కోవిడ్‌ ఆస్పత్రిలో కలకలం..  | Corona Victim Missing At Covid Hospital | Sakshi
Sakshi News home page

చికిత్స కోసం వెళితే.. మిస్సింగ్‌

Published Sun, Aug 2 2020 6:49 AM | Last Updated on Sun, Aug 2 2020 10:31 AM

Corona Victim Missing At Covid Hospital - Sakshi

రోగి మేనల్లుడు పెట్టిన ట్విట్టర్‌ పోస్టు

లబ్బీపేట(విజయవాడతూర్పు): శ్వాస ఇబ్బందిగా ఉందని చికిత్స కోసం కోవిడ్‌ ఆస్పత్రికి వస్తే మనిషే కనిపించకుండా పోయాడని బంధువుల ఆరోపణలతో కలకలం రేగింది. వైద్యులను ప్రశ్నిస్తే.. మీ ఇంటికి ఏమైనా వచ్చారా అంటూ వారు ఎదురు ప్రశ్నిస్తుండటంతో బంధువులు అవాక్కయ్యారు. చికిత్స కోసం వస్తే.. మనిషే కనిపించడం లేదంటూ రోగి బంధువులు తీవ్ర ఆందోళనతో వెతుకులాడారు. అయినా ఆస్పత్రి సిబ్బంది స్పందించలేదు. తన మేనమామ ఆచూకీ తెలుసుకునేందుకు సహాయం చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి, గవర్నర్, డీజీపీ, ఉన్నతాధికారులను ట్యాగ్‌ చేస్తూ ట్విట్టర్‌లో రోగి మేనల్లుడు పోస్టు పెట్టాడు. దీంతో ఆస్పత్రి అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. రాత్రి 7 గంటల సమయంలో సీసీ కెమెరాల్లో మృతదేహాన్ని మార్చురీకి తీసుకువెళుతున్నట్లు గుర్తించారు. మార్చురీకి వెళ్లి చూడగా రోగి పేరు మార్చి అక్కడ ఉంచినట్లు తేలింది.  

వివరాలు ఇలా ఉన్నాయి. గుడివాడకు చెందిన ఓ వ్యక్తి (56)ని శ్వాస ఇబ్బందిగా ఉండటంతో జూలై 27న చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రికి తీసుకు వచ్చారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటలకు వస్తే 30వ తేదీ ఉదయం వరకు అంటే మూడు రోజులు అక్కడే ఉంచి చికిత్స చేశారు. ఆ తర్వాత సూపర్‌ స్పెషాలిటీ బ్లాక్‌ మూడో అంతస్తులోని ఐసీయూకి  మార్చారు. కాగా రోగి బంధువులతో 30వ తేదీ సాయంత్రం ఫోన్‌లో మాట్లాడి బాగానే ఉన్నట్లు చెప్పారు. 31వ తేదీన బంధువులు సమాచార కేంద్రంలో వైద్యులతో మాట్లాడితే శ్వాస మరింత ఇబ్బందిగా మారుతోంది. వెంటిలేటర్‌పై ఉంచాల్సి వస్తుందని చెప్పారు. దీంతో సాయంత్రం వరకు రోగి కుటుంబ సభ్యులు ఆస్పత్రిలోనే ఉండి ఇంటికి వెళ్లిపోయారు. రాత్రి 2 గంటల సమయంలో బెడ్‌పై రోగి లేని విషయాన్ని సిబ్బంది గుర్తించారు. మరలా శనివారం  ఉదయం 8 గంటల సమయంలో మరోసారి చూసి రోగి లేడని నిర్ధారించారు. ఆస్పత్రి సిబ్బంది రోగి కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి రోగి బెడ్‌పై లేడని, మీ ఇంటికి  వచ్చాడా అంటూ అడిగారు. శ్వాస తీసుకోవడమే ఇబ్బందిగా మారి, వెంటిలేటర్‌పై ఉండాల్సిన రోగి ఇంటికెలా వస్తారని వారు ప్రశ్నించారు. అనంతరం కుటుంబ సభ్యులు గుడివాడ నుంచి బయలుదేరి ఆస్పత్రికి చేరుకున్నారు. ఆస్పత్రిలో ఎవరూ వారికి సరైన సమాధానం చెప్ప లేదు.  

ట్విట్టర్‌లో పోస్టుతో కదలిక 
కోవిడ్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం వచ్చిన రోగి మిస్సింగ్‌ అయ్యాడంటూ రోగి మేనల్లుడు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. ముఖ్యమంత్రి, గవర్నర్, డీజీపీ, కోవిడ్‌ స్టేట్‌ నోడల్‌ ఆపీసర్‌లను ట్యాగ్‌ చేస్తూ పోస్టు పెట్టడంతో ఆస్పత్రి అధికారులకు ఆ సమాచారం అందింది. ఆస్పత్రి వర్గాలు ఉరుకులు, పరుగులు పెట్టారు. రోగి ఫొటో తీసుకుని ఆస్పత్రి అంతా గాలించారు. మార్చురీలోని మృతదేహాలను పరిశీలించారు. తొలుత వెళ్లిన వారు మృతదేహాన్ని గుర్తించలేక పోయారు. మాచవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం పోలీసులతో పాటు, దగ్గరి బంధువులు వెళ్లి చూడగా మార్చురీలో మృతదేహం ఉన్నట్లు గుర్తించారు.  

అసలేం జరిగిందంటే.. 
వాస్తవంగా రోగి శుక్రవారం ఉదయమే మరణించాడు. దీంతో అక్కడి సిబ్బంది మృతదేహాన్ని తీసుకువచ్చి మార్చురీలో ఉంచారు. కానీ రోగి పేరు మార్చేసి మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. రోగి మృతి చెందిన తర్వాతే బంధువులు సమాచార కేంద్రంలో వైద్యులను కలిశారు. అప్పటికే రోగి మృతి చెందిన విషయం తెలుసుకోని వైద్యులు సీరియస్‌గా ఉంది.. వెంటిలేటర్‌పై ఉంచాలని చెప్పుకొచ్చారు. దీనిని బట్టి చూస్తే అసలు ఐసీయూలో ఏ బెడ్‌పై ఎవరు ఉన్నారు, ఎవరి పేరు ఏమిటీ, వారి పరిస్థితి ఏమిటనేది పట్టించుకోవడం లేదని  ఈ రోగి విషయంలో అర్ధమవుతోంది. ఇలాంటి ఘటనలు ఇప్పటికే నాలుగైదు జరగడం విశేషం. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement