సాక్షి, అమరావతి: ‘ఈనాడు’ అక్కసుకు అవ్వా తాత, అక్క చెల్లెమ్మలు, దివ్యాంగులు.. ఇలా ఎవరూ అతీతం కాదు. ఎవరికి మంచి జరిగినా తన ఓర్వలేనితనాన్ని అక్షర రూపంలో కక్కుతోంది. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ప్రజలకు చేస్తున్న మంచి కార్యక్రమాలపై అసత్య వార్తలతో ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తోంది.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఏనాడూ ప్రజలకు ఒక్క మేలూ చేయని చంద్రబాబుని తిరిగి పీఠం ఎక్కించడమే లక్ష్యంగా ఈనాడు అబద్ధపు కథనాలు సాగుతుంటాయి. ఇందులో భాగంగానే అవ్వాతాతలకు, వితంతువులు, దివ్యాంగులు తదితరులకు ఇచ్చే పింఛనుపైనా తన అక్కసును వెళ్లగక్కింది. ప్రభుత్వం ఆలోచన కూడా చేయని విషయాన్ని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందంటూ పచ్చి అబద్ధాలను అచ్చేసింది. ‘పింఛనుదారులపై మరో పిడుగు’ అంటూ మంగళవారం ఈనాడు పత్రికలో వచ్చిన కథనంపై ‘ఫ్యాక్ట్ చెక్’.
ఈనాడు కథనం: ‘పింఛనుదారులపై మరో పిడుగు. సచివాలయానికి 15 కిలోమీటర్ల లోపు దూరంలో ఉంటేనే పింఛను అందించే వీలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు
వాస్తవం: ‘ప్రభుత్వం సంతృప్త స్థాయిలో దాదాపు 63.42 లక్షల మందికి ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు పంపిణీ చేస్తోంది. సూర్యుడు ఉదయించక ముందే పింఛన్లను గ్రామ వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్దిదారులు ఎక్కడ ఉంటే అక్కడికే వెళ్లి అందించే కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది.
పింఛన్లను మరింత సులభతర మార్గంలో అందించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా లబ్దిదారులు సెక్రటేరియట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారో తెలుసుకునేందుకు జియో ఫెన్సింగ్ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించడానికి సాఫ్ట్‌వేర్ నమూనాలో అధికారులు చిన్న మార్పు చేశారు. పింఛన్లు మరింత సమర్ధంగా, అత్యంత సులభంగా అందించడానికి అవసరమైన సమాచార సేకరణలో భాగంగా మాత్రమే.. అదీ ప్రయోగాత్మకంగానే జరుగుతుందని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. ఇప్పటివరకు దీనిపైన ఎలాంటి ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు.
‘ఈనాడు’ కథనం: సచివాలయం నుంచి 15 కిలోమీటర్ల లోపు మాత్రమే వలంటీర్లు పింఛన్లు అందించే సదుపాయం ఉంటుంది. 15 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉంటే పింఛను అందించే అవకాశం వలంటీర్లకు ఉండదు.
వాస్తవం: ప్రభుత్వం ఉత్తర్వులే జారీ చేయనప్పుడు 15 కిలోమీటర్లకంటే ఎక్కువ దూరంలో ఉన్నవారికి పింఛన్లు అందించరన్నది పూర్తిగా తప్పు. అర్హులకు పింఛను ఎలా ఇవ్వాలో అనే ఆలోచనే తప్ప ఎలా ఎగ్గొట్టాలన్న ఆలోచన ఎప్పుడూ చేయలేదని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయాన్ని ప్రభుత్వం గుర్తు చేస్తోంది.
నా మనవడు జగనయ్య చల్లగా ఉండాలయ్యా..
ఈ చిత్రంలో నడవలేని స్థితిలో మంచంపై కూర్చొని ఉన్న వృద్ధురాలి పేరు రామలక్షుమ్మ. వైఎస్సార్ జిల్లా పులివెందులలోని ఎస్‌బీఐ కాలనీలో ఉంటోంది. ఆ ప్రాంత వలంటీర్ భాస్కర్ ఉదయాన్నే ఆ వృద్ధురాలి ఇంటికి వెళ్లి పింఛన్ నగదును అందజేశారు. దీంతో రామలక్షుమ్మ సంతోషం వ్యక్తం చేసింది. ‘నా మనవడు జగనయ్య మా కోసం వలంటీర్లను పెట్టారు. ఇంటి వద్దకే పింఛన్ పంపిస్తున్నారు.
నా మనవడు చల్లగా ఉండాలయ్యా’ అంటూ దీవించింది.
పేదల పక్షపాతి సీఎం జగన్
ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పేదల కోసం అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు చెప్పిన దానికంటే ఎక్కువగానే మేలు చేస్తున్నారు. పైసా అవినీతి లేకుండా, ఆ పార్టీ ఈ పార్టీ, కులం, మతం అన్న తారతామ్యం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంతృప్త స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నారు.
వైఎస్ జగన్ సీఎం అయ్యి నాలుగేళ్లు పూర్తి కాకమునుపే దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా ఏకంగా సుమారు రూ.2 లక్షల కోట్లపైగా పేద ప్రజలు నేరుగా లబ్ధి పొందారు. అందుకే సీఎం జగన్ పేదల పక్షపాతిగా ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏనాడూ అమలు చేయని చంద్రబాబు, ఆయనకు వంతపాడే ఎల్లో మీడియాకు ఇది మింగుడు పడని విషయమే. అందుకే వైఎస్ జగన్‌పై విషం చిమ్మి, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రి చేయాలన్న కుయుక్తులతో ‘ఈనాడు’ తప్పుడు కథనాలు రాస్తోంది.
ఉద్దేశపూర్వక విష ప్రచారంపై చర్యలు తీసుకుంటాం: సెర్ప్
‘పింఛనుదారులపై మరో పిడుగు’ శీర్షికన ఈనాడు ప్రచురించిన కథనాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) కార్యాలయం ఖండించింది. ‘ఈనాడు పత్రిక అసత్య వార్తలు రాయడం ద్వారా ప్రజలు, పింఛను లబ్దిదారులకు తప్పుడు సమాచారం అందించినట్టు అవుతుంది. తప్పుడు రాతలతో లబ్దిదారులను ఆందోళనకు గురిచేసినట్టు అవుతుంది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన విష ప్రచారంగానే భావిస్తూ, దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని సెర్ప్ కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టంచేసింది.
అప్పటికీ, ఇప్పటికీ ఎంత తేడానో..
♦ 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో అవ్వా తాతలు, వితంతువుల, దివ్యాంగులు పింఛను మంజూరు చేయండంటూ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కష్టనష్టాలకోర్చి ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరిగినా పింఛను మంజూరయ్యేది కాదు. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో పింఛను మంజూరుకు లబ్దిదారులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు. అర్హులు ఉంటే గ్రామ, వార్డు వలంటీర్లే వారి వద్దకు వెళ్లి దరఖాస్తు పూర్తి చేసి, సచివాలయంలో దానిని అందజేస్తారు. అర్హతల మేరకు వారికి పింఛను మంజూరు కాగానే ఆ మంజూరు పత్రాన్ని ఇంటికే తెచ్చి ఇచ్చేస్తున్నారు.
♦ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రెండేళ్లకు ఒకసారి నియోజకవర్గానికి 200 – 300 కొత్త పింఛన్లు మంజూరు చేసేది. వాటిని కూడా జన్మభూమి కమిటీ (ఆ కమిటీల్లో ఉండేది ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే) సభ్యులు మంజూరు చేసేవారు. కేవలం తమ పార్టీకి ఓటు వేసిన వారికి లేదంటే లంచాలు ఇచ్చిన వారికి మాత్రమే పింఛన్లు మంజూరు చేసేవారు. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తోంది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కేవలం మూడేళ్లలోనే 24.69 లక్షల కొత్త పింఛన్లు ప్రభుత్వం మంజూరు చేసింది.
♦ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అవ్వాతాతలు, దివ్వాంగులు ఎవరైనా పింఛను కావాలంటే ప్రతి నెలా ఆ ఊరిలో ఆఫీసుకు వెళ్లి పడిగాపులు పడాలి. తమ ఊరిలో ఎప్పుడు పింఛన్ల పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసుకు వచ్చి ఎండలో కూర్చొని ఉసూరుమంటూ తిరిగి వెళ్లే దయనీయ పరిస్థితి ఉండేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పింఛనుదారులకు ఈ బాధలు తప్పాయి. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తేదీనే వలంటీర్లు లబ్దిదారుల ఇళ్లకు లేదా వారు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి పింఛను అందజేసే విప్లవాత్మక మార్పునకు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనివల్ల పింఛనుదారులకు వ్యయప్రయాసలు తప్పాయి. ఎవరికీ పైసా ముట్టజెప్పాల్సిన అవసరం లేకుండానే పింఛను సొమ్ము మొత్తం చేతికి వస్తోంది.
♦ అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పింఛన్ల పంపిణికీ నెలకు సరాసరిన కేవలం రూ. 400 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టే పరిస్థితి ఉండేది. ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి నెలా పింఛన్ల పంపిణీకి రూ. 1,750 కోట్ల దాకా ఖర్చు పెడుతోంది.
‘‘పింఛనుదారులపై మరో పిడుగు’’ అంటూ 04–04–2023న ఈనాడు దినపత్రికలో ప్రచురించిన వార్తను ప్రభుత్వం ఖండిస్తోంది. ఇది తప్పుడు వార్త. సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకోకుండా దీన్ని రాశారు. ఈనాడు దినపత్రికపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం. 1/5 pic.twitter.com/U22dGTOTVD
— FactCheck.AP.Gov.in (@FactCheckAPGov) April 5, 2023
Comments
Please login to add a commentAdd a comment