
తుని రూరల్: ‘టీడీపీ అధినేత చంద్రబాబుతో మీరు ఐదేళ్లు పార్టనర్‌గా ఉన్నప్పుడే దివీస్ పరిశ్రమకు 560 ఎకరాలు కేటాయించారు. ఇప్పుడు మీరు చెబుతున్న సిద్ధాంతాలన్నీ అప్పుడేమయ్యాయి?’ అని పవన్‌ను తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా ప్రశ్నించారు. ఎస్.అన్నవరంలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. తొండంగి మండలంలో జరిగిన సభలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు.
దివీస్‌కు భూములు కట్టబెట్టిందే కాకుండా అన్ని అనుమతులనూ నాటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. దివీస్‌కు వ్యతిరేకంగా గతంలో జరిగిన పోరాటానికి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. డబుల్ స్టాండ్ తీసుకునేది పవనేనని విమర్శించారు. సీఎం జగన్ ప్రజల పక్షాన పని చేస్తున్నారన్నారు. ప్రజలకు, రైతులకు, యువతకు నష్టం కలిగే పనులు చేయరని చెప్పారు. జీరో పొల్యూషన్‌తో ప్రకృతికి నష్టం వాటిల్లకుండా, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడమే తమ ప్రభుత్వ విధానమన్నారు.