
రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలి
శ్రీ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి పండుగలను పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు.
లోక కంఠకుడైన మహిషాసురుడిని జగన్మాత సంహరించినందుకు, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రతీకగా జరుపుకునే పండుగే విజయదశమి అని ఆయన అన్నారు. చెడు ఎంత దుర్మార్గమైనదైనా, ఎంత శక్తిమంతమైనదైనా అంతిమ విజయం మంచినే వరిస్తుందని పేర్కొన్నారు.
ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులు, సిరిసంపదలతో తులతూగాలని, రాష్ట్రంలోని ప్రతి ఒక్క కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ కనకదుర్గమ్మవారి దీవెనలు, ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని వైఎస్ జగన్ ఆకాంక్షించారు.