో సామంతుగా రెండవ వీరభల్లాలుడు క్రీ.శ.1173 నుంచి క్రీ.శ. 1220 వరకు ఈ ప్రాంతాన్ని పాలించినట్లు తిరుపతికి సమీపంలోని యోగిమల్లవరం పురాతన శివాలయంలో లభించిన శాసనాల ద్వారా ఆధారాలు ఉన్నాయి. అప్పటికే ఈ ఆలయం నిర్మితమై ఉందని ఈ శాసన సారాంశం. దీంతో ఆలయం ప్రాచీనత మీద నడిచిన వివాదానికి తెరపడినట్లయింది.
పరిపూర్ణానంద స్వామి పోరాటంతో..
వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ కోసం కాకినాడ శ్రీపీఠం అధిపతి స్వామి పరిపూర్ణానంద భక్తులతో కలిసి పాదయాత్రలు చేశారు. న్యాయస్థానంలో కేసులు వేయించి అనుకూల తీర్పును సాధించారు. టీటీడీనే వకుళమాత ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేయాలని కోర్టులు సైతం తీర్పు ఇచ్చాయి. స్వామి పోరాటానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాజకీయ నేతలు, అధికారులు సైతం తోడ్పాటు అందించారు. దీంతో టీటీడీ నిధులు మంజూరు చేసి ఆలయానికి చేరుకునేందుకు ఇనుప మెట్లను, గుడి వద్ద చిన్న, చిన్న పనులు చేయించింది.
సొంత నిధులిచ్చిన పెద్దిరెడ్డి..
తిరుచానూరులోని అలివేలు మంగాపురం తరహాలో దివ్యక్షేత్రంగా వకుళమాత ఆలయాన్ని తీర్చిదిద్ధేందుకు ప్రభుత్వం, టీటీడీ అధికారులతో కలిసి పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. సొంత నిధులతో ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేసేందుకు పెద్దిరెడ్డి ముందుకొచ్చారు. సీఎం వైఎస్ జగన్‌ను తన కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డితో కలసి ఆలయ పూర్వాపరాలను పెద్దిరెడ్డి వివరించారు. సీఎం దిశానిర్దేశం, పెద్దిరెడ్డి చొరవతో ఆలయానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా పనుల రూపకల్పన జరిగింది. దీంతో కేవలం 4 ఎకరాలకే పరిమితమైన ఆలయాన్ని 83.41 ఎకరాలకు విస్తరించారు.
చుట్టూ ప్రహరీ నిర్మించారు. నాటి శిల్పకళావైభవం చెక్కుచెదరకుండా గుడి గోడలను బలోపేతం చేశారు. గోపురాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. గర్భగుడికి బంగారంతో తాపడం చేయించారు. నాడు శిథిలమైన గోడలతో నిండిన ఈ ఆలయ గర్భగుడి నేడు సుదూర ప్రాంతాలకు సైతం తన స్వర్ణకాంతులను ప్రసరింపజేస్తోంది. తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడలోని కనకదుర్గమ్మ ఆలయం తర్వాత బంగారు తాపడం చేసిన గర్భగుడిగా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. మంత్రి పెద్దిరెడ్డి సొంత నిధులతో ఈ ఆలయాన్ని బంగారు తాపడం చేయించారు.
ఆలయం వద్ద కళ్యాణాలు చేసుకునేందుకు వీలుగా మండపాలు నిర్మిస్తున్నారు. నామకరణం, అన్నప్రాసన, అక్షరాభ్యాసం వంటి వైదిక సంస్కారాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పరిమళ పుష్కరిణికి పునరుజ్జీవం నింపారు. ఆలయానికి ఈశాన్యంలో నూతనంగా పుష్కరిణిని నిర్మించారు. పూతలపట్టు–నాయుడుపేట జాతీయరహదారి నుంచి ఆలయం వరకు సెంట్రల్ లైటింగ్‌తో అందమైన సీసీ రోడ్డు ఏర్పాటు చేస్తున్నారు.
ఆలయం చుట్టు పక్కల పచ్చదనం నింపేందుకు దేశ, విదేశాల నుంచి తెప్పించిన మొక్కలతో వనాలను పెంచుతున్నారు. కొండను చేరుకునేందుకు ఘాట్‌రోడ్డును నిర్మించారు. ఈ ఆలయాన్ని ఈనెల 23న ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎం రాకకు వీలుగా ఆలయానికి సమీపంలోని సి.మల్లవరంలో హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేసేందుకు ప్రాంగణాన్ని సిద్ధం చేశారు.
చరిత్రలో నిలిచిపోయేలా నిర్మాణం
వకుళమాత ఆలయం చరిత్రలో నిలిచిపోయేలా నిర్మించాం. వందల ఏళ్లుగా ఈ ఆలయం జీర్ణోద్ధరణకు నోచుకోక పాడుబడింది. ఈ విషయమై గడిచిన 45 సంవత్సరాలుగా టీటీడీ అనేక కోర్టుల్లో పోరాటం చేసి విజయం సాధించింది. గతంలో తిరుమలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వచ్చినపుడు ఆలయ చరిత్రను ఆయనకు వివరించి, పునఃనిర్మిస్తామని చెప్పాం.
ఆలయ నిర్మాణ బాధ్యతలు నాకు అప్పగిస్తూ.. నిర్ణయం తీసుకోవాలని టీటీడీ ఈవోను ఆదేశించారు. ఆ మేరకు అత్యద్భుతమైన నిర్మాణం సాధ్యమైంది. ఆలయ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని 83.41 ఎకరాల భూమిని సమకూర్చాం.
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇంధన, అటవీ, భూగర్భ గనుల శాఖ మంత్రి
Comments
Please login to add a commentAdd a comment