‘ఉరి’ వేసిందెవరు? ఊపిరి పోస్తున్నదెవరు?  | Eenadu Ramoji Rao Fake News On Andhra Pradesh development | Sakshi
Sakshi News home page

‘ఉరి’ వేసిందెవరు? ఊపిరి పోస్తున్నదెవరు? 

Published Sun, Dec 19 2021 4:01 AM | Last Updated on Sun, Dec 19 2021 8:04 PM

Eenadu Ramoji Rao Fake News On Andhra Pradesh development - Sakshi

గుంటూరు జిల్లా కాజ (చినకాకాని) నుంచి గొల్లపూడి వరకు చురుగ్గా సాగుతున్న రహదారి పనులు

‘ఈనాడు’ రామోజీరావు డిక్షనరీయే వేరు. ఆయన దృష్టిలో విజయవాడ నగరమంటే విజయవాడకు చుట్టూ 50 కిలోమీటర్ల వరకూ నగరమే!! రాష్ట్రాభివృద్ధి అంటే.. చంద్రబాబు ఏం చేస్తే అది!! ఔటర్‌ రింగు రోడ్డంటే... చంద్రబాబు ఏం గీస్తే అది!! ఎందుకంటే బాబు ఏం చేసినా, ఏ పార్టీతో జతకట్టినా రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని.. అందరినీ నమ్మించాలనేది రామోజీరావు ప్రగాఢ కోరిక.  జనం నమ్మటం లేదని తెలిసినా కూడా... ఆ అలవాటు తేలిగ్గా పోవటం లేదు మరి. ‘ఓఆర్‌ఆర్‌కు ఉరి’ అంటూ ‘ఈనాడు’ రాసిన రాతల్లో వీసమెత్తయినా నిజం లేకపోవటమే దీనికి సజీవ సాక్ష్యం. ఈ రాతల్లోని నిజానిజాలివీ...  

చంద్రబాబు ధర్నా చేస్తే... అది మహా ధర్నా. అమరావతి కోసం కొందరు ఉద్యమిస్తే... అది మహోద్యమం. తాడూ బొంగరంలేని నాలుగు పార్టీలతో బాబు జట్టుకట్టినా... అది మహా కూటమి. పాపం.. ఈ మైండ్‌సెట్‌తో ఉంటుంది కనకే ‘ఈనాడు’.. బాబు చేసిన చెల్లని ప్రతిపాదనల్ని కూడా మహా ప్రతిపాదనలనుకుంటోంది. అందుకే అప్పుడెప్పుడో 2017లో చంద్రబాబు గీసిన ఓ ఊహాతీత గ్రాఫిక్‌ను ఇప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదంటూ శివాలెత్తిపోయింది. అయ్యో!! రాష్ట్రాభివృద్ధికి విఘాతమంటూ గుండెలు బాదేసుకుంది.  

ఏది నిజం?
అసలు చంద్రబాబు కల్లోకొచ్చిన ఓఆర్‌ఆర్‌ ప్రాజెక్టు.. 10 లక్షల మంది జనాభా ఉన్న విజయవాడకు ఇప్పుడు అవసరమా? వాస్తవికంగా ఆలోచించబట్టే  వైఎస్సార్‌ హయాంలో విజయవాడకు పశ్చిమాన కాజా నుంచి చిన్న అవుటుపల్లికి 6 వరసల బైపాస్‌ ప్రతిపాదించారు. అమరావతి గ్రామాల్లోంచి వెళ్లే దీని పొడవు 48 కిలోమీటర్లు. భూసేకరణ కూడా చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక దీనిపై కేంద్రంతో ఒప్పందం చేసుకుని ఉంటే ఈ పాటికి హాయిగా బైపాస్‌ అందుబాటులోకి వచ్చి ట్రాఫిక్‌ కష్టాలు ఉండేవే కావు. కానీ రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాలకే విలువనిచ్చే చంద్రబాబు... దీన్ని పక్కనబెట్టి 189 కిలోమీటర్ల ఔటర్‌ రింగురోడ్డును ప్రతిపాదించారు. పోనీ దాన్నయినా చిత్తశుద్ధితో ప్రయత్నించారా అంటే అదీ లేదు. డ్రాయింగ్‌కు మాత్రం పరిమితమై... 8,213 ఎకరాలు భూసేకరణ చేయాల్సి ఉండగా ఒక్క ఎకరాన్ని కూడా సేకరించకుండా వదిలేశారు. ఆ చర్యలను ‘ఈనాడు’ ఎన్నడూ ప్రశ్నించలేదు.  

జగన్‌ రావటంతోనే కదలిక... 
వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అధికారలోకి వస్తూనే విజయవాడ సిటీ ట్రాఫిక్‌ వెతలను తీర్చే ప్రాజెక్టులపై దృష్టిపెట్టారు. కేంద్రంతో చర్చలు జరిపి వెస్టర్న్‌ బైపాస్‌ను పట్టాలెక్కించారు. శరవేగంగా సాగుతున్న ఈ పనులు... రెండేళ్లలో పూర్తికాబోతున్నాయి కూడా. దీనికి సమాంతరంగా కాజా నుంచి చిన్న అవుటుపల్లికి కంకిపాడు మీదుగా కృష్ణా నది దిగువన 40 కిలోమీటర్ల ఈస్టర్న్‌ బైపాస్‌నూ వై.ఎస్‌.జగన్‌ ప్రతిపాదించారు. ఈ రెండూ పూర్తయితే విజయవాడ చుట్టూ 88 కిలోమీటర్ల పొడవైన పూర్తిస్థాయి రింగురోడ్డు ఏర్పడుతుంది. దీంతో విజయవాడ ప్రజల ట్రాఫిక్‌ కష్టాలన్నీ తీరుతాయని, త్వరలో పూర్తయ్యే మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్‌ కూడా ఈ రింగురోడ్డు ద్వారా సాగుతుంది కనక నగరంపై ఒత్తిడి పడదని ఆయన ఉద్దేశం. అందుకోసమే భూ సేకరణ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించాల్సి ఉన్నా... కేంద్రం ఈ విషయంలో ఉదారంగా వ్యవహరించేలా వారిని ఒప్పిస్తున్నారు. దీనిపై త్వరలోనే ఎంఓయూ కూడా జరగనుంది. ఇదీ ముఖ్యమంత్రి చిత్తశుద్ధి.  


ఓఆర్‌ఆర్‌నూ వదిలేయలేదు... 
ముందుగా రింగ్‌ రోడ్డును పూర్తి చేస్తే... విజయవాడతో పాటు రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలకు కనెక్టివిటీ పెరిగి అభివృద్ధి చెందుతాయని, అపుడు ఔటర్‌ రింగురోడ్డు అవసరం వస్తుందనేది సీఎం ఉద్దేశం. అందుకే ఆ ప్రతిపాదనను చంద్రబాబు మాదిరి పక్కనపెట్టేయకుండా సజీవంగానే ఉంచారు.  

హైదరాబాద్‌తో పోలికేంటి? 
హైదరాబాద్‌లో 70 లక్షల మంది జనాభా ఉన్నపుడు వైఎస్సార్‌ హయాంలో 150 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌ రింగురోడ్డును నిర్మించారు. దాని భూసేకరణ నుంచి అడుగడుగునా ‘ఈనాడు’ ఎలా అడ్డుపడిందో... ‘పెద్దలా... గద్దలా’ అంటూ ఎన్ని దుర్మార్గపు కథనాలు రాసిందో... అయినా సరే ఆయన సంకల్పాన్ని ఎలా ఆపలేకపోయిందో అందరికీ తెలిసిందే. హైదరాబాద్‌లో ఔటర్‌ పూర్తయిన ఇన్నేళ్లకు... దాని చుట్టూ గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. దీంతో అక్కడి ప్రభుత్వం రీజనల్‌ రింగురోడ్ల గురించి ఆలోచన చేస్తోంది. 

విజయవాడకు ఏది అవసరమో తెలియదా? 
ఇక విజయవాడ విషయానికొస్తే ఇక్కడి జనాభా 10 లక్షలు. దీనికి చంద్రబాబు ప్రతిపాదించింది ఏకంగా 189 కిలోమీటర్ల పొడవైన ఔటర్‌ రింగురోడ్డు. ఎక్కడో సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో వచ్చే ఔటర్‌తో సిటీ ట్రాఫిక్‌ సమస్యలెలా గట్టెక్కుతాయి? ఈ చిన్న లాజిక్‌ అటు చంద్రబాబు కానీ, ఇటు ‘ఈనాడు’ కానీ ఎందుకు మిస్సయ్యారు? అంత దూరంలో ఓఆర్‌ఆర్‌ నిర్మించినా దానికి నగరంతో కనెక్ట్‌ చేయడానికి ఎన్ని రోడ్లని వేస్తారు? దానివల్ల ఎవరికి లాభం? అప్పట్లోనే నిర్మాణానికి రూ.17 వేల కోట్లు అవుతుందని అంచనా వేయగా... ఇపుడది 30వేల కోట్లపైనే అవుతుంది. పైపెచ్చు 8వేలకు పైగా ఎకరాల భూమిని సేకరించాలి.

ఒక రోడ్డు కోసం ఇంతటి వ్యయాన్ని భరించే శక్తి రాష్ట్రానికి ఉందా? ఇవేవీ రామోజీకి పట్టవా? ఇవన్నీ ఆలోచించే... 88 కిలోమీటర్ల రింగురోడ్డుతో విజయవాడ ట్రాఫిక్‌ వెతల్ని తీర్చాలని తలచారు ముఖ్యమంత్రి జగన్‌. ఇది మరో 30–40 ఏళ్ల పాటు నగరంలో పెరిగే జనాభాను దృష్టిలో ఉంచుకుని చేసిన ప్రతిపాదన. చుట్టుపక్కల అభివృద్ధి చెందుతున్న దశలో గనక ఔటర్‌ రింగురోడ్డును తెస్తే అప్పుడు విజయవాడ– గుంటూరు జిల్లాలు కలిసి మహా నగరంగా రూపుదిద్దుకుంటాయనేది ముఖ్యమంత్రి ఆలోచన. ఈ దార్శనికత రామోజీ–బాబు ద్వయానికి  అర్థమయ్యేదెప్పుడు? అర్థమైనా సరే... అర్థం కానట్టు నటించడం మానేదెప్పుడు?   

ఇది.. బాబు కలల ఓఆర్‌ఆర్‌
ఇది చంద్రబాబు ప్రతిపాదించిన ఔటర్‌ రింగురోడ్డు. మొత్తం 189 కిలోమీటర్లు. 2017లో ప్రతిపాదించినపుడు దీని నిర్మాణ వ్యయం 17,762 కోట్లు. పెరిగిన నిర్మాణ వ్యయంతో చూస్తే ఇపుడు రూ.30వేల కోట్లపైనే. ఈ రోడ్డు కోసం కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 87 గ్రామాల్లో ఏకంగా 8,213 ఎకరాల భూమిని సేకరించాలి. కేంద్రం నిబంధనల ప్రకారం భూసేకరణ వ్యయం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి.  

నాడు చంద్రబాబు ఏం చేశారు? 
ఏదైనా డిజైన్లు, గ్రాఫిక్కులకే పరిమితం చేసే చంద్రబాబుది.. ఔటర్‌ విషయంలోనూ అదే తీరు.  విజయవాడకు సంబంధమే లేకుండా.. పశ్చిమాన ధరణికోట, కంచికచర్ల, మైలవరం... తూర్పున  నందివెలుగు, గుడివాడ వంటి ప్రాంతాల మీదుగా వెళ్లేలా ఔటర్‌ను ప్రతిపాదించారు. ఇందులో ఏ ప్రాంతాన్ని తీసుకున్నా విజయవాడ నగరానికి 40–50 కిలోమీటర్ల కన్నా తక్కువ దూరం ఉండదు. పోనీ... ఊహాతీతమైన ఈ ప్రాజెక్టునైనా చిత్తశుద్ధితో చేశారా అంటే అదీ లేదు. జస్ట్‌ డీపీఆర్‌ తయారు చేయించి... పక్కనపెట్టేశారు. 2017–2019 మధ్య రెండేళ్లపాటు ఆ డీపీఆర్‌ను కేంద్రం ఆమోదించేలా ఒత్తిడి తేవటం కానీ.. 8,213 ఎకరాల్లో ఒక్క ఎకరాన్నయినా సేకరించటం కానీ .. ఏమీ చెయ్యలేదు.   విచిత్రం ఏంటంటే... ఆ రెండేళ్లలో దీన్ని ఒక్కరోజైనా ‘ఈనాడు’ ప్రశ్నిస్తే ఒట్టు. ఎందుకంటే బాబు తమవాడు మరి!!. 

విజయవాడ వెస్ట్‌ బైపాస్‌ 
విజయవాడకు పశ్చిమాన కాజా నుంచి అమరావతి మీదుగా గొల్లపూడికి... గొల్లపూడి నుంచి చిన్న అవుటుపల్లికి రెండు ప్యాకేజీలుగా నిర్మిస్తున్న ఈ 6 లైన్ల రహదారి పొడవు 48 కిలోమీటర్లు. మధ్యలో కృష్ణానదిపై నిర్మించనున్న 3.2 కిలోమీటర్ల వంతెన గుంటూర్లోని తుళ్లూరు మండలం వెంకటపాలెం వద్ద ప్రారంభమై కృష్ణా జిల్లా సూరాయపాలెం వద్ద ముగుస్తుంది. ఈ బైపాస్‌ అంచనా వ్యయం రూ. 2,700 కోట్లు. గొల్లపూడి–కాజ రహదారి... మంగళగిరి, తాడేపల్లి పరిధిలోని చినకాకాని వద్ద మొదలై అమరావతి పరిధిలోని కృష్ణాయపాలెం, మందడం మీదుగా గొల్లపూడి చేరుతోంది.  

16 నెలల్లో ఒకటి... మరో రెండేళ్లలో ఒకటి పూర్తి 
శరవేగంగా జరుగుతున్న ఈ రెండు ప్యాకేజీలూ ఒకటి 2023 ఏప్రిల్‌లో... మరొకటి 2024 జనవరిలో పూర్తవుతాయనేది అధికారుల అంచనా. ఇవి పూర్తయితే విజయవాడ నగరంలో ట్రాఫిక్‌ పూర్తిగా అదుపులోకి వస్తుంది. హైదరాబాద్, కోల్‌కతా, చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలు విజయవాడలోకి రావాల్సిన అవసరం లేకుండా వెలుపలి నుంచే నగరాన్ని దాటేయొచ్చు.  

ఈ బైపాస్‌ వల్ల ఇంకో లాభమేంటంటే నగరంలోని ఏ ప్రాంతం నుంచయినా ఈ రోడ్డెక్కటం చాలా సలువు. ఎందుకంటే ఏ ప్రాంతమైనా 5 నుంచి 10 కిలోమీటర్ల దూరం లోపే ఉంటుంది. ముఖ్యమైన అంశమేంటంటే ఈ రోడ్డు అమరావతి మీదుగా కూడా వెళుతుంది. అంటే... అమరావతిలోని దాదాపు అన్ని ప్రాంతాలకూ ఈ  బైపాస్‌ అందుబాటులోకి వస్తుంది. అక్కడి నుంచి నగరం వెలుపలికి వెళ్లటం అత్యంత సులవవుతుంది.  

బాబు హయాంలో ఏం జరిగింది? 
నిజానికి ఈ బైపాస్‌కు నాటి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలోనే భూసేకరణ చేశారు. కేంద్రానికి భూమి అప్పగించి ఒప్పందం చేసుకుంటే చాలు. పనులు పూర్తయి ఈ పాటికి రోడ్డు అందుబాటులోకి వచ్చేది. కానీ చంద్రబాబు గద్దెనెక్కుతూనే ఈ ప్రతిపాదనను పక్కనపడేశారు. భూసేకరణ జరిగిందని కూడా పట్టించుకోలేదు. కొత్తగా అమరావతి రియల్‌ ఎస్టేట్‌ కోసం సిటీకి 50 కిలోమీటర్ల దూరంలో చుట్టూ గూగుల్‌ మ్యాపులో గీత గీసి కొత్త ‘ఓఆర్‌ఆర్‌’ పాట మొదలెట్టారు.

విజయవాడ ఈస్ట్‌ బైపాస్‌ 
కాజ నుంచి కంకిపాడు మీదుగా చిన్న అవుటుపల్లికి వెళ్లటానికి కృష్ణా నది దిగువ ప్రాంతంలో నిర్మించనున్న ఆరు వరసల రహదారి ఇది. పొడవు 40 కిలోమీటర్లు. అంచనా వ్యయం రూ.2,100 కోట్లు. దీన్ని నిర్మిస్తే వెస్టర్న్‌ బైపాస్‌ – ఈస్టర్న్‌ బైపాస్‌ కలిసి విజయవాడ నగరానికి ఆరు వరసల రింగురోడ్డు ఏర్పడుతుంది. దీంతో నగరం నుంచి బయటకు ఎక్కడకు వెళ్లాలన్నా ప్రయాణం చాలా ఈజీ అవుతుంది. 

వీటన్నిటికీ తోడు కనెక్టివిటీ పెరిగి ఈ రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలన్నీ అభివృద్ధి చెందుతాయి. ట్రాఫిక్‌ వెతలు తగ్గి విజయవాడ స్వరూపమే మారిపోతుంది. విజయవాడకు, ఈ రింగురోడ్డు చుట్టుపక్కలి గ్రామాలకు రియల్‌ ఎస్టేట్‌ పరంగా మంచి బూమ్‌ వస్తుంది.  

మచిలీపట్నం పోర్టు ట్రాఫిక్‌ కూడా... 
మరో ముఖ్యాంశమేంటంటే మచిలీపట్నం పోర్టు రెండు మూడేళ్లలో పూర్తవుతుంది. అప్పుడు పోర్టు ట్రాఫిక్‌ మొత్తం విజయవాడ నగరం గుండానే వెళితే ఆ ట్రాఫిక్‌ రద్దీని తట్టుకోవటం కష్టం. దీంతో వీలైనంత వేగంగా ఈ సమస్య నుంచి గట్టెక్కాలనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఈ తూర్పు బైపాస్‌పై దృష్టిపెట్టారు. నిజానికి భూ సేకరణ వ్యయాన్ని పూర్తిగా రాష్ట్రమే భరించాలి. కానీ ముఖ్యమంత్రి పలుమార్లు కేంద్ర నేతలను కలవటంతో పాటు ఈ రోడ్డు పనులకు సంబంధించిన జీఎస్‌టీ, సీనరేజీ, సెస్సులను వదులుకోవటానికి సిద్ధపడ్డారు. దీంతో భూసేకరణ వ్యయంలో 50 శాతాన్ని భరించడానికి కేంద్రం అంగీకరించింది. ఈ విషయంలో మరింత ఉదారంగా వ్యవహరించేలా కేంద్రంపై ముఖ్యమంత్రి ఒత్తిడి తెస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి ఎంఓయూ జరగనుంది. ఈ రెండు బైపాస్‌లూ అందుబాటులోకి వస్తే... వచ్చే 30 ఏళ్లలో విజయవాడ, చుట్టుపక్కలి ప్రాంతాల ట్రాఫిక్‌ను తట్టుకునే రింగురోడ్డు పూర్తయినట్లే. ఈ రింగురోడ్డు ప్రాంతంతో అమరావతికీ యాక్సెస్‌ ఉంటుంది.  

మరి చంద్రబాబు పట్టించుకోలేదేం? 
కారణం ఒక్కటే. విజయవాడకు రింగురోడ్డు వస్తే ఇక్కడ రియల్టీ పెరుగుతుంది. చుట్టుపక్కల భూముల రేట్లు పెరుగుతాయి. అమరావతిలో మాత్రం బాబు అనుకున్నంతగా రియల్టీ వ్యాపారం సాగదు. అదే ప్రధాన కారణం నారా వారు దీన్ని పట్టించుకోకపోవటానికి.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement