
సాక్షి, అమరావతి: ‘గత వారంలో స్వదేశానికి వెళ్లిపోవాలనుకున్న వారు వెళ్లిపోవచ్చని ఇండియన్ ఎంబసీ చెప్పింది. అయితే, అప్పుడు పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్నాయి. దీంతో ఏం కాదులే అనుకున్నాం. కానీ, ఇంత తీవ్రమైన పరిస్థితులు ఎదురవుతాయని ఊహించలేదు’.. అని ఉక్రెయిన్‌లో ఉన్న తెలుగు విద్యార్థులు చెబుతున్నారు. తాజాగా.. గురువారం ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుకావడంతో వీరంతా అక్కడే ఇరుక్కుపోయారు. దీంతో ఇక్కడున్న వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు పిల్లలకు ఫోన్లు చేస్తూ వారి యోగక్షేమాలు తెలుసుకుంటున్నారు. ఉక్రెయిన్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఆ దేశంలో ఉన్న తెలుగు విద్యార్థులతో ‘సాక్షి’ మాట్లాడింది. వారేమన్నారంటే..
ఏం కాదులే అనుకున్నాం..
నేను వినిచా యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. స్వదేశానికి వెళ్లాలనుకున్న వారు వెళ్లచ్చని గత వారం ఇండియన్ ఎంబసీ చెప్పింది. అయితే, అప్పట్లో యుద్ధం జరగదనుకున్నాం. కానీ, ఇప్పుడు మొదలైంది. దీంతో స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరూ బయటకు రావద్దని సూచించారు. ఎందుకైనా మంచిదని బుధవారమే సరుకులు తెచ్చిపెట్టుకున్నాం. స్వదేశానికి రావడం కోసం ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నాను. విమానాలు ఏర్పాటుచేస్తే వచ్చేస్తాను.
– భానుప్రకాశ్, ఉక్రెయిన్‌లోని గుంటూరు జిల్లా చిర్రావూరు యువకుడు
రెండో ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తే..
నేను కీవ్‌లో ఉంటాను. వార్తలు చూసి మా తల్లిదండ్రులు ఆందోళనతో ఫోన్లు చేస్తున్నారు. గురువారం ఉదయం మొదటి ఎమర్జెన్సీ సైరన్ మోగించారు. ప్రజలు బయటకు వెళ్లకూడదు. రెండో ఎమర్జెన్సీ సైరన్ మోగిస్తే బంకర్లు, ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. తొలి ఎమర్జెన్సీ సైరన్ మోగించడంతో ప్రజలు ముందస్తుగా నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తున్నారు.
– జయంత్, ఉక్రెయిన్‌లోని వరంగల్ యువకుడు
యుద్ధ విమానాలు చక్కర్లు కొడుతున్నాయి
నేను కీవ్ యూనివర్సిటీలో మెడికల్ పీజీ చదువుతున్నా. గురువారం తెల్లవారుజామున పెద్ద శబ్దాలు వచ్చాయి. ఏమైందో అర్థంకాలేదు. ఇక్కడి విమానాశ్రయం పరిసరాల్లో మిస్సైల్స్ ప్రయోగించినట్లు తెలిసింది. ఉదయం స్టేట్ ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎవరూ బయటకు రావద్దని చెప్పారు. మేం ఉంటున్న ప్రాంతంలో యుద్ధ విమానాలు గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. యుద్ధం నేపథ్యంలో వేరే దేశాలకు వెళ్లే విమాన చార్జీలు విపరీతంగా పెంచారు. సాధారణంగా భారత్‌కు రావడానికి వన్ వే చార్జీ రూ.25వేల నుంచి రూ.30వేల మధ్య ఉంటుంది. అయితే ఇప్పుడు గంట గంటకు రేట్లు మారుతున్నాయి. రూ.70 వేల నుంచి రూ.1.20లక్షల వరకూ తీసుకుంటున్నారు. అయినా శనివారానికి టికెట్ బుక్ చేసుకున్నా. ఇంతలోనే సైనిక చర్య ప్రారంభం కావడంతో విమానాలు నిలిపేశారు.
– ముకుంద్, ఉక్రెయిన్‌లోని అనంతపురం జిల్లా కదిరి యువకుడు