కేసుపెడితే చాలు.. కక్షసాధింపేనట! | Kommineni Srinivasa Rao Article On Dhulipalla Narendra Arrest | Sakshi
Sakshi News home page

కేసుపెడితే చాలు.. కక్షసాధింపేనట!

Published Wed, Apr 28 2021 12:24 AM | Last Updated on Wed, Apr 28 2021 8:26 AM

Kommineni Srinivasa Rao Article On Dhulipalla Narendra Arrest - Sakshi

ప్రభుత్వం పెత్తనం తగ్గించి సహకార రంగ అభివృద్ధి పేరుతో మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ తెచ్చారు. అప్పట్లో ఐఏఎస్‌ అధికారిగా ఉన్న జయప్రకాష్‌ నారాయణ ఈ చట్టాన్ని రూపొందించడంలో  కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు మొత్తం డెయిరీ ఇండస్ట్రీని కబ్జా చేశారు. తెలివిగా ముందు మాక్స్‌ చట్టంలోకి మారి, ఆ తర్వాత ప్రొడ్యూసర్‌ కంపెనీగా మార్చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి కుటుంబం పెత్తనం కిందకు వచ్చేసిందన్నమాట. ఇవన్నీ పక్కనపెట్టి ఏసీబీ వారు కేసుపెడితే చాలు కక్ష సాధింపు అనే తరహా ప్రచారం ఏపీ రాజకీయాల్లోనే సాధ్యమేమో అనిపిస్తోంది.

తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అరెస్టు వ్యవహారం సహజంగానే దుమారం రేపుతోంది. ధూళిపాళ్లను అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేసిన మరుక్షణం నుంచే టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌ మొదలు, పలువురు టీడీపీ నేతలు ఇది రాజకీయ కక్ష అని వరుస ప్రకటనలు ఇచ్చారు. టీడీపీకి దాదాపు సలహాదారుగా వ్యవహరిస్తున్న ఒక పత్రిక యజమాని కూడా ఒక సలహా ఇచ్చారు. తాను అనుకున్న జాబితా ప్రకారం టీడీపీ నేతలపై జగన్‌ కక్ష సాధిస్తున్నారని, ఆయన లిస్టులో ఉన్న టీడీపీ నేతలంతా స్వచ్ఛందంగా జైలుకు వెళ్లడం మంచిదని సూచించారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరు అక్రమాలకు పాల్పడింది వారికే తెలుసు కనుక, స్వచ్ఛందంగా ఆ కేసుల వివరాలు వెల్లడించి లొంగి పోతే బెటర్‌ అని ఆ పత్రికాధిపతి సలహా ఇచ్చి ఉంటే బావుండేది. 

మీడియా అయినా, ప్రతిపక్ష టీడీపీ అయినా ముందుగా కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చి ఉండాల్సింది. ధూళిపాళ్ల నరేంద్రపై ఏసీబీ పెట్టిన అభియోగాలు ఏమిటి? అవి వాస్తవమైనవా? కాదా? అందుకు ఆధారాలు ఉన్నాయా? లేవా అన్న వాటి జోలికి వెళ్లకుండా, కక్ష అంటూ కోరస్‌ సాంగ్‌ పాడుతున్నారు. వారికి బ్యాండ్‌ బాజాగా ఒక వర్గం మీడియా వాయిస్తోంది. నిజానికి ఈ మీడియానే గతంలో టీడీపీ మునిగిపోవడానికి కారణమని, వాస్తవాలు తెలియనివ్వకుండా భజన చేసి చంద్రబాబును ముంచారని, ఇప్పటికీ చెత్తపలుకు అనో, మరొకటి అనో అదే పని చేస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ధూళిపాళ్లపై తప్పుడు కేసు పెడితే ఎవరూ అంగీకరించకూడదు. రాజ కీయ కక్ష అయితే ఎవరూ సమర్థించకూడదు. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ టీడీపీ అధినేతతో సహా పలువురు టీడీపీ నేతలకు కూడా సంగం డెయిరీలో జరిగిన అక్రమాలు తెలుసు. ధూళిపాళ్ల మంత్రి పదవి కోసం ప్రయత్నం చేసినప్పుడు చంద్రబాబు ఏమి సమాధానం ఇచ్చారో కూడా టీడీపీ వారికి తెలుసు. సంగం డెయిరీలో జరుగుతున్న విషయాలను ఆయన ప్రస్తావించారని అంటారు. కానీ ఇప్పుడు అదే బాబు దీనిని రాజకీయ కక్ష అనో, అమూల్‌ కంపెనీ కోసం సంగం డెయిరీని బలి చేస్తున్నారనో ఆరోపణలు చేస్తున్నారు.

నిజానికి అమూల్‌ వచ్చిన తర్వాత ఏపీలో పోటీ పెరిగి చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌తో సహా అన్ని పాల కంపెనీలు ఐదు నుంచి ఏడు రూపాయలు అదనంగా రైతులకు చెల్లించవలసి వస్తోంది. దీనిని  మనసులో పెట్టుకుని చంద్రబాబు ఈ విమర్శ చేసి ఉండవచ్చు. అమూల్‌ పూర్తిగా రైతుల సంస్థ. అది ఏ ఒక్కరి సొంతం కాదు. కానీ ఏపీలో ఏం జరిగింది? ప్రభుత్వం పెత్తనం తగ్గించి సహకార రంగ అభివృద్ధి పేరుతో మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ సొసైటీస్‌ యాక్ట్‌ తెచ్చారు. అప్పట్లో ఐఏఎస్‌ అధికారిగా ఉన్న జయప్రకాష్‌ నారాయణ ఈ చట్టాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఆ తర్వాత కాలంలో ఆ చట్టాన్ని అడ్డు పెట్టుకుని కొందరు నేతలు మొత్తం డెయిరీ ఇండస్ట్రీని కబ్జా చేశారు. తెలివిగా ముందు మాక్స్‌ చట్టంలోకి మారి, ఆ తర్వాత ప్రొడ్యూసర్‌ కంపెనీగా మార్చేసుకున్నారు. అంటే ఒక వ్యక్తి కుటుంబం పెత్తనం కిందకు వచ్చేసిందన్నమాట. సంగం డెయిరీలో నరేంద్ర రాజకీయాన్ని మరో టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర వర్గం కానీ, దివంగత నేత కోడెల శివప్రసాదరావు వర్గం కానీ వ్యతిరేకించాయో, లేదో టీడీపీ గుంటూరు జిల్లా నాయకులను అడిగితే చెబుతారు. 

ధూళిపాళ్ల అరెస్టు అన్యాయం అని చంద్రబాబు కానీ, మరే నేత కానీ భావిస్తే ఏ రకంగా అక్రమమో చెప్పాలి. సంగం డెయిరీలో అక్రమాలు జరగలేదని వారు చెప్పడం లేదు. నకిలీ పత్రాలు పెట్టి 116 కోట్ల రుణం తీసుకున్నది అవాస్తవం అని వారు ఖండించినట్లు కనపడలేదు. నరేంద్ర తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన ట్రస్టుకు పదెకరాల భూమి బదిలీ చేయడం, ఆ ట్రస్టులో తన కుటుంబ సభ్యులకే పెత్తనం ఇవ్వడం వంటివి జరగలేదని వీరు అనడం లేదు. ప్రభుత్వ అనుమతి లేకుండా అలా భూమి బదిలీ చేయలేదని వీరు చెప్పడం లేదు. సొసైటీలకు బోనస్‌ పేరుతో ఏ రకంగానూ నిధుల దుర్వినియోగం జరగలేదని వీరు అనడం లేదు. సంగం డెయిరీని ప్రైవేటు సంస్థగా మార్చేటప్పుడు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారా లేదా అన్నదానికి వీరు బదులు ఇవ్వడం లేదు. నరేంద్ర మొత్తం సంగం డెయిరీని తన సొంత సంస్థగా మార్చారా లేదా?  వీటిలో ఏ ఒక్కటి వాస్తవం కాదని టీడీపీ నేతలు చెప్పగలిగితే అప్పుడు రాజకీయ కక్ష అని ఆరోపించినా అర్థం ఉంటుంది.  

సంగం డెయిరీలోనే కాదు. ఇతర జిల్లాలలో కూడా ఆ పరిశ్రమలో జరిగిన అవకతవకలను బయటకు తీసుకు వచ్చి క్షాళన చేస్తే మంచిదే. చిత్తూరు సహకార డెయిరీ ఎలా మూతపడిందీ అందరికీ తెలుసు. చంద్రబాబు తన సొంత కంపెనీ హెరిటేజ్‌కు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో సహకార డెయిరీ పరిశ్రమను ఎలా దెబ్బతీసిందీ ఆ రంగంలోని వారికి తెలుసు. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి గల్లా అరుణ గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండేవారు. ఆ రోజుల్లో ఆమె హెరిటేజ్‌పై పలు ఆరోపణలు చేశారు.
కొందరు మాత్రం సంగం డెయిరీ వ్యవహారంపై కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసు ఎసీబీ పరిధిలోకి వస్తుందా? అన్న ప్రశ్న వేస్తున్నారు. అది లీగల్‌గా చూసుకోవలసిన అంశం. అందులో ఏదైనా తప్పు ఉంటే ఏసీబీ వారు బాధ్యత వహించవలసి ఉంటుంది. ప్రభుత్వ భూమిని అక్రమంగా బదలాయించారు కనుక ఏసీబీ పరిధిలోకి వస్తుందని కొందరు వివరిస్తున్నారు. సంగం డెయిరీలో జరిగిన అక్రమాల గురించి వెలికి తీయడం తప్పు కాదని, కాని నరేంద్రను అరెస్టు చేసిన తీరు సరికాదని కొన్ని పక్షాలు వ్యాఖ్యానిస్తున్నాయి. తెల్ల వారుతూనే పోలీసులు పెద్ద సంఖ్యలో నరేంద్ర గ్రామానికి వెళ్లి అరెస్టు చేయాలా అని అంటున్నారు. కాని వాస్తవ రాజకీయ పరిస్థితులు వీరికి తెలియవా? ముందుగా తాము వస్తున్నామని పోలీసులు చెబితే ఏ నిందితుడు అయినా అక్కడే ఉంటారా? తనకు ఏదో రకంగా ముందస్తు బెయిల్‌ వచ్చేవరకు తప్పించుకుని తిరుగుతున్న కేసులు ఎన్ని చూడడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా స్కాములు చేసినవారికి సంబంధించి కొన్ని వార్తలను కూడా ప్రచారం చేయవద్దని ఆదేశించిన ఘట్టాలు చూసిన తర్వాత కూడా అలా అరెస్టు చేయాలి? ఇలా అరెస్టు చేయాలి? అని ఎలా చెప్పగలరు. 

ఒకప్పుడు మీడియా ఏదైనా స్కామ్‌ సమాచారం తెలిస్తే, అందులోని వాస్తవాలను పరిశోధించి రాసేవి. కానీ ఇప్పుడు కుంభకోణాలు చేసినవారికి కొండంత అండగా ఉండడానికి ఒక వర్గం మీడియా పోటీ పడుతోంది. దీనిని బట్టే ఏపీలో రాజకీయం, మీడియా ఏ రకంగా కలిసిపోయి కాలుష్యాన్ని సృష్టిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చు. ఈ వ్యవహారాలలో ప్రభుత్వంవైపు తప్పు ఉంటే నిరభ్యంతరంగా చెప్పవచ్చు. కానీ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కుంభకోణాలకు మద్దతు ఇచ్చే దైన్యస్థితికి కొన్ని ప్రముఖ పత్రికలు పడిపోవడం గర్హనీయమే అని చెప్పాలి. సంగం డెయిరీలో జరిగిన పరిణామాలపై, ఆ పరిశ్రమతో సంబంధాలు కలిగి, టీడీపీకి అనుకూలంగా ఉండే ఒక మాజీ అధికారి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌ ధైర్యంగా అవినీతిని బయటకు తీసుకువచ్చారని, దానిని స్వాగతిస్తున్నానని అన్నారు. ఇంకా మరి కొన్ని జిల్లాలలో కూడా ఇలాంటి అక్రమాలను వెలికితీసి పాడిపరిశ్రమను బాగు చేస్తే రైతులకు ఉపయోగం జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. జగన్‌ ప్రభుత్వం ధైర్యంగా ఆయా జిల్లాలలో పాడి పరిశ్రమకు సంబంధించి జరిగిన అక్రమాలను బయటకు తెచ్చి, రైతులకు ప్రయోజనం చేకూర్చేలా చేయగలిగితే ఎవరెన్ని రాజకీయ విమర్శలు చేసినా పట్టించుకోనవసరం లేదు.


కొమ్మినేని శ్రీనివాసరావు 
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement