వజ్రాల కోసం అన్వేషణ
అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ప్రజలు
మహానంది: నల్లమల.. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, ప్రకృతి అందాలకు, చారిత్రక విశేషాలకు పెట్టింది పేరు. నంద్యాల నుంచి గిద్దలూరు వెళ్లే ఘాట్‌రోడ్డులో సర్వనరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయానికి సమీపంలో ఉల్లెడ మల్లేశ్వరస్వామి ఆలయంతో పాటు వజ్రాల వంక ఉంది. వర్షాలు పడితే వంకలో వజ్రాలు దొరుకుతుంటాయని ప్రజల నమ్మకం. దీంతో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలతో పాటు గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది ప్రజలు తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు ఇక్కడికి వస్తున్నారు. తాజాగా వర్షాలు పడుతుండటంతో వజ్రాన్వేషణ సాగుతోంది.
విలువైన రాళ్లతో ఆదాయం
వజ్రాలు దొరుకుతున్నాయని వస్తున్న వారికి పలు రకాల రంగురాళ్లు దొరుకుతున్నాయి. రంగు రాయి నాణ్యతను బట్టి రూ. 20 వేల నుంచి రూ. లక్ష వరకు వస్తుందని పలువురు చెబుతున్నారు. వారం రోజుల క్రితం గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరికి రూ. లక్ష విలువైన వజ్రాలు దొరికాయని స్థానికులు చెప్పారు. దీంతో ఇక్కడికి వచ్చిన వారు ఉదయం నుంచి చీకటి పడేవరకు వజ్రాన్వేషణ చేసి అనంతరం దగ్గరలోని ఆంజనేయపురం గ్రామం వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయం వద్ద రాత్రి వేళల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల వర్షాలు కురవడంతో వజ్రాన్వేషణ కోసం వస్తున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment