అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని ఆ నిండు గర్భిణి జయించింది.. పండంటి మగబిడ్డకు జన్మచ్చింది. అంతా బాగుంది అనుకుని ఇంటికి వచ్చిన ఆ తల్లికి ఓ చేదునిజం చెవిన పడడంతో దాన్ని జీర్ణించుకోలేకపోయింది. తనను నవమాసాలు మోసి, కనిపెంచిన కన్నతల్లి కరోనా కాటుకు బలైందని తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలి మృతిచెందింది. దీంతో 16 రోజుల పసికందు తల్లిలేని వాడయ్యాడు. న్యూరాజరాజేశ్వరీపేటలో చోటుచేసుకున్న ఈ విషాధ ఘటన స్థానికులందరిని కన్నీటిపర్వంతమయ్యేలా చేసింది. సేకరించిన వివరాలు ఇవి..
పగబట్టిన ‘కరోనా’..!
సింగ్‌నగర్ ఎంకే బేగ్ స్కూల్ ప్రాంతానికి చెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు సంతానం ఉన్నారు. వెంకటేశ్వరరావు బీఎస్‌ఎన్‌ఎల్‌లో పనిచేసి కొంతకాలం క్రితం పదవీ విరమణ చేసి ఇంటి వద్దే ఉంటున్నారు. వీరి చిన్న కుమార్తె ప్రమీలా తనతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో పనిచేసే న్యూరాజరాజేశ్వరీపేటకు చెందిన గణేష్ అనే యువకుడిని గతేడాది ప్రేమించి పెళ్లిచేసుకుంది. గర్భిణి కావడంతో మూడు నెలల కిందట పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటుంది.
అయితే గత నెలలో ఆ ఇంటి మొత్తానికి కరోనా రావడంతో ప్రమీలా కూడా కోవిడ్ బారిన పడింది. నిండు గర్భిణి కావడంతో తనకు పుట్టబోయే బిడ్డ కోసం ప్రమీలా చాలా ధైర్యంగా నిలబడి కరోనాను జయించింది. 16 రోజుల క్రితం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. 14 రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స చేయించుకున్న ఆమె రెండు రోజుల క్రితమే న్యూఆర్‌ఆర్‌పేటలోని తన అత్తగారింటికి వచ్చింది.
తల్లి మృతిని భరించలేక..
ప్రమీలా తల్లి రమాదేవి కరోనాతో పోరాడుతూ సోమవారం మధ్యాహ్నం చనిపోయింది. పెద్ద ఆపరేషన్ చేయించుకొని ఉండడంతో ప్రమీలకు తన తల్లి మరణవార్త తెలియకుండా అందరూ జాగ్రత్తపడ్డారు. అయితే మంగళవారం ఉదయం తన తల్లి మృతిచెందిన విషయం తెలియడంతో ప్రమీల ఒక్కసారిగా తీవ్ర ఆవేదనకు లోనైంది. పెద్ద ఆపరేషన్ చేయించుకొని ఉండటం, తల్లి మరణవార్తను జీర్ణించుకోలేకపోవడంతో ఒక్కసారిగా అపస్మారక స్థితికి వెళ్లిపోయింది. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం హాస్పిటల్‌కు తరలించేందుకు ప్రయత్నించినప్పటికి మార్గం మధ్యలోనే ఆమె మృతిచెందింది.
ఆనందం.. అంతలోనే విషాదం..
తన భార్య ప్రమీల కరోనాని జయించడంతో పాటు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చి ఇంటికి రావడంతో గణేష్ కుటుంబ సభ్యుల ఆనందంతో ఆ ఇళ్లంతా నిండిపోయింది. అయితే ఆ సంతోషం రెండు రోజుల ముచ్చటగానే మారి వారికి తీరని విషాదాన్ని మిగిల్చింది. మరో వైపు ప్రమీల తండ్రి వెంకటేశ్వరరావు కూడా మృత్యువుతో పోరాడుతున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment