Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా? | Eenadu Ramoji Rao False Propaganda On Transparent Sand Policy | Sakshi
Sakshi News home page

Fact Check: ఊహించినదే వార్తలుగా.. ‘ఈనాడు’ రామోజీ ఇక మారవా?

Published Fri, Mar 31 2023 3:47 PM | Last Updated on Fri, Mar 31 2023 5:05 PM

Eenadu Ramoji Rao False Propaganda On Transparent Sand Policy - Sakshi

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా జరిగిన ఇసుక దోపిడీకి చెక్‌ పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్న ఇసుక పాలసీపై మరోసారి 'ఈనాడు' పత్రిక అసత్యాలు, అభూత కల్పనలతో తప్పుడు కథనాన్ని ప్రచురించడాన్ని గనులశాఖ సంచాలకులు వీజీ వెంకటరెడ్డి ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

'దోచుకో... పంచుకో... తినుకో...’ అనే శీర్షికతో ‘ఈనాడు’ పత్రిక పూర్తి అవాస్తవాలతో కూడిన కథనం రాశారని, వాస్తవాలను వక్రీకరిస్తూ... అబద్దాలతో కూడిన ఆరోపణలను తమ పత్రికలో ప్రచురించారన్నారు. గతంలో జేపీ, టర్న్‌కీ సంస్థలపై పదేపదే తప్పుడు వార్తలు ప్రచురించిన ఈనాడు పత్రిక ఇప్పుడు అధికార పార్టీ ముఖ్య నేతలు, సిండికేట్లు అంటూ మరోసారి ఊహాత్మక ఆరోపణలతో, కట్టుకథలతో వార్తను ప్రచురించడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ప్రభుత్వంలో జరిగింది ఇదే..
గత ప్రభుత్వంలో ప్రారంభంలో మహిళా సంఘాలకు ఇసుక ఆపరేషన్స్‌ను అప్పగించి, ఇసుక మాఫియా ధాటికి వారు పనిచేయలేని పరిస్థితిని కల్పించింది. తరువాత ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత ఇసుక విధానంతో ఇసుక మాఫియా ఇష్టారాజ్యంగా ప్రజలను దోచుకుంది. వినియోగదారులు బ్లాక్ మార్కెట్ నుంచి అధిక ధరలకు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొందరు వ్యక్తుల జేబులు నింపేందుకే ఉచిత ఇసుక విధానం ఉపయోగపడింది. అటు ప్రభుత్వానికి  ఐదేళ్లలో రావాల్సిన దాదాపు రూ.3825 కోట్ల ఆదాయానికి గండి పడింది. ఈ సొమ్ము ఇసుక మాఫియా జేబుల్లోకి వెళ్లింది.

ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే
మరోవైపు ప్రజలు అధిక ధరల్లో బ్లాక్ మార్కెట్‌లో ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకంగా ఒక మహిళా ఎమ్మార్వో పైనే అప్పటి ప్రభుత్వ విప్, దెందులూరు ఎమ్మెల్యేగా ఉన్న చింతమనేని ప్రభాకర్ దాడి  చేసిన ఘటన ఇసుక మాఫియా ఆగడాలకు అద్దం పట్టింది. గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఇసుక లారీలు పొరుగు రాష్ట్రాలకు తరలిపోయాయి. లెక్కా పత్రం లేకుండా విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిగాయి. ఈ మొత్తం విధానాన్ని మార్చేందుకు సీఎం జగన్ నూతన ఇసుక పాలసీని తీసుకువచ్చారు.

ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? 
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా రాష్ట్రంలో ఇసుక టెండర్లను నిర్వహింపచేయడం, పారదర్శక విధానం, సులభతరంగా ఇసుక లభ్యత, అందుబాటు ధరల్లో వినియోగదారులకు చేరువ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే క్రమంలో పర్యావరణానికి ఎటువంటి విఘాతం ఏర్పడకుండా, పూర్తి అనుమతులతో ఇసుక ఆపరేషన్స్ జరిగేలా చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా జరిగిన ఇసుక తవ్వకాల కారణంగా ఎన్జీటి ఏకంగా రూ.100 కోట్ల జరిమానాను విధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం ఇసుక పాలసీ ద్వారా తీసుకున్న చర్యలను పరిశీలించిన ఎన్జీటి సంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ప్రభుత్వం తప్పిదాల వల్ల విధించిన రూ.100 కోట్ల జరిమానాను కూడా రద్దు చేసింది. ఈ విషయం 'ఈనాడు' పత్రికకు తెలియదా? 

ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా..
టెండర్ల ద్వారా రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌ను దక్కించుకున్న జేపీ సంస్థ ఆధ్వర్యంలోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. సదరు సంస్థ  ప్రతి ఏటా ప్రభుత్వానికి రూ.765 కోట్లు రెవెన్యూగా చెల్లిస్తోంది. టన్ను ఇసుక ఓపెన్ రీచ్‌లలో రూ.475 కి విక్రయిస్తున్నారు. అలాగే రీచ్‌లు, డిపోల వద్ద రవాణా చార్జీలతో కలిపి ఇసుక ధరలను కూడా ప్రతివారం పత్రికల ద్వారా ప్రభుత్వం ప్రకటిస్తోంది. అంతకన్నా ఎక్కువకు ఎవరు విక్రయించినా, ఇసుక కొనుగోళ్లు రవాణాలో ఎటువంటి సమస్యలు ఉన్నా టోల్ ఫ్రీ నెంబరు ద్వారా ఫిర్యాదు చేసే సదుపాయం కల్పించాము. వినియోగదారులు నేరుగా డిపోలు, రీచ్ ల వద్దకు వెళ్ళి ఇసుక నాణ్యతను పరిశీలించి, కావాల్సినంత ఇసుకను బుక్ చేసుకునేందుకు వీలు కల్పించాం. రాష్ట్రంలో ఎక్కడా ఇసుక కొరత అనేది లేకుండా సులభతర విధానాన్ని తీసుకువచ్చాం.

ఎప్పటికప్పుడు తనిఖీలు
ప్రతినెలా జేపీ సంస్థ తమకు అప్పగించిన రీచ్‌లకు గానూ ఎంత పరిమాణంలో పర్యావరణ అనుమతులు పొందింది, ఎంత మేర ఇసుక తవ్వకాలు చేసింది, ఎంత మేర విక్రయాలు చేసిందో గనులశాఖకు నివేదిస్తుంది. గనులశాఖ అధికారులు దీనిని పరిశీలించిన తరువాతే తరువాత తవ్వకాలకు అనుమతులు మంజూరు చేస్తున్నారు. అంతేకాదు రాష్ట్రం దాటి ఇసుకను పొరుకు రాష్ట్రాలకు రవాణా చేసేందుకు వీలు లేకుండా ప్రభుత్వం జిఓ నెం.71 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసింది. గనులశాఖ రీజనల్ స్వ్కాడ్స్, ఎస్ఇబి కూడా దీనిపై ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నాయి.

పనికట్టుకుని తప్పుడు కథనాలు..
ఇంత పకడ్భందీగా ఇసుక విధానాన్ని అమలు చేస్తుంటే... ఈనాడు పత్రిక పనికట్టుకుని వరుసగా తప్పుడు కథనాలను ప్రచురించడం బాధాకరం. ఈ ప్రభుత్వంపై ఏదో ఒక రీతిలో బుదరచల్లే ఉద్దేశంతోనే ఇటువంటి అసత్య కథనాలను ఈనాడు పత్రిక వండి వారుస్తోంది. నియోజకవర్గాల్లో అధికారపార్టీ నేతలే సిండికేట్లుగా మారి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారని ఏ సమాచారంతో ఈనాడు పత్రిక ఆరోపిస్తోంది? రాష్ట్రంలో ఏటా 2 కోట్ల టన్నుల ఇసుక వినియోగం ఉంది. దానికి అనుగుణంగానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఎక్కడా ఇసుక కొరత అనేది లేదు.

ఏ ఆధారాలతో ఈ ఆరోపణలు..
వర్షాకాలం కోసం కూడా ముందుగానే డిపోల్లో ఇసుక నిల్వలను అందుబాటులో ఉంచుతున్నాం. 2 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలకు గానూ రూ.765 కోట్లు రెవెన్యూ వస్తుందని అంచనా. ఈనాడు పత్రిక మాత్రం ఏకంగా ఏడాదికి రూ.1800 కోట్లు ఆదాయం వస్తోందని ఏ లెక్కల ప్రకారం చెబుతోంది? పక్క రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా ప్రభుత్వం జిఓ 71 ని జారీ చేసి, దానిని అమలు చేస్తోంది. అటువంటప్పుడు పొరుకు రాష్ట్రాలకు భారీగా అక్రమ రవాణా జరుగుతోందని ఏ ఆధారాలతో ఈనాడు పత్రిక ఆరోపణలు చేస్తోంది ఈనాడు పత్రిక చేసిన ఆరోపణల ప్రకారం పొరుగు రాష్ట్రాలకు ఇసుక తరలిపోతే, రాష్ట్రంలో అవసరాలకు ఇసుక కొరత ఏర్పడి ఉండేది కాదా? ఏ రీచ్‌లో అయినా కావాల్సినంత ఇసుక అందుబాటులో ఉంది. అంటే ఈనాడు పత్రిక తన కథనంలో రాసినదంతా అసత్యాలు అని అర్థమవుతోంది.

‘ఈనాడు’ రాతలకు అర్థం ఉందా?
ప్రతి రీచ్ లోనూ పర్యావరణ అనుమతులు పొందిన తరువాత ఇసుక తవ్వకాలు ప్రారంభమవుతున్నాయి. ఇసుక పరిమాణం, రేటు కూడా ఖరారు అయిన తరువాత దానిపై వచ్చే ఆదాయం కూడా ముందుగానే నిర్ణయించడం జరిగింది. ఇవ్వన్నీ తెలిసి కూడా జిల్లాల్లో రీచ్ ల వారీగా అత్యధిక రేట్లకు ఇసుక తవ్వకాలు చేస్తామని ఎవరైనా ముందుకు వస్తారా? జిల్లాల వారీగా కోట్ల రూపాయల రేట్లను ఖరారు చేసి, అధికార పార్టీ నేతలకు ఇచ్చారు. వారి నుంచి ముఖ్య నేతలు లక్ష్యాలు విధించి మరీ కోట్లాది రూపాయలను వసూలు చేస్తున్నారనే రాతలకు అర్థం ఉందా? జేపీ సంస్థ నిబంధనల ప్రకారం తాను చెల్లించాల్సిన మొత్తాలను నేరుగా ప్రభుత్వానికి జమ చేస్తోంది. అన్ని రీచ్ లు వారి ఆధీనంలోనే ఉన్నాయి. అలాంటప్పుడు బయటి వ్యక్తులు ఇసుక ఆపరేషన్స్ ఎలా చేస్తారు? నెలకు జిల్లాకు రూ.150 కోట్లు ఎలా వసూలు చేస్తారు? దానిని హైదరాబాద్ లోని ముఖ్య నేతలకు ఏ విధంగా చెల్లిస్తారు? 

ఊహలను వార్తలుగా రాస్తూ...
ఈనాడు పత్రిక తమ ఊహలను వార్తలుగా రాస్తూ.... రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావాలని, ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు కలిగించాలనే ఉద్దేశంతోనే ఇసుక పేరుతో పదేపదే తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది. దీనిపై వాస్తవాలను తెలుసుకునేందుకు సంబంధిత అధికారులను కూడా కనీసం వివరణ కూడా కోరలేదు. ఉద్దేశపూర్వకంగా ఇటువంటి తప్పుడు కథనాలను ప్రచురిస్తే ఈనాడు పత్రికపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వీజీ వెంకటరెడ్డి హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement