సాక్షి, అమరావతి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా కల్చర్‌తో ఏర్పడిన నీటి కాలుష్యంతో పాటు తీర ప్రాంతంలో ఉప్పునీటి సాంద్రత కారణంగా నెలకొన్న తాగునీటి ఎద్దడిని శాశ్వతంగా పరిష్కరించేందుకు వాటర్ గ్రిడ్ పథకంలో భాగంగా రూ.1,400 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందుకు సంబంధించిన పనులకు సీఎం వైఎస్ జగన్ ఈ నెల 21న శంకుస్థాపన చేయనున్నారు. నిడదవోలు, తణుకు, ఆచంట, పాలకొల్లు, నరసాపురం, భీమవరం, ఉండి, ఉంగుటూరు, దెందులూరు (కొంత భాగం), తాడేపల్లిగూడెం (కొంత భాగం) పరిధిలోని 26 మండలాల ప్రజలకు పథకం ద్వారా ఏడాది పొడవునా తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది. మొత్తం 1,178 గ్రామీణ నివాసిత ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ మంచినీటి కొళాయిని ఏర్పాటు చేసి రోజూ సగటున ప్రతి వ్యక్తికి 55 లీటర్ల సురక్షిత తాగునీటి సరఫరా చేస్తామని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్‌డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు.
సమీపంలోని నదుల నుంచి..
గ్రామీణ ప్రాంతాల్లో చాలా చోట్ల ఇప్పటికే రక్షిత మంచినీటి పథకాలున్నా సరఫరా చేయడానికి నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. వాటర్ గ్రిడ్ ద్వారా ఏడాది పొడవునా తాగునీటి సరఫరా జరిగేలా సమీప నదులతో ప్రత్యేక పైపులైన్ల ద్వారా అనుసంధానిస్తున్నారు. సీఎం ప్రారంభించనున్న రూ.1,400 కోట్ల తాగునీటి పథకానికి కూడా గోదావరి నుంచి ఏటా 1.374 టీఎంసీల నీటిని వినియోగిస్తారు. 30 నెలల వ్యవధిలో దీన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.
రూ.10,131 కోట్ల పనులు..
గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి వాటర్ గ్రిడ్ ద్వారా తొమ్మిది ఉమ్మడి జిల్లాల్లో రూ.10,131 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాలను ప్రభుత్వం చేపట్టింది. దశాబ్దాలుగా కిడ్నీ సమస్యలతో బాధ పడుతున్న శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో రూ.700 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని అధికారంలోకి రాగానే సీఎం జగన్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పనులు 80 శాతం పూర్తయినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.480 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు ఇప్పటికే 34 శాతానికిపైగా జరిగాయి. కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గ పరిధిలో రూ.279 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పనులు 25 శాతానికి పైగా పూర్తయ్యాయి.
మిగతా చోట్ల త్వరలోనే ప్రారంభం..
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో రూ.1,650 కోట్లతో, ఉమ్మడి ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.1,290 కోట్లతో, ఉమ్మడి గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో రూ. 1,200 కోట్లతోనూ, ఉమ్మడి కృష్ణా జిల్లా సముద్ర తీర ప్రాంతంలో రూ.750 కోట్లతో, ఉమ్మడి చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతంలో రూ.2,370 కోట్లతో వాటర్ గ్రిడ్ ద్వారా శాశ్వత రక్షిత మంచినీటి పథకాలకు ప్రభుత్వం ఇప్పటికే టెండర్లు ప్రక్రియ పూర్తి చేసింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment