సాక్షి, తిరుపతి: కర్ణాటక రాష్ట్రం మైసూరుకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దక్షిణామూర్తి క్రిష్ణకుమార్ అమ్మ కోసం రూ.లక్షకు పైగా జీతం వస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగం వదిలేసి.. ఓ యాత్రికుడిగా మారాడు. అమ్మకు గైడ్‌గా మారాడు. తల్లి చిన్నప్పటి నుంచి చూడాలని తపించిన దేశంలోని పుణ్య క్షేత్రాలన్నింటినీ స్వయంగా ఓ స్కూటర్‌పైనే తిప్పుతూ చూపిస్తున్నాడు. 2018లో ఈ యాత్రను మొదలుపెట్టారు. మధ్యలో 2020లో కోవిడ్ రావడంతో కొంతకాలం విరామం ఇచ్చారు.
మళ్లీ ఆర్నెల్ల నుంచి యాత్రను మొదలుపెట్టి ఇప్పుడు తిరుమల తిరుపతికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దక్షిణామూర్తి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. జన్మనిచ్చిన తల్లి రుణం తీర్చుకునేందుకు.. తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. తండ్రి జ్ఞాపకంగా మిగుల్చుకున్న పాత బజాజ్ చేతక్ స్కూటర్‌పై 2018 జనవరి 16వ తేదీన భారతదేశ పుణ్యక్షేత్రాల సందర్శనకు శ్రీకారం చుట్టానన్నారు.
ఇప్పటికి దాదాపు 57 వేల కిలోమీటర్ల యాత్రను పూర్తి చేసుకున్నామని వివరించారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, కోల్‌కతా, అరుణాచల్ ప్రదేశ్‌తో పాటు నేపాల్, భూటాన్, మయన్మార్ దేశాలు సందర్శించామని చెప్పారు. శక్తి ఉన్నంత కాలం.. భగవంతుడు తమకు అవకాశం ఇచ్చినంత కాలం ఈ యాత్ర కొనసాగిస్తామని దక్షిణామూర్తి తెలిపారు.
చదవండి: (తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. సెప్టెంబర్ నెల టికెట్లు ఎప్పుడంటే..)
Comments
Please login to add a commentAdd a comment