సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ వివాదాలకు శాశ్వతంగా తెరదించేలా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు – భూ రక్ష’ పథకం ద్వారా భూముల రీ సర్వే ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే పలు గ్రామాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కాగా తాజాగా మరో 650 గ్రామాల్లో సమగ్ర భూసర్వే ప్రక్రియ తుదిదశకు చేరుకుంది. సర్వే ముగింపునకు సంబంధించి నెంబర్ 13 ముసాయిదా నోటిఫికేషన్లు డిసెంబర్ 22వతేదీలోపు ఇచ్చేందుకు సర్వే, సెటిల్మెంట్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం అన్ని జిల్లాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు.
అభ్యంతరాల పరిశీలన..
సర్వే ఆఫ్ ఇండియా అందచేసిన డ్రోన్ ఫొటోలు, క్షేత్ర స్థాయిలో భూ యజమానులు చూపించిన సరిహద్దులను సరిచూసి కొలతలు వేసే పనిని ఇప్పటికే పూర్తి చేశారు. ఆయా గ్రామాల సరిహద్దులు, గ్రామ కంఠాలు, ప్రభుత్వ భూములు, పట్టా భూముల సర్వే దాదాపుగా పూర్తైంది. వీటి ప్రకారం కొత్తగా రూపొందించిన కొలతలపై భూ యజమానుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తున్నారు. వీటిని అక్కడికక్కడే పరిష్కరించేందుకు మొబైల్ మెజిస్ట్రేట్లు చర్యలు తీసుకుంటున్నారు. అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత రైతుల ఆమోదంతో తుది రికార్డులు రూపొందిస్తారు. ఈ పనులన్నీ డిసెంబర్ 22లోపు పూర్తి చేసి నెంబర్ 13 నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు జరుగుతోంది.
ప్రయోగాత్మక సర్వేతో పూర్తి స్పష్టత
రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున మొత్తం 51 గ్రామాల్లో ఇప్పటికే ప్రయోగాత్మకంగా నిర్వహించిన రీ సర్వే ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తైనట్లు సర్వే శాఖ అధికారులు తెలిపారు. ఆయా గ్రామాల్లో కొత్తగా భూమి రిజిష్టర్లు, మ్యాప్‌లు అందుబాటులో ఉంచారు. ప్రతి భూమికి ఒక విశిష్ట సంఖ్య కూడా కేటాయించారు. ప్రతి గ్రామంలో సగటున ఒక ఎకరం తేడా కూడా లేకుండా కొత్త సరిహద్దులు నిర్ణయించారు. రెండు చోట్ల మాత్రం 3 ఎకరాలకు పైబడి తేడా ఉండడంతో రైతుల ఆమోదంతో వివాదాలకు ఆస్కారం లేకుండా హద్దులను నిర్ణయించారు.
రీ సర్వేకు ముందు ఈ గ్రామాల్లో మొత్తం 6,405 సర్వే నెంబర్లు ఉండగా సర్వే తర్వాత రూపొందించిన కొత్త రికార్డుల ప్రకారం 21,374 ఎల్‌పీ (ల్యాండ్ పార్సిల్స్)గా నమోదు చేశారు. ఈ రికార్డుల ప్రకారమే ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు చేసేందుకు అవసరమైన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించారు. మొత్తంగా 51 గ్రామాల్లో జరిగిన ప్రయోగాత్మక సర్వేతో రీసర్వేపై పూర్తి స్పష్టత వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మిగిలిన గ్రామాల్లో సర్వేను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment