మునిసిపాలిటీల్లోనూ అడ్డగోలు వ్యవహారాలే | Comptroller and Auditor General Fires On Past TDP Govt | Sakshi
Sakshi News home page

మునిసిపాలిటీల్లోనూ అడ్డగోలు వ్యవహారాలే

Published Sat, May 22 2021 4:55 AM | Last Updated on Sat, May 22 2021 4:58 AM

Comptroller and Auditor General Fires On Past TDP Govt - Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో అప్పటి పెద్దల సన్నిహితులకు అడ్డగోలుగా మునిసిపల్‌ స్థలాలను కట్టబెట్టేశారు. నిబంధనలకు విరుద్ధంగా మునిసిపల్‌ ఆస్తుల శాశ్వత బదలాయింపు, లీజుల పేరిట అస్మదీయులకు ధారాదత్తం చేశారు. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి మొబలైజేషన్‌ అడ్వాన్సులు వసూలు చేయలేదు. 2019 మార్చి 31తో ముగిసిన కాలానికి కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) సమర్పించిన నివేదికలో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విశాఖపట్నం మెట్రో రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (వీఎంఆర్డీయే)కి చెందిన 313.79 చదరపు గజాల స్థలాన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వం తమ సన్నిహితుల సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా అత్యంత తక్కువ రేటుకు కట్టబెట్టేసింది.

మార్కెట్‌ విలువ ప్రకారం అక్కడ గజం రూ.48 వేలుగా ఉందని వీఎంఆర్డీయే ప్రభుత్వానికి నివేదించింది. కానీ.. టీడీపీ పెద్దల ఒత్తిడితో అప్పటి కేబినెట్‌ చదరపు గజం కేవలం రూ.16 వేల చొప్పున ఆ సంస్థకు అప్పగించింది. నిబంధనల ప్రకారం భూ కేటాయింపు ప్రతిపాదనలు రాష్ట్ర భూ నిర్వహణ అథారిటీ ద్వారా రాష్ట్ర మంత్రివర్గానికి వెళ్లాలి. కానీ ఆ అథారిటీ పరిశీలించకుండానే, సిఫార్సు లేకుండానే అప్పటి మంత్రివర్గం ఆమోదించేసింది. దాంతో ప్రభుత్వానికి రూ.కోటి నష్టం వాటిల్లింది. అంతేకాదు చదరపు గజానికి రూ.16 వేల చొప్పున ఆ సంస్థ చెల్లించాల్సిన మొత్తం రూ.50.21 లక్షలకు గాను కేవలం రూ.40.21 లక్షలే చెల్లించింది. మిగలిన రూ.10 లక్షలు చెల్లించకపోయినా వీఎంఆర్డీయే పట్టించుకోలేదు. 

లీజుల్లోనూ ఇష్టారాజ్యం
విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వివేకానంద కల్యాణ మండపాన్ని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ నేతల సన్నిహితులకు 2015లో మూడేళ్లకు లీజుకు ఇచ్చేశారు. ఈ అడ్డగోలు వ్యవహారంతో విశాఖపట్నం కార్పొరేషన్‌కు రూ.92.67 లక్షల నష్టం వాటిల్లింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో 24 గంటల తాగునీటి సరఫరా కోసం ప్యాకేజీ–1 కింద రూ.86.90 కోట్ల పనులను ఎస్‌ఎంసీ–సీసీఎస్పీల్‌–ఈసీఎల్‌ అనే జాయింట్‌ వెంచర్‌ సంస్థకు అప్పగించారు. పనులు త్వరగా పూర్తి చేయాలనే షరతుపై జీవీఎంసీ కాంట్రాక్టరుకు రూ.8.69 కోట్లు మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ చెల్లించింది. కానీ కాంట్రాక్ట్‌ సంస్థ కేవలం 30 శాతం పనులు మాత్రమే చేసి 2016 జూలై అర్ధంతరంగా పనులు వదిలేసి వెళ్లిపోయింది. ఆ సంస్థ నుంచి మొబలైజేషన్‌ అడ్వాన్స్‌ను మునిసిపల్‌ కార్పొరేషన్‌ వసూలు చేయలేకపోవడంతో ప్రజాధనం రూ.8.69 కోట్లు నష్టపోవాల్సి వచ్చింది. అనంతపురం మునిసిపల్‌ మార్కెట్‌  లీజు, అద్దె మొత్తాలను వసూలు చేయడంలో అధికారులు విఫలమయ్యారు. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి 2011–12 నుంచి 2015–16 వరకు అద్దెలు వసూలు చేయకపోవడంతో రూ.1.57 కోట్ల నష్టం వాటిల్లింది. 

నిరుపయోగమైన ఆర్జీయూకేటీ పరికరాలు
రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్‌ నాలెడ్జి టెక్నాలజీ (ఆర్జీయూకేటీ)లో విద్యార్థుల ప్రయోజనాల కోసం రూ.1.95 కోట్లతో 2013–2014లో ఏర్పాటుచేసిన విలువైన పరికరాలను నిరుపయోగంగా ఉంచారని కాగ్‌ నివేదిక తప్పుబట్టింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ పరికరాలను వినియోగించడంలో నిర్లిప్తంగా ఉండడాన్ని ఎండగట్టింది. ఆర్జీయూకేటీలో ఇన్‌స్ట్రుమెంటెడ్‌ పెండ్యులం ఇంపాక్ట్‌ టెస్టర్, 100 కెఎన్‌ హై టెంపరేచర్‌ యూనివర్సల్‌ టెస్టింగ్‌ మెషిన్‌ సరఫరాకు ఒక సంస్థకు 2013–2014లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్డర్‌ ఇచ్చింది. 2014 ఆగస్టులో ఈ పరికరాలను ఆర్జీయూకేటీ ఇడుపులపాయ క్యాంపస్‌కు అందించారు. పరికరాలు సరఫరా చేసిన సంస్థకు 90 శాతం అంటే రూ.1.75 కోట్లను ఆర్జీయూకేటీ చెల్లించింది. మిగిలిన 10 శాతాన్ని పరికరాలు అమర్చి వాటి వినియోగం ప్రారంభం అయిన తరువాత చెల్లించాల్సి ఉంది. ఈ పరికరాలను అమర్చి తమకు ఉపయోగపడేలా చేయాలని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులు, అధ్యాపకులు విన్నవించినా ఐదేళ్లు పట్టించుకోలేదు. మెటలర్జికల్‌ మెటీరియల్స్‌ ఇంజనీరింగ్‌ భవన నిర్మాణం పూర్తికాకపోవడం, విద్యుత్‌ లేకపోవడంతో పరికరాలు అమర్చలేదని ఆర్జీయూకేటీ సమాధానం ఇచ్చినట్లు కాగ్‌  తెలిపింది. అమర్చడానికి స్థలం నిర్ధారించకుండా పరికరాలు సేకరణను తప్పుబట్టింది. 

పాఠశాలల్లో పనులు చేయలేదు
ఉపాధి హామీ పథకం కింద 3 వేల పాఠశాల మైదానాలను ఆటస్థలాలుగా అభివృద్ధి చేయాలని 2017 ఫిబ్రవరిలో పాఠశాల విద్యాశాఖ సూచనలిచ్చింది. రూ.58.28 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో 2019 సెప్టెంబర్‌ నాటికి రూ.15.59 కోట్లతో 1,046 పనులు పూర్తయ్యాయి. రూ.42.69 కోట్లతో చేయాల్సిన పనులు పూర్తికాలేదని కాగ్‌ ఎత్తిచూపింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్థలం అందుబాటులో లేకపోతే ప్రత్యామ్నాయ స్థలాన్ని చూపాలని అధికారులకు సూచించామని, ఇంకా నివేదికలు రావాల్సి ఉందని 2020 నవంబర్‌లో ప్రభుత్వం తెలిపిందని కాగ్‌ నివేదికలో పేర్కొంది.  

వాణిజ్య పన్నుల శాఖకు రూ.84.11 కోట్లు నష్టం
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక (కాగ్‌)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్‌ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది. 180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్‌ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్‌టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది.

నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు
రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్‌ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్‌ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్‌ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్‌ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్‌ ప్రభుత్వానికి సూచించింది.

రుణ భారంలో పీఎస్‌యూలు
గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్‌ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్‌ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్‌బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్‌ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement