పెట్టుబడులపై పచ్చ మంట.. రామోజీ ప్రతి రాతలో అదే బాధ! | Eenadu Fake News On Investments To Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పెట్టుబడులపై పచ్చ మంట.. మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ?

Published Sun, Dec 4 2022 4:51 AM | Last Updated on Sun, Dec 4 2022 3:53 PM

Eenadu Fake News On Investments To Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: కొద్ది నెలలుగా రాష్ట్రంలో ఈనాడు, ఇతర పచ్చ మీడియా పనిగట్టుకుని ప్రభుత్వంపై దుష్ప్రచారం సాగిస్తోంది. పచ్చి నిజాలను సైతం వక్రీకరిస్తూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్లేలా శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నాయి. రోజుకొక అంశాన్ని తెరపైకి తెస్తూ టీడీపీకి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి విఫలయత్నం చేస్తున్నాయి. ప్రభుత్వ పథకాలపై బురదచల్లడంతో పాటు పెట్టుబడులు వెనక్కు వెళ్లిపోతున్నాయంటూ గోల చేస్తున్నాయి.

తాజాగా అమరరాజా కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతోందంటూ తప్పుడు ప్రచారాన్ని ఎత్తుకున్నాయి. రామోజీరావుకు అత్యంత సన్నిహితుడైన గల్లా రామచంద్రనాయుడు కుమారుడు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందిన ఈ పరిశ్రమలో ఉన్న లోటుపాట్లను సరిచేసుకోమని మాత్రమే ఈ ప్రభుత్వం చెప్పింది. ఈ పరిశ్రమ వెదజల్లుతున్న కాలుష్యం వల్ల ఇబ్బంది పడుతున్నామని స్థానికుల నుంచి ఫిర్యాదులు రావడంతో కాలుష్యాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని సూచించింది. పరిశ్రమను మూసేయమని చెప్పలేదు.

ఇప్పటికీ ఈ పరిశ్రమ రాష్ట్రంలో చక్కగా కొనసాగుతోంది. అసలే టీడీపీ ఎంపీ అయిన గల్లా జయదేవ్‌ తన వ్యాపార విస్తరణ వ్యూహంలో భాగంగానే మరో రాష్ట్రంలో ప్లాంట్‌ పెట్టడానికి అడుగులు ముందుకు వేశారు. ఇందులో ప్రభుత్వ వ్యతిరేక వైఖరి ఎక్కడున్నట్లు? ‘ఇలాగైతే రామోజీ రావు కూడా వేరే రాష్ట్రాల్లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు. అలాగని ఈ రాష్ట్రంపై వ్యతిరేకత ఉందని భావించాలా?’ అని పలువురు పారిశ్రామిక వేత్తలు, అధికారులు విస్తుపోతున్నారు. 

మీ బాబు ఆ కూర్చీలో లేరన్నదే మీ బాధ!
► చంద్రబాబు సీఎం కుర్చీలో లేరన్న బాధ రామోజీ ప్రతి రాతలో కనిపిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో పరిశ్రమల పేరుతో విశాఖలో జరిపిన భూ దోపిడీకి ప్రస్తుత ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. దీన్ని తట్టుకోలేని రామోజీ ప్రతి రోజూ తన పత్రిక ద్వారా పెట్టుబడులు వెళ్లిపోతున్నాయంటూ విషం కక్కిస్తున్నారు.

► చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విశాఖ బీచ్‌ ఎదురుగా ఉన్న రూ.679.50 కోట్ల విలువైన 13.59 ఎకరాల భూమిని నామమాత్రపు లీజుతో అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ పేరుతో లూలూ గ్రూపుకు కట్టబెట్టారు. ఇంత విలువైన భూమిని అంత తక్కువ ధరకు ఎందుకు లీజుకిచ్చావు.. అని నామామాత్రంగా అయినా ప్రశ్నించే ధైర్యం రామోజీ చేయలేదు. పైగా 2017లో లీజు తీసుకున్ను లూలూ సంస్థ 2019 నవంబర్‌ వరకు ఒక్క రూపాయి కూడా లీజు చెల్లించలేదు.

► అన్ని విషయాలు పరిశీలించిన తర్వాతే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో ఈ ప్రభుత్వమే ముందుగా ఒప్పందాన్ని రద్దు చేసి, వందల కోట్ల విలువైన భూమిని కాపాడింది. దీన్ని స్వాగతించకపోగా లూలూ రాష్ట్రం నుంచి వెళ్లిపోయిందంటూ శోకాలు పెట్టడంపై అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ 13.59 ఎకరాల భూమి ఏపీఐఐసీ వద్ద భద్రంగా ఉంది. 

అదనపు పెట్టుబడులు కనిపించవా?
► అదానీ గ్రూపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కంటే ప్రస్తుత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో భారీ పెట్టుబడులు పెడుతుండటమే కాకుండా వాటిని వాస్తవ రూపంలోకి తీసుకొస్తోంది. గత ప్రభుత్వ హయాంలో వచ్చే 30 ఏళ్లల్లో రూ.70,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్లుగా అదానీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకోసం విశాఖలోని కాపులుప్పాడలో 400 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వం కేటాయించింది. 

► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఐదేళ్ల కాలంలో వాస్తవంగా పెట్టే పెట్టుబడి వివరాలను అడిగితే అదానీ గ్రూపు రూ.14,634 కోట్ల పెట్టుబడులకు ప్రతిపాదనలు పంపడం.. ఆ మేరకు 130 ఎకరాలు కేటాయించడం జరిగింది. ఈ పెట్టుబడి వల్ల 24,990 మందికి ఉపాధి లభించనుంది. ఈ డేటా సెంటర్‌ పనులకు త్వరలోనే సీఎం చేతుల మీదుగా భూమి పూజ జరగనుంది. మరో రూ.15,376 కోట్లతో 3,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా మరో నాలుగు వేల మందికి ఉపాధి లభించనుంది. 

ఇవి కాకుండా పోర్టుల ఏర్పాటు ద్వారా వేలాది కోట్ల పెట్టుబడులకు ముందుకు వచ్చింది. ఈ లెక్కన ఇప్పటికే 40–50 వేల కోట్ల పెట్టుబడులు కనిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం పనితీరు నచ్చకపోతే ఈ స్థాయిలో అదానీ గ్రూపు భారీ పెట్టుబడులు ఎందుకు పెడుతుంది?

రిలయన్స్‌కు వివాదాస్పద భూములు
► ఏదైనా ఒక సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే ఏ ప్రభుత్వమైనా వివాదాలు లేని భూమిని ఇస్తాయి. కానీ దీనికి భిన్నంగా సెట్‌టాప్‌ బ్యాక్స్‌ల తయారీ కోసం ముందుకొచ్చిన రిలయన్స్‌కు తిరుపతి వద్ద వివాదాస్పద భూమిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కట్టబెట్టింది. 

► ఈ భూ కేటాయింపుపై 15 మందికి పైగా రైతులు కోర్టును ఆశ్రయించారు. అప్పట్లో రిలయన్స్‌ ఛాలెంజింగ్‌గా తీసుకువస్తున్న జీయో నెట్‌ వర్క్‌ కోసం ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంది. కానీ అది వివాదాస్పద భూమి కావడం వల్ల పనులు ప్రారంభం కాలేదు. దీంతో రిలయన్స్‌ సెట్‌టాప్స్‌ బాక్స్‌ల తయారీని థర్డ్‌ పార్టీకి ఇచ్చేసి, తన ప్రతిపాదనలను ఉపసంహరించుకుంది.

► ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుతూ వేరే చోట వివాదం లేని భూమిని ఇవ్వడానికి ముందుకు వచ్చినా, రిలయన్స్‌ తన ప్రతిపాదనలను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రామోజీ స్వయంగా అంగీకరిస్తూనే తెలివిగా ఈ తప్పును జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం మీదకు నెట్టడానికి ప్రయత్నం చేయడాన్ని ఏమనాలి?

ఫ్రాంక్లిన్‌ పరిస్థితి తెలియదా?
► ఫ్రాంక్లిన్‌ టెంపుల్టన్‌ ఇండియా భారీ డెట్‌ స్కాంలో ఇరుక్కోవడంతో దాని వ్యాపార కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడింది. సుమారు రూ.29,000 కోట్ల విలువైన ఆరు డెట్‌ ఫండ్స్‌ను సెబీ నిషేధించడం, పెనాల్టీలు విధించడంతో ఒకానొక దశలో పూర్తిగా ఇండియా కార్యకలాపాల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంది. దీంతో ఇండియాలో విస్తరణ కార్యక్రమాలను నిలిపివేసింది.

► ఈ తప్పును కూడా ఈ ప్రభుత్వం మెడకు చుట్టడానికి ఈనాడు వేస్తున్న కుప్పిగంతులు చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అనంతపురంలో కియా వెళ్లకుండా అక్కడే మరో రూ.400 కోట్లతో విస్తరణ చేపడుతున్నట్లు ఆ సంస్థ ఎండీనే స్వయంగా ప్రకటించినా తప్పుడు రాతలు మానలేదు.

మీ రాతలే నిజమైతే ఇవెలా సాధ్యం రామోజీ?
► గతంలో చంద్రబాబు హయాంలో సంస్కరణలు అమలు చేస్తున్నాం.. అంటూ ఇచ్చిన జీవోల ఆధారంగా సులభతర వాణిజ్య ర్యాంకులు ప్రకటించేవారు. ఇప్పుడు పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలు తీసుకొని వాటి ఆధారంగా ర్యాంకులు ప్రకటిస్తున్నారు. మరి రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉంటే వరుసగా మూడేళ్లు ఏపీ మొదటి స్థానంలో ఎలా నిలిచింది? ఈ ఒక్క ఉదాహరణ చాలు పచ్చపత్రికలు ఎలా విషాన్ని వండి వారుస్తున్నాయో చెప్పడానికి. 

► 2021–22 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైతే ఇదే సమయంలో దేశంలోనే అత్యధికంగా రాష్ట్రం 11.43 శాతం జీడీపీని నమోదు చేసిన మాట వాస్తవం కాదా? 2019–20లో ఎగుమతుల్లో 7వ ర్యాంకులో ఉన్న రాష్ట్రం 2020–21లో నాల్గవ స్థానానికి ఎగబాకిన మాట వాస్తవం కాదా? 

► ఎగుమతుల విషయంలో 2020లో 20వ స్థానంలో ఉన్న రాష్ట్రం 2021లో తొమ్మిద స్థానానికి అధిగమించింది. ఎగుమతుల ద్వారా 2021లో దేశ జీడీపీలో అత్యధిక వాటా ఉన్న రాష్ట్రాల్లో 50.85 శాతం వాటాతో గుజరాత్‌ తర్వాత రెండో స్థానంలో ఉన్న మాట వాస్తవం కాదా? 

► లాజిస్టిక్‌ ఈజ్‌ ఎక్రాస్‌ డిఫరెంట్‌ స్టేట్స్‌ (లీడ్స్‌)రిపోర్ట్‌ 2022లో ఆంధ్రప్రదేశ్‌ అచీవర్‌గా మొదటి స్థానంలో నిలిచిన మాటా వాస్తవం కాదా? దేశంలో తయారీ రంగంలో పెట్టబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న డీపీఐఐటీ 2021 టాప్‌10 రీజియన్స్‌లో చిత్తూరు–నెల్లూరు రీజియన్‌ దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా స్థానం దక్కించుకుంది. 

► బాబు హయాంలో రూ.3,675 కోట్ల పారిశ్రామిక రాయితీలను బకాయి పెట్టిన మాట వాస్తవం కాదా? 2017–18 నుంచి 2019–20 వరకు అయిదు శాతానికి పరిమితమైన పారిశ్రామిక వృద్ధిరేటు 2021–22లో 12.78 శాతం నమోదు చేసిన సంగతి వాస్తవం కాదా? 

► ఈ  ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1,715 కోట్ల పారిశ్రామిక రాయితీలు, రూ.1,143.83 కోట్ల విద్యుత్‌ రాయితీల ప్రయోజనం అందించడం ద్వారా ప్రగతి తిరిగి పట్టాలెక్కింది. ఈ మూడున్నరేళ్లలో 108 భారీ, 1,08,206 ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉత్పత్తి ప్రారంభం ద్వారా రూ.74,481.81 కోట్ల పెట్టుబడులు వాస్తవ రూపంలోకి వచ్చాయి. వీటి ద్వారా 10.75 లక్షల మందికి ఉపాధి లభించింది.

► చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో భారీ, మధ్యతరహా పారిశ్రామిక రంగంలో ఏటా సగటున రూ.11,994 కోట్ల పెట్టుబడులు మాత్రమే వాస్తవ రూపంలోకి వస్తే, కోవిడ్‌ సంక్షోభ సమయంలో కూడా ఈ మూడేళ్లలో ఏటా సగటున రూ.13,200 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు డీపీఐఐటీ గణాంకాలే చెపుతున్నాయి.

‘వాస్తవాలకు మసి పూస్తాం.. ఎలా కడుక్కుంటారన్నది మీ ఇష్టం.. మా చంద్రబాబు తిరిగి గద్దెనెక్కే వరకు ఇదే మా విధానం.. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి టాటాలు, బిర్లాలు, అదానీలు, మిట్టల్, సంఘ్వీ.. ఇలా దేశంలోని దిగ్గజ పారిశ్రామిక కుటుంబాలు ముందుకు వచ్చినా, వాటి గురించి మేం రాయం.. మాట్లాడం. అమర రాజా కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులను కొనసాగిస్తూనే వ్యాపార వ్యూహంలో భాగంగా వేరే రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతోందని మేము ఎందుకు రాస్తాం? రాష్ట్రం నుంచి ఆ కంపెనీ వెళ్లిపోతోందనే మాత్రమే రాస్తాం.

గతంలో కంటే అదానీ ఎక్కువ పెట్టుబడులు పెట్టినా, వెళ్లిపోయిందనే చెబుతాం. గతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన రిలయన్స్‌ కంపెనీకి వివాదాల్లో ఉన్న భూములు ఇచ్చినా ఈ ప్రభుత్వందే తప్పు అని ప్రచారం చేస్తాం. విశాఖలో భారీ భూ దోపీడీకి అడ్డుకట్ట వేస్తూ ప్రజా ప్రయోజనాల దృష్ట్యా లూలూ గ్రూపుతో రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పందం రద్దు చేసుకుందని ఎందుకు చెబుతాం? మీ వల్లే లూలూ వెళ్లిపోయిందని చాటుతాం. మీ పరువు, రాష్ట్ర పరువు, నిజానిజాల సంగతి మాకేల? మా బాబు ప్రగతే మాకు ముఖ్యం.’
– కొద్ది రోజులుగా రాష్ట్రంలో ఇదీ పచ్చ పత్రికల వైఖరి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement