
తాడేపల్లి రూరల్ (మంగళగిరి): ‘దిశ’ యాప్ ఆపదలో ఉన్న ఓ యువతిని కాపాడింది. ఉండవల్లి– అమరావతి కరకట్ట రహదారుల్లో ఓ యువతి ద్విచక్రవాహనాన్ని నలుగురు వెంబడిస్తున్నారని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు సమాచారం అందింది. దీంతో వెంటనే సీఐ అంకమ్మరావు సిబ్బందిని అప్రమత్తం చేసి యువతి కోసం గాలించగా వెంటకపాలెం సమీపంలో ఉన్న యువతిని గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..యువతి విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేస్తుంది.
ఈ క్రమంలో యువతికి బంధువులు వివాహం నిశ్చయించగా, తనకు ఇష్టం లేకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించింది. దీంతో ప్రకాశం బ్యారేజీపై నుంచి ఉండవల్లి కరకట్ట మీదుగా వెంకటపాలెం ఇసుక క్వారీ వరకు ద్విచక్రవాహనంపై వెళ్లింది. అదే సమయంలో నలుగురు యువకులు ఆమెను వెంబడించడాన్ని గుర్తించి కుటుంబసభ్యులకు, దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. యువతి ఫోన్‌లో మాట్లాడటాన్ని గమనించిన యువకులు పరారయ్యారు. యువతి సూసైడ్ చేసుకునేందుకు పెద్ద మొత్తంలో శానిటైజర్ తీసుకురాగా, పోలీసులు గుర్తించి ఆమె బంధువులకు సమాచారం ఇచ్చారు.