AP: గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం  | Economic Independence For Villages In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

AP: గ్రామాలకు ఆర్థిక స్వాతంత్య్రం 

Published Mon, Jan 10 2022 8:55 AM | Last Updated on Mon, Jan 10 2022 9:41 AM

Economic Independence For Villages In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం కొత్తగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కల్పించింది. గ్రామ పంచాయతీల్లో చేపట్టే అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులను ఆ గ్రామ సర్పంచి, పంచాయతీ కార్యదర్శిల ఆధ్వర్యంలోనే ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లింపులకు వీలుగా ప్రతి పంచాయతీ పేరిట బ్యాంకుల్లో ముందస్తుగానే నిధుల జమకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీ పేరిట ఇప్పటికే బ్యాంకుల్లో (వ్యక్తిగత ఖాతాలను) పీడీ ఖాతాలను తెరిచింది. ఈ నిధులపై రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ ఉంటుంది. బిల్లులు చెల్లింపులకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతి తీసుకోవడం వంటివి కూడా ఉండవు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు గ్రామ పంచాయతీలకు కేటాయించే దాదాపు రెండు వేల కోట్లకు పైగా నిధులను ఏటా ఆయా బ్యాంకు ఖాతాల్లో జమచేసే అవకాశముంది.  

అకౌంట్‌ టూ అకౌంట్‌కి మాత్రమే బదిలీ 
గ్రామాలకు కొత్తగా పూర్తిస్థాయి నిధులను అందుబాటులోకి తీసుకొస్తూ గ్రామ పంచాయతీల పేరిట బ్యాంకులో తెరిచిన పీడీ ఖాతాల నుంచి సర్పంచి సైతం ముందుగా డబ్బులు డ్రా చేసుకోకుండా ప్రభుత్వం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ ఖాతాల్లో జమయ్యే నిధులను చెక్కులతోనూ డ్రా చేసుకోవడానికి వీలుండదు. 

గ్రామ పంచాయతీలో వివిధ ఖర్చులకు సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ‘గ్రామ స్వరాజ్య’ ఈ–పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.  

ఆ బిల్లు మొత్తాన్ని ఏ వ్యక్తికి అందజేయాలో అతనికి సంబంధించిన బ్యాంకు ఖాతా వివరాలను సర్పంచి అనుమతితో గ్రామ కార్యదర్శి ఆ పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. 
 
ఈ పోర్టల్‌ పంచాయతీ అకౌంట్‌కు అనుసంధానమై ఉంటుంది. వివరాలు నమోదు ప్రక్రియ పూర్తవగానే గ్రామ పంచాయతీ అకౌంట్‌ నుంచి బిల్లు మొత్తం సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాకు బదిలీ అవుతాయి.  

ఇందుకు ప్రభుత్వ ట్రెజరీ అనుమతులు, లేదా ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా ఎక్కడా ఉండదని పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.  

అయితే, ఈ లావాదేవీల వివరాల సమాచారం ఎప్పటికప్పుడు పంచాయతీరాజ్‌ శాఖ ఉన్నతాధికారులందరికీ తెలుస్తుంది.  
ఒకసారి లావాదేవీ పూర్తయ్యాక అందుకు సంబంధించిన వివరాల్లో మార్పులు, చేర్పులు చేయడానికి వీలుండదు.  

ఆన్‌లైన్‌లో నమోదు చేసే బిల్లులపై ప్రభుత్వం ఏటా ఆడిట్‌ నిర్వహిస్తుంది. తప్పులు 
దొర్లితే సంబంధిత సర్పంచి, గ్రామ కార్యదర్శిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.   

ఈ విధానానికి చంద్రబాబు ‘నో’ 
గ్రామ పంచాయతీలకు కేటాయించే ఆర్థిక సంఘం నిధులపై రాష్ట్ర ప్రభుత్వ ట్రెజరీ నియంత్రణ లేకుండా 2018 నుంచి పూర్తిస్థాయిలో స్థానిక సంస్థల స్థాయిలోనే ఆ నిధులు అందుబాటులో ఉంచాలని 2017లోనే కేంద్ర పంచాయతీరాజ్‌ శాఖ అన్ని రాష్ట్రాలకు సూచన చేసింది. కానీ, ఈ ప్రతిపాదనకు అప్పట్లోని చంద్రబాబు ప్రభుత్వం నో చెప్పింది.  

పూర్తిస్థాయి గ్రామ స్వరాజ్యం దిశగా.. 
మూడేళ్ల క్రితం రాష్ట్రంలో ఏ పంచాయతీలోనూ ఇద్దరు ముగ్గురు కంటే ఎక్కువమంది  ప్రభుత్వోద్యోగులు ఉండేవారు కాదు. జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి, ప్రతి గ్రామంలోనూ పది మందికి పైగా ప్రభుత్వ సిబ్బందిని నియమించారు. ఇందుకోసం ఏకంగా 1.34 లక్షల మందిని నియమించారు. నగరాలతో సమానంగా మారుమూల కుగ్రామాల్లో సైతం 543 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వానికి సంబంధించిన ఏ పనినైనా సొంత గ్రామంలోనే పూర్తిచేసుకునే సౌలభ్యం కల్పించింది. దీనికి తోడు.. ప్రాధాన్యతా క్రమంలో గ్రామ అవసరాలకు పంచాయతీ స్థాయిలోనే బడ్జెట్‌ రూపకల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మొత్తంగా రాష్ట్రంలో గ్రామాలు ఇప్పుడు గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం దిశగా సాగుతున్నాయి.   

ఐదేళ్లకు రూ.10,231కోట్లు 
15వ ఆర్థిక సంఘం నిధులు ఐదేళ్ల పాటు రూ.10,231 కోట్లు మేర రాష్ట్రంలోని గ్రామాలకు కేటాయిస్తారు. వీటిలో 70 శాతం పంచాయతీలకు, 15 శాతం చొప్పున మండల, జిల్లా పరిషత్‌లకు ఏటా నిర్ణీత మొత్తంలో విడుదల చేస్తారు. రాష్ట్రంలో 13,371 గ్రామ పంచాయతీలు, 660 మండల పరిషత్, 13 జిల్లా పరిషత్‌లు ఉండగా.. ఇప్పటికే 12,686 గ్రామ పంచాయతీలు, 593 మండల పరిషత్‌లు, 12 జిల్లా పరిషత్‌లలో పీడీ ఖాతాలు తెరిచే ప్రక్రియను పంచాయతీరాజ్‌ శాఖ పూర్తిచేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement