
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విద్యారంగ అభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్తామని మండల విద్యాశాఖాధికారుల సంఘం ప్రకటించింది. శుక్రవారం విజయవాడలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆదూరి వెంకటరత్నం మీడియాతో మాట్లాడారు. మండల విద్యాశాఖాధికారులకు సెల్ఫ్ డ్రాయింగ్ పవర్, ఎంఈవో కార్యాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు.
తమ సమస్యలన్నింటినీ ఏకకాలంలో పరిష్కరించి.. 30 ఏళ్ల తమ కలను సాకారం చేసిన సీఎం జగన్, మంత్రి ఆదిమూలపు సురేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో చేపట్టిన స్కూళ్ల మ్యాపింగ్‌ను తమ సంఘం బలపరుస్తోందని వెంకటరత్నం చెప్పారు. సమావేశంలో మండల విద్యాశాఖాధికారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.కిషోర్‌బాబు, సంయుక్త కార్యదర్శి కోటంపల్లి బాబ్జీ, బత్తుల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.