ఏపీ అరుదైన రికార్డు | CORONA VIRUS: Andhra Pradesh Crosed 1 Crores Testes Mark | Sakshi
Sakshi News home page

ఏపీ అరుదైన రికార్డు: కోటి శిఖరం

Published Mon, Nov 30 2020 5:16 AM | Last Updated on Mon, Nov 30 2020 7:58 AM

CORONA VIRUS: Andhra Pradesh Crosed 1 Crores Testes Mark - Sakshi

‘కోవిడ్‌–19 పట్ల అవగాహన పెరగాలి. భయం పోగొట్టాలి. అది సోకిన వారి పట్ల వివక్ష చూపకూడదు. ఇప్పటికిప్పుడు వ్యాక్సిన్‌ వచ్చేట్లు కనిపించడం లేదు. వీలైనన్ని పరీక్షలు చేసి, వ్యాధి వ్యాప్తిని నిరోధించడమే మన ముందున్న మార్గం. కోవిడ్‌తో కలసి జీవించక తప్పని పరిస్థితి’ అని ఏపీ సీఎం అందరికంటే ముందుగా చెప్పినప్పుడు నవ్వుకున్న వారు, విమర్శించిన వారు తరువాత ఆ వ్యాఖ్యలతో ఏకీభవించారు. కోవిడ్‌ చికిత్సలో వైఎస్‌ జగన్‌ విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టి దేశంలోనే శిఖరాగ్రాన నిలిచారు.

సాక్షి, అమరావతి: కోవిడ్‌ చికిత్సలో రాష్ట్ర ప్రభుత్వం శూన్యం నుంచి శిఖరాగ్రం చేరింది. కోవిడ్‌ నివారణకు విప్లవాత్మక చర్యలు తీసుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షల్లో మరో కీలక మైలు రాయిని అధిగమించింది. ఆదివారం నాటికి ఏపీలో కోటి నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. కరోనా వైరస్‌ రాష్ట్రంలో ప్రవేశించే నాటికి ఒక్క ల్యాబొరేటరీ కూడా లేని పరిస్థితిని అధిగమించి.. ప్రతి మిలియన్‌ జనాభాకు ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రాల్లో ముందు వరుసలో నిలిచింది. కరోనా వైరస్‌ను గుర్తించిన నాటి నుంచి అప్రమత్తంగా వ్యవహరిస్తూ, వైద్య పరీక్షలతో పాటు, క్వారంటైన్, ఐసోలేషన్, ఆస్పత్రుల్లో చికిత్స, రోగులు కోలుకున్న తర్వాత వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చడం వరకు ప్రతి అంశంలో ప్రత్యేకత చాటుకుంది.  

టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్‌
వీలైనన్ని చోట్ల కరోనా వైద్య పరీక్షలు నిర్వహించడం, పాజిటివ్‌ కేసులు గుర్తిస్తే వెంటనే వారికి క్వారంటైన్‌ లేదా ఐసొలేషన్‌ చేయడం, అవసరమైతే ఆస్పత్రుల్లో చికిత్స చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం చురుకుగా వ్యవహరిస్తోంది. అందుకే తక్కువ వ్యవధిలోనే కోటి వైద్య పరీక్షల మైలు రాయిని దాటింది. రాష్ట్రంలో తొలుత కరోనా పరీక్షలకు అనువైన ల్యాబ్స్‌ లేకపోవడం వల్ల, ఫిబ్రవరి 1న తొలి శాంపిల్‌ను తెలంగాణలోని గాంధీ ఆస్పత్రికి పంపించారు. ఆ తర్వాత రాష్ట్రంలో తొలి కరోనా పరీక్ష మార్చి 7న తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్‌)లో నిర్వహించారు.

తొలి దశలో కేవలం స్విమ్స్‌లో మాత్రమే కరోనా వైద్య పరీక్షలు నిర్వహించే సదుపాయం ఉండగా, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మొత్తం 150 ల్యాబ్‌లలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 14 వైరాలజీ ల్యాబ్‌లు, మరో 4 ప్రైవేటు ల్యాబ్‌లలో కూడా కరోనా వైద్య పరీక్షలు చేస్తున్నారు. 90 ట్రూనాట్‌ ల్యాబ్స్, 6 సీబీనాట్, 5 నాకో, 5 సీఎల్‌ఐఏ ల్యాబ్‌లతో పాటు, ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో 44 వీఆర్‌డీఎల్‌ ల్యాబ్‌లు పని చేస్తున్నాయి. వాటన్నింటిలో కలిపి రోజుకు 70 – 75 వేల వైద్య పరీక్షలు చేసే స్థాయికి రాష్ట్రం చేరుకుంది. శాంపిళ్ల సేకరణకు 122 బస్సులలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉదయం 9 గంటలకు 1,00,17,126 పరీక్షలు నిర్వహించి, రికార్డు సృష్టించింది. ఇందులో 8,67,683 కేసులు పాజిటివ్‌గా తేలాయి.

జిల్లాల వారీగా పరీక్షలు.. 104 కాల్‌ సెంటర్‌
అనంతపురం జిల్లాలో 8,09,025 పరీక్షలు, చిత్తూరు – 7,91,735, తూర్పు గోదావరి – 9,67,422, గుంటూరు – 8,52,177, వైఎస్సార్‌ కడప – 6,87,017, కృష్ణా – 8,03,134, కర్నూలు – 8,92,927, నెల్లూరు – 6,92,285, ప్రకాశం – 7,11,492, శ్రీకాకుళం – 6,83,370, విశాఖపట్నం – 7,61,899, విజయనగరం – 5,44,937, పశ్చిమ గోదావరి జిల్లాలో 8,19,706 మందికి కరోనా పరీక్షలు చేశారు. కోవిడ్‌ ఆస్పత్రుల్లో నాణ్యతతో కూడిన వైద్యం, మంచి వైద్య సదుపాయాలు, మంచి ఆహారం, శానిటేషన్‌ తప్పనిసరిగా ఉండేలా పర్యవేక్షిస్తోంది. కోవిడ్‌ లక్షణాలు కనిపిస్తే ఎవరిని కలవాలి? ఏం చేయాలి? ఎక్కడికి వెళ్లాలి? వీటన్నింటికీ సమాధానంగా 104 కాల్‌ సెంటర్‌ ఏర్పాటు చేసింది. ఆ నెంబర్‌కు ఫోన్‌ చేసిన అర గంటలో బెడ్‌ ఏర్పాటు చేసేలా ఏర్పాట్లు చేసింది.

► దేశంలో ఇప్పటి వరకు 13,95,03,803 టెస్టులు జరగ్గా, అందులో ఏపీలో 1,00,17,126 టెస్టులు జరిగాయి. దేశం మొత్తం మీద జరిగిన టెస్టుల్లో ఇది 7.18 శాతం.
► దేశంలో కోటి టెస్టులు చేసిన రాష్ట్రాలు ఐదు మాత్రమే ఉన్నాయి. అందులో ఆంధ్రప్రదేశ్‌ ఒకటి. ఇతర నాలుగు రాష్ట్రాలు ఏపీకంటే జనాభాలో పెద్దవి. (బీహార్‌ – 14275274, కర్ణాటక – 10914872, మహరాష్ట్ర – 10722198, తమిళనాడు –    11930240, ఆంధ్రప్రదేశ్‌    – 10017126 టెస్ట్‌లు చేశాయి.)  
         

ఎన్ని టెస్టులకు ఎన్ని రోజులు సమయం


రాష్ట్రం ముందు చూపుపై సర్వత్రా ప్రశంసలు
► కోవిడ్‌–19 కట్టడిలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించిందని నీతి ఆయోగ్‌ నివేదిక స్పష్టం చేసింది. రెండు ప్రత్యేక యాప్‌ల ద్వారా కోవిడ్‌ పాజిటివ్‌ వ్యక్తుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుతూ వారిని కలిసిన వారికి కూడా పరీక్షలు నిర్వహించిందని ప్రశంసించింది.

► గ్రామ, వార్డు వలంటీర్లతో పెద్ద ఎత్తున ఇంటింటి సర్వే నిర్వహించిందని తన నివేదకలో స్పష్టం చేసింది. వైద్య ఆరోగ్య శాఖ, పరిపాలన యంత్రాంగం, పోలీసులు సమన్వయంతో పనిచేశారని పేర్కొంది. కోవిడ్‌ తొలి రోజుల్లోనే పెద్ద ఎత్తున ట్రూనాట్‌ టెస్టింగ్‌ మిషన్లు, దక్షిణ కొరియా నుంచి రాపిడ్‌ యాంటీ బాడీ కిట్స్‌ను కొనుగోలు చేసిందని స్పష్టం చేసింది. తద్వారా కోవిడ్‌–19 విస్తరించకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నదని తెలిపింది.

► కరోనా మహమ్మారి ప్రభావం వల్ల నెలకొన్న ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆర్థికాభివృద్ధిలో రాష్ట్రం దూసుకెళ్తోందని ఇండియా టుడే స్టేట్స్‌ ఆఫ్‌ స్టేట్స్‌–2020 అధ్యయనంలో వెల్లడైంది. 12 విభాగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు, ఎంటర్‌ప్రైన్యుర్‌షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిపై అధ్యయనం చేసింది.

► పర్యాటక రంగం అభివృద్ధిలోనూ రాష్ట్రం అగ్రభాగన నిలిచింది. వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన రాష్ట్రాల్లో ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. ఆర్థిక రంగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిన రాష్ట్రాల్లో ఆరో స్థానంలో నిలిచింది.

► వివిధ విభాగాల్లో అభివృద్ధిలో ముందజ (మోస్ట్‌ ఇంప్రూవ్డ్‌) వేసిన రాష్ట్రాల్లో 2018లో మన రాష్ట్రాం ఎనిమిదో స్థానంలో నిలిస్తే.. గతేడాది రెండో స్థానంలోకి దూసుకొచ్చింది. ఈ ఏడాది అదే స్థానాన్ని నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది.

► 12 విభాగాల్లో అత్యుత్తమ ప్రదర్శనలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన రాష్ట్రం ఏడో స్థానానికి చేరుకుంది. అభివృద్ధి విషయంలో 2,000 మార్కులకుగాను 1,194.8 మార్కులను సాధించి,  రెండో స్థానంలో నిలిచింది. కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.

► కరోనా కట్టడికి ఏపీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలంగాణ హైకోర్టు సైతం ప్రశంసించింది. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు గట్టి చర్యలు తీసుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ సైతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను ప్రశంసించిన విషయం తెలిసిందే. ఈ విషయంలో పలు రాష్ట్రాలు ఏపీని ఆదర్శంగా తీసుకున్నాయి.

జాతీయ, రాష్ట్ర కోవిడ్‌ లెక్కలు ఇవీ..
జాతీయ స్థాయిలో కోవిడ్‌ మరణాల రేటు 1.46 శాతం
రాష్ట్రంలో కోవిడ్‌ మరణాల రేటు 0.81 శాతం
జాతీయ స్థాయిలో రికవరీ రేటు 93.17 శాతం
రాష్ట్రంలో రికవరీ రేటు 98.23 శాతం  
మిలియన్‌ మందిలో 1,87,587 టెస్టులతో దేశంలోనే ఏపీ అగ్రస్థానం   
జాతీయ స్థాయిలో ప్రతి మిలియన్‌కు 1,00,580 మందికి పరీక్షలు


ఏ నెలలో ఎన్ని టెస్టులంటే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement