ఆగిన ‘డప్పు’ చప్పుడు | Dappu Artist Surya Bhagwanta Rao Passed Away At Krishna District | Sakshi
Sakshi News home page

ఆగిన ‘డప్పు’ చప్పుడు

Published Fri, Nov 12 2021 8:10 AM | Last Updated on Fri, Nov 12 2021 10:19 AM

Dappu Artist Surya Bhagwanta Rao Passed Away At Krishna District - Sakshi

డప్పుతో కుంపటి సూర్య భగవంతరావు(ఫైల్‌)

డప్పు కళను ఎల్లలు దాటించిన కళాకారుడు.. చేతిలో ఢం ఢం మని మోగే శబ్దాన్నే తన గుండె చప్పుడుగా మార్చుకున్న ఘనుడు.. అట్టడుగున మగ్గిపోతున్న డప్పు విద్యకు కొత్త హంగులు అద్ది ప్రాచుర్యంలోకి తీసుకొచ్చిన విద్వాంసుడు.. స్వతహాగా ప్రదర్శనలివ్వడమే కాక, దేశ విదేశాల్లో అనేక మందికి తరీ్ఫదునిచ్చి ప్రోత్సహించిన కళాత్ముడు..  ఆ డప్పునకు ప్రాణ హితుడు.. డప్పునే తన ఇంటి పేరుగా మార్చుకున్న సూర్య భగవంతరావు ఇక లేరు. గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. దీంతో ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ఘంటసాల(అవనిగడ్డ): డప్పు చప్పుడునే తన గుండె చప్పుడుగా మార్చుకున్న హంస అవార్డు గ్రహీత కుంపటి సూర్య భగవంతరావు(72) గుండె పోటుతో గురువారం తెల్లవారుజామున మరణించారు. ఘంటసాల మండలం చిట్టూర్పు పంచాయతీ పరిధిలోని ఈపూరివానిగూడెంకు చెందిన కుంపటి సూర్య భగవంతరావు (డప్పు భగవంతరావు) మరణ వార్త తెలుసుకున్న ప్రజా నాట్యమండలి బృందం ఆయన భౌతికకాయాన్ని సందర్శించి పార్టీ కండువా కప్పి ఘన నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.

అలాగే ఘంటసాల మండల, నియోజకవర్గ పరిధిలోని పలువురు కళాకారులు భగవంతరావు భౌతికకాయాన్ని సందర్శించి అంజలి ఘటించారు. డప్పు కళాకారుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని చిట్టూర్పు ఈపూరివానిగూడెంలోని ఆయన స్వగృహంలో ఉంచగా.. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలియజేశారు. భగవంతరావుకు భార్య సువార్తమ్మ, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 

ఇదీ ‘సూర్య’ ప్రస్థానం.. 
చిన్న నాటి నుంచే డప్పుపై ఆసక్తి పెంచుకొని ఆ వాయిద్యాన్ని నేర్చుకున్నారు. ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా డప్పుపై ఉన్న మమకారంతో వివిధ శబ్దాలను పలికిస్తూ.. ఆ విద్యలో ఆరితేరారు. మూస పద్ధతిలో డప్పు వాయించడానికి స్వస్తి పలికి.. కొత్త రీతుల్లో ఆడుతూ, పాడుతూ డప్పు కొడుతూ భగవంతరావు క్రమక్రమంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ డప్పు శబ్దాన్ని వినాలని, ఆయన చేసే విన్యాసాలను చూడాలని ఆశించే ప్రేక్షకుల సంఖ్య పెరిగిపోవడంతో భాషా, భావాలకు అతీతంగా భగవంతరావు ప్రదర్శనలకు వీక్షకులు హాజరయ్యేవారు. 15 ఏళ్ల పాటు ప్రజా నాట్యమండలిలో పని చేసిన భగవంతరావు ఉదయ్‌పూర్‌లో జరిగిన ఉత్సవాల్లో చేసిన ప్రదర్శన చూసిన ఫ్రాన్స్‌ దేశస్తులు.. వారి దేశానికి తీసుకెళ్లి ప్రదర్శన చేయించుకున్నారు.

సినిమాలలో అవకాశం.. 
డప్పు కళలో ప్రావీణ్యం సాధించడంతో సినిమాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపు సన్నివేశాల్లో కూడా భగవంతరావు నటించారు. బ్రహ్మంగారి జీవిత చరిత్ర, నవయుగం, మరో క్విట్‌ ఇండియా, కూలన్న, వర్షం తదితర సినిమాల్లో తన ప్రతిభను కనబరిచారు. 

డప్పు కళ అధ్యాపకునిగా.. 
డప్పుకళను ప్రోత్సహించేందుకు జానపద కళల కింద ఒక కోర్సుగా ఉన్న డప్పు కళను అందరికీ తెలిసేలా చేశాడు. డప్పు కళ ప్రొఫెసర్‌గా బాధ్యతలు చేపట్టి సుమారు 32 ఏళ్లపాటు విద్యార్థులకు తరీ్ఫదునిచ్చారు. అంతేకాక గ్రామాల్లో వేలమందికి నేరి్పంచి సుమారు 20 వేల మంది డప్పు కళాకారులను తయారు చేశారు.

సేవలకు గుర్తింపు.. 
డప్పు భగవంతరావు సేవలను గుర్తించిన నాటి ప్రభుత్వాలు 1992లో హంస అవార్డు, ధర్మనిధి పురస్కారం, 1998లో డప్పు జానపద రత్న, 1994లో డప్పు విద్వాన్, 1992లో డప్పు ప్రవీణ, 1991లో డప్పు విద్య ప్రవీణ అవార్డులతో సత్కరించాయి. అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, యూనివర్సిటీల వారు వందలాది అవార్డులను బహూకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement