సాక్షి, అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో పట్టుబడిన ప్రధాన నిందితుల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక ఆధారాలను సేకరించిన ఏసీబీ అధికారులు నిందితులపై నేర నిరూపణకు అవసరమైన పక్కా కార్యాచరణతో మరింత లోతైన దర్యాప్తును ముమ్మరం చేశారు. కేసులో ఏ–1, ఏ–2, ఏ–3 నిందితులుగా ఉన్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, డెయిరీ ప్రస్తుత ఎండీ పి.గోపాలకృష్ణన్, జిల్లా సహకార శాఖ మాజీ అధికారి (రిటైర్డ్ డీసీవో) ఎం.గురునాథంలను ఏసీబీ అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.
ఇదే కేసులో మాజీ ఎండీ కె.గోపీనాథ్, సంగం డెయిరీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ పి.సాంబశివరావు మరికొందరు నిందితులుగా ఉన్నారు. సంగం డెయిరీలో 1994 నుంచి 2000 వరకు జరిగిన అక్రమాలు, అవకతవకలకు సంబంధించి కీలక ఆధారాలను ఏసీబీ సేకరించినట్టు విశ్వసనీయ సమాచారం. డెయిరీకి చెందిన ప్రభుత్వ ఆస్తులను కొట్టేసే భారీ స్కెచ్‌లో ఆ ముగ్గురూ ఎవరి పాత్ర వారు పోషించినట్టు నిగ్గు తేలుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ వ్యవహారంలో ఆ ముగ్గురి పాత్రపై ఏసీబీ సేకరించిన ప్రాథమిక వివరాలు ఇలా ఉన్నాయి.
అప్పనంగా కట్టబెట్టేశారు
రెండో ప్రధాన నిందితుడైన గోపాలకృష్ణన్ సహకార నిబంధనలను, చట్టాలను పట్టించుకోకుండా డెయిరీకి చెందిన పదెకరాల ప్రభుత్వ భూమిని ధూళిపాళ్ల నరేంద్రకు చెందిన ట్రస్ట్‌కు బదలాయించేశారు. ఆ భూమిని సంగం డెయిరీ అభివృద్ధి కోసం గతంలో ఏపీ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీడీడీసీ) మిల్క్ కమిషనర్ పేరుతో ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమి. మూడో ప్రధాన నిందితుడైన గురునాథం సంగం డెయిరీని సహకార రంగం నుంచి కంపెనీగా మార్చేందుకు జరిగిన కుట్రలో కీలకమైన నకిలీ నిరభ్యంతర ధృవపత్రం (ఎన్‌వోసీ) సృష్టించి ఫోర్జరీకి పాల్పడ్డారు.
ఏదైనా సహకార సంఘం కంపెనీగా మారాలంటే ప్రభుత్వం భూములు, నిధులు వెనక్కి అప్పగించడంతోపాటు జిల్లా సహకార అధికారి (డీసీఓ) నుంచి ఎన్‌వోసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడే గురునాథం పోర్జరీ వ్యవహారం జరిగింది. కంపెనీగా మార్చేందుకు 2011 సెప్టెంబర్ 24న తీర్మానం చేస్తే అంతకు ఏడు నెలల ముందు అంటే అదే ఏడాది ఫిబ్రవరి 26న గురునాథం ఫోర్జరీ ఎన్‌వోసీ సృష్టించారు. నా తరువాత రెండు రోజులకే ఆయన రిటైరయ్యారు. ఇలా సృష్టించిన ఎన్‌వోసీని జతచేసి 2012 సెప్టెంబర్‌లో కంపెనీగా మార్చేందుకు అనుమతి ఇవ్వాలంటూ రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్‌కు దరఖాస్తు చేసి 2013 జూన్ 18న ధూళిపాళ్ల సొంత కంపెనీగా మార్చేసుకున్నారు.
తండ్రి పేరిట భూములు కొట్టేసిన ధూళిపాళ్ల
1973లో ఏర్పాటైన సంగం డెయిరీకి 1992లో ధూళిపాళ్ల నరేంద్రకుమార్ చైర్మన్ అయ్యారు. 1994 నుంచీ అక్రమాలకు తెరతీశారు. తన తండ్రి వీరయ్య చౌదరి పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి.. డెయిరీ ఆస్తులను సొంత ప్రయోజనాలకు దారి మళ్లించేలా స్కెచ్ వేసి 10 ఎకరాలను సొంతం చేసుకున్నాడు. నిధుల దుర్వినియోగం, పదవిని అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాల్పడటం వంటి తీవ్రమైన అభియోగాలు సైతం ధూళిపాళ్లపై ఉన్నాయి.
డెయిరీకి ప్రభుత్వం కేటాయించిన భూమిలో పదెకరాలను సొంత ట్రస్ట్‌కు మళ్లించి.. ఫోర్జరీ పత్రాలతో ఎన్‌డీడీబీ నుంచి రూ.115.58 కోట్ల రుణం తీసుకున్నారు. ఆ డబ్బుతో ప్రభుత్వ భూమిలో సొంతంగా ఆస్పత్రి నిర్మించుకున్నారు. అంతేకాకుండా.. నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడి సహకార డెయిరీని తన కంపెనీగా మార్చుకున్నాడు. తద్వారా డెయిరీకి, ప్రభుత్వానికి చెందిన దాదాపు రూ.700 కోట్ల విలువైన 72.54 ఎకరాలను, ఇతర ఆస్తులను సొంతం చేసుకునేందుకు భారీ స్కెచ్ వేశాడు.
రాజమండ్రి జైలుకు ధూళిపాళ్ల
హైకోర్టు ఆదేశాల మేరకు సంగం డెయిరీ అక్రమాల కేసులో నిందితులైన ధూళిపాళ్ల నరేంద్ర, గోపాలకృష్ణన్, గురునాథంలను ఏసీబీ అధికారులు ఆదివారం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కాగా, హౌస్‌మోషన్ రూపంలో దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు శనివారం రాత్రి ఏసీబీ కస్టడీని రద్దు చేసింది. దీంతో తొలి రోజు విచారణ అనంతరం ముగ్గురు నిందితులను విజయవాడ సబ్ జైలుకు తరలించిన ఏసీబీ అధికారులు ఆదివారం అక్కడి నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలుకు తీసుకెళ్లి అప్పగించారు.
కాగా, కేసు దర్యాప్తు సమాచారాన్ని ఏ మీడియా సంస్థలకు తాము ఇవ్వలేదని ఏసీబీ ఆదివారం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. పోలీస్ కస్టడీలో ఉన్న నిందితులను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన వార్తలను కొన్ని పత్రికలు ప్రచురించాయని, దీనివల్ల కేసు దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపింది. దీనిని దృష్టిలో పెట్టుకుని అనధికార సమాచారాన్ని ప్రచురించవద్దని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment