విభజన హక్కులూ బాబు గొప్పలేనా? | Eenadu Ramoji Rao On Chandrababu State Division rights | Sakshi
Sakshi News home page

విభజన హక్కులూ బాబు గొప్పలేనా?

Published Thu, Oct 13 2022 4:33 AM | Last Updated on Thu, Oct 13 2022 4:33 AM

Eenadu Ramoji Rao On Chandrababu State Division rights - Sakshi

విచిత్రమేంటంటే చేతిలో పేపరుంటే ఎలాంటి అబద్ధాలైనా అలవోకగా చెప్పేయొచ్చన్నది నాలుగు దశాబ్దాలుగా ‘ఈనాడు’ అనుసరిస్తున్న పాలసీ. ఎందుకంటే విశాఖపట్నంలో ఐఐఎం, ఐఐపీఈ విద్యాసంస్థల్ని ఈ ప్రాంతంపై ప్రేమతోనే చంద్రబాబు ఏర్పాటు చేసినట్లు రామోజీ డప్పు కొట్టారు. నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు చేసిన విభజన హక్కుల చట్టం ప్రకారం కేంద్రం పలు విద్యా సంస్థల్ని రాష్ట్రంలో ఏర్పాటు చెయ్యాల్సి ఉంది. దాని ప్రకారమే తిరుపతిలో ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్, మంగళగిరిలో ఎయిమ్స్, కర్నూల్లో ఐఐటీడీఎం, అనంతపురంలో సెంట్రల్‌ యూనివర్సిటీ, విశాఖ పట్నంలో ఐఐఎం, ఐఐపీఈ సంస్థల్ని కేంద్రం ఏర్పాటు చేస్తోంది. ఘనత వహించిన ‘ఈనాడు’... దీన్ని కూడా బాబు డప్పుల్లో కలిపేసింది. ఇక సమీర్‌ అనేది పరిశోధనల కోసం కేంద్రం విశాఖలో ఏర్పాటు చేసుకున్న సంస్థ. 

ఇందులో బాబు గొప్పేముంది?
గిరిజన యూనివర్సిటీ విషయంలో చంద్రబాబు చాలా గొప్పపనిచేస్తే... ఈ ప్రభుత్వం దాని స్థలాన్ని మార్చి తప్పుచేసినట్లుగా రాసిపడేశారు రామోజీ. ఏ కొంచెమూ సిగ్గనేది ఉండదు కాబట్టి ఇలా రాయటంలో విచిత్రమేమీ కనిపించదు. ఎందుకంటే గిరిజన యూనివర్సిటీని గిరిజనేతర ప్రాంతంలో ఏర్పాటు చేయటమన్నదే చంద్రబాబు చేసిన తొలి తప్పు. ఆ తప్పుని సరిచేసి దాన్ని గిరిజనులకు అందుబాటులో ఉండేలా వారి ప్రాంతంలో ఏర్పాటు చేయటమే ఘోరమైనట్లుగా రామోజీ చేసే రాద్ధాంతం చూస్తే ఔరా... అనిపించకమానదు.

చంద్రన్న తప్పును కూడా మెళ్లో వేసుకుని ప్రచారం చేసుకోగలిగే అపారమైన ప్రచారపటిమ ‘ఈనాడు’ సొంతమని తెలిసినా... ఇలాంటివి చూసినపుడు ఇంకాస్త ఆశ్చర్యమేస్తుంది. ఇక గతంలో గిరిజన వర్సిటీని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్‌ కేంద్రం పాతది... పైపెచ్చు అద్దె భవనం. అందుకే ఈ ప్రభుత్వం దాన్ని విజయనగరంలోని ఆంధ్రా యూనివర్సిటీ పీజీ క్యాంపస్‌లోకి మార్చింది. దీన్ని కొనసాగిస్తూనే... కొత్త వర్సిటీ పనులు పూర్తి స్థాయిలో చేపట్టింది. ఇదీ... ప్రభుత్వానికిì  గిరిజనంపై ఉన్న చిత్తశుద్ధి!!. 
2019 ఎన్నికల ముందు విజయనగరంలో గురజాడ అప్పారావు యూనివర్సిటీ ఏర్పాటుకు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 

గిరిజనులకూ టెక్నాలజీ విద్య
పరిస్థితులు మారాయి కనక మామూలు యూనివర్సిటీ బదులు సాంకేతిక విశ్వవిద్యాలయమైతేనే బాగుంటుందన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకే గిరిజనం సాంకేతిక విద్యనభ్యసించడానికి వీలుగా కురుపాంలో ట్రైబల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ ఏర్పాటు చేశారు. 50 శాతం సీట్లను పూర్తిగా గిరిజనులకే కేటాయించారు కూడా.  ‘ఈనాడు’ చెప్పిన అబద్ధాల్లో మరొకటి... శ్రీకాకుళంలో ట్రిపుల్‌ ఐటీని చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని పట్టించుకోవటం లేదని!!. ఇదెంత అందమైన అబద్ధమంటే... చంద్రబాబు ఆరంభించిన మాట నిజమే. కానీ... రూపాయి కూడా ఖర్చు చెయ్యకుండా... కాగితంపై ఆరంభించేశారు.

అంటే ‘పేపర్‌ క్యాంపస్‌’ అన్నమాట. దీంతో విద్యార్థులు ట్రిపుల్‌ ఐటీ నూజివీడు, ఇడుపుల పాయ క్యాంపస్‌లలో పాఠాలు వినాల్సి వస్తోంది. కానీ వై.ఎస్‌.జగన్‌ దీన్నిలా వదిలేయలేదు. రూ.120 కోట్లకు పైగా మౌలిక సదుపాయాలపై వెచ్చించి క్యాంపస్‌ తయారు చేశారు. దీంతో శ్రీకాకుళం క్యాంపస్‌లో పాఠాలు మొదలయ్యాయి. 2024 నాటికి అన్ని సౌకర్యాలతో పూర్తిస్థాయి క్యాంపస్‌ సిద్ధం కాబోతోంది. కాకపోతే ఇలాంటి వాస్తవాలేవీ ‘ఈనాడు’ చెప్పదు.

2019 వరకూ ట్రిపుల్‌ ఐటీ శ్రీకాకుళానికి ఒక్క లెక్చరర్‌ పోస్టునూ మంజూరు చేయని విషయాన్ని గానీ... 210 టీచింగ్, 89 నాన్‌–టీచింగ్‌ పోస్టులను మంజూరు చేసింది ఈ ప్రభుత్వమేనని గానీ రాయనే రాయరు!.  మునుపటి ప్రభుత్వం అనుసరించిన తప్పుడు విధానం వల్లే ఆంధ్రా యూనివర్సిటీలో బోధన సిబ్బందిని నియమించలేక పోయారని, అందుకే భర్తీ ప్రక్రియకు వ్యతిరేకంగా ఎన్నో కేసులు పడ్డాయని, ఇప్పటికీ హైకోర్టులో వ్యవహారం పెండింగ్‌లోనే ఉందని రామోజీ చెప్పరు. వాటి భర్తీకి ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది కనకే కోర్టు అనుమతి వచ్చిన వెంటనే వివిధ వర్సిటీల్లో మొత్తం 2000 పోస్టులు భర్తీ చేస్తామని స్పష్టం చేసిందనే వాస్తవాన్ని కూడా రాయరు. ఇక సీమెన్స్‌ అనేది భారీ స్కాం. దాన్లో నిందితులను అరెస్టు కూడా చేశారు. దాన్ని కూడా ఆంధ్రా యూనివర్సిటీలో సీమెన్స్‌ సెంటర్‌ ఏర్పాటయిందంటూ రాస్తున్నారంటే మిమ్మల్ని ఏమనాలి రామోజీ?

జీవోలిస్తే వర్సిటీలొస్తాయా?: యూనివర్సిటీ ఏర్పాటు చేయాలంటే ఒక జీవోతో కుదరదు. చట్టం చేయాలి. కానీ 2019 ఫిబ్రవరి 13న... అంటే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు విజయనగరంలో ‘గురజాడ అప్పారావు వర్సిటీ’ని  ఏర్పాటు చేస్తున్నట్లు జీవో ఇచ్చేశారు చంద్రబాబు. ఇక 2018 నవంబర్లో ఒంగోలులో ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం యూనివర్సిటీ విషయంలోనూ ఇలాగే జీవో ఇచ్చారు.

ఇలాంటి జీవోల వల్ల రాజకీయ ప్రయోజనాలు నెరవేరుతాయేమో కానీ.. యూనివర్సిటీలు వస్తాయా? తెలిసి కూడా ఇలా చేసిన చంద్రబాబును ఏనాడూ నిలదీయరెందుకు రామోజీ? వీటిపై చట్టాలు చేసి గురజాడ సాంకేతిక వర్సిటీని విజయనగరంలోను, ఆంధ్రకేసరి వర్సిటీని ఒంగోలులోను ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వమేనన్న నిజాన్ని చెప్పరెందుకు? అన్ని ప్రక్రియలనూ అనుసరిస్తూ వర్సిటీలను ఏర్పాటు చేయటంలో ప్రభుత్వ చిత్తశుద్ధి మీకు కనిపించటం లేదా? 2020 జాతీయ విద్యా విధానాన్ని (ఎన్‌ఈపీ) అమలు చేయడంలో రాష్ట్రం ముందున్నదంటూ.. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం తీసుకున్న చర్యలకు యూజీసీ, ఏఐసీటీఈ, నీతీ ఆయోగ్, ఇతర ప్రభుత్వృప్రయివేటు సంస్థలు ప్రశంసిస్తుండటం మీకెప్పుడూ కనిపించదా? మీ పాఠకులకు చెప్పాలనిపించదా?

వర్సిటీల నిధులు దోచుకున్నదెవరు రామోజీ? 
ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడి ప్రభుత్వం అత్యంత హేయంగా వ్యవహరించిన తీరు మీకెందుకు నేరమనిపించలేదు? ఇతర నిధులతో పాటు ట్రిపుల్‌ ఐటీ నిధుల నుంచి రూ.180 కోట్లు, ఆంధ్రా యూనివర్సిటీ నుంచి రూ.130 కోట్లు ‘పసుపు కుంకుమ’ కోసం వాడేసింది. అసలు ఎవరి పసుపు కుంకుమలివి? ఏం పథకమిది? దీనికీ, విద్యకూ సంబంధమేమైనా ఉందా? సిగ్గు లేదూ? ఆలయాల ముందు పందిళ్లు వేసి... మహిళల చేతిలో ‘పసుపు కుంకుమ’ అంటూ డబ్బులు పెట్టి... వారి చేత ఓటు చంద్రబాబుకే అని ఒట్టేయించుకున్న మీరు... ఇంకా నీతులు చెప్పేటంత  స్థాయిలోనే ఉన్నామనుకుంటున్నారా? అన్ని దారుణాలు చేసినా అంతకన్నా దారుణంగా ఓడిపోయారంటే మీ ముఠాపై ప్రజలకెంత విశ్వసనీయత ఉందో తెలియటం లేదా?

డిపాజిట్‌కు... జనభేరికి తేడా లేదా? 
వాస్తవమే! స్టేట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ దగ్గర ఆంధ్రా యూనివర్సిటీ రూ.10 కోట్లు డిపాజిట్‌ చేయటం నిజమే. కానీ దానిపై వర్సిటీకి 6.2 శాతం వడ్డీ వస్తోంది. ఇది బ్యాంకు వడ్డీకన్నా ఎక్కువే. ఇక ప్రభుత్వమైతే యూనివర్సిటీ నుంచి పైసా కూడా తీసుకోలేదు. సరికదా... బడ్జెట్‌ నుంచే కేటాయింపులు చేస్తోంది. సంస్కరణలు తెచ్చి రాష్ట్ర వర్సిటీలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళుతోంది. కానీ చంద్రబాబు ఉన్నత విద్యకు ఏమాత్రం సంబంధం లేని ‘జనభేరి’ కార్యక్రమం కోసం ఏకంగా యూనివర్సిటీ నుంచి రూ.10 కోట్లు వాడేశారు. ఇలాంటి వార్తలను దాచిపెట్టడమే మీ పత్రికకు శ్రీరామ రక్ష!!.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement