సాక్షి, అమరావతి: ఈ ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ చేరుతున్న సంక్షేమాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియని టీడీపీ–ఈనాడు సహిత ఎల్లో కూటమి సరికొత్త కుట్రలకు తెరతీస్తోంది. ఒకవైపు టీడీపీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి పెరిగిన ధరలకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వమే కారణమంటూ విష ప్రచారానికి దిగుతున్నారు. మరోవైపు వారు చేస్తున్న ప్రచారాన్నే ‘ఈనాడు’ కూడా పతాక శీర్షికల్లో అచ్చువేస్తోంది. నిజానికి ధరల పెరుగుదల చాలావరకూ రవాణా రంగంపై ప్రభావం చూపించే ముడి చమురు, బొగ్గు, గ్యాస్ వంటి ఇంధనాలపై ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ కేంద్రం నియంత్రణలోనే ఉంటాయి. కొన్నేళ్లుగా వీటి ధరలు అటు అంతర్జాతీయంగా... ఇటు దేశీయంగా పెరుగుతూనే వస్తుండటంతో వీటి ప్రభావం వల్ల నిత్యావసరాల ధరలూ పెరుగుతున్నాయి.
ఇది దేశవ్యాప్తంగా కనిపిస్తున్న పరిణామం. ఇవన్నీ రామోజీరావుకు తెలియక కాదు. ఆయన అజెండా వేరు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వంపై జనంలో ఏదో ఒకరకంగా వ్యతిరేకత పెంచేసి... అర్జెంటుగా చంద్రబాబును గద్దెనెక్కించేయాలన్నది ఆయన ముప్పొద్దులా కంటున్న కల. దానికోసమే ఈ ప్రయాస అంతా. వాస్తవానికి దేశంలోని ఏ ఇతర రాష్ట్రంతో పోల్చినా చాలా సరుకుల ధరలు మన రాష్ట్రంలోనే తక్కువ. పొరుగున ఉన్న తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలతో పోల్చినా అదే పరిస్థితి. కాకపోతే బాబును గద్దెనెక్కించటమే లక్ష్యంగా రోజూ ‘ఈనాడు’లో ప్రతి పేజీలోనూ విషం కక్కుతున్న రామోజీరావుకు వాస్తవాలతో పనే లేదు. అందుకే ధరల విషయంలోనూ అదే చేశారు.
ప్రజాదరణలో ‘ఈనాడు’దీ బాబు పరిస్థితే!
అబద్ధాల చంద్రబాబును గత ఎన్నికల్లో జనమంతా ఛీకొట్టి ఓడించినట్లే రామోజీరావు పత్రిక ‘ఈనాడు’నూ పాఠకులు ఛీకొడుతున్నారు. ఈ ప్రభుత్వంపై గుడ్డి వ్యతిరేకతతో ప్రజలకు మేలు జరుగుతున్న పనులను కూడా వక్రీకరిస్తూ కాలకూట విషం చిమ్మటాన్ని జనం సహించటం లేదు. దీంతో చంద్రబాబు మాదిరిగానే ‘ఈనాడు’ ప్రజాదరణ కూడా దారుణంగా పడిపోయింది. పత్రికను కొనుక్కుని చదివేవారు చాలామంది దాన్ని మానేశారు.
ఎన్నికల వేళ పాఠకులు తగ్గిపోతే ఎలాగని మథనపడ్డ రామోజీరావు... చివరకు రాష్ట్రంలో ఇంటింటికీ ‘ఈనాడు’ను ఫ్రీగా పంచిపెట్టడం మొదలెట్టారు. పత్రికను కొనుక్కుని చదివేవారికి ఈ సంగతి తెలిసి... ఎలాగూ ఫ్రీగా ఇస్తున్నారు కదా అని సబ్‌్రస్కిప్షన్లకు ఫుల్‌స్టాప్ పెడుతున్నారు. ఈ పరిస్థితి అంతకంతకూ పెరుగుతోందని, కొనుక్కుని చదివేవారంతా మానేసి ఫ్రీగా అడుగుతున్నారని, దీన్ని తట్టుకోవటం కష్టమవుతోందని ‘ఈనాడు’ వర్గాలే వాపోతుండటం గమనార్హం.
దేశ సగటు ధరలతో పోలిస్తే ఏపీలోనే తక్కువ..
నిత్యావసర సరుకుల ధరలకు వస్తే... దేశ వ్యాప్తంగా సగటు ధరలతో ఆంధ్రప్రదేశ్‌లోనే రేట్లు తక్కువగా ఉన్నాయి. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్నాటక, తెలంగాణలోనూ ఒకటి రెండు మినహా నిత్యావసరాల రేట్లు అధికంగానే ఉన్నాయి. జాతీయ స్థాయిలో కిలో సాధారణ బియ్యం రూ.43.17 ఉంటే ఏపీలో స్థానికంగా 39.84గా ఉంది.
జాతీయంగా ధరలు ఏపీ కంటే సన్‌ఫ్లవర్ నూనెపై రూ.11.61, వేరుశనగా రూ.20, పామాయిల్ రూ.10, ఉల్లి రూ.6, టామాటా రూ.10 ఎక్కువగా ఉన్నాయి. తెలంగాణలో చూసినా కందిపప్పుపై రూ.14.65, మినపప్పు రూ.11, పెసరపప్పు రూ.5.33, శనగపప్పు రూ.5.42, ఉల్లి రూ.6.74 రేటు ఎక్కువే. కానీ, రామోజీరావు ఈ ప్రభుత్వం వచ్చాకే రేట్లు పెరిగిపోతున్నట్టు తప్పుడు కథనాన్ని రక్తికట్టించే ప్రయత్నం చేశారు.
అంతర్జాతీయంగా నెలకొన్న ఒడిదుడుకులు, ద్రవ్యోల్బణం, డిమాండ్, సప్లై ఆధారంగా మార్కెట్‌లో రేట్ల హెచ్చుతగ్గులు సహజం. దీనికి తోడు ఏటా పంటలకు మద్దతు ధర పెరుగుతోంది. ఆ ప్రభావం కూడా మార్కెట్‌పై పడుతోంది. ఈ వాస్తవాలను దాటిపెట్టి ‘ఈనాడు’ సోమవారం నాడు ‘నిప్పుల్లా నిత్యావసరాలు’ అంటూ ప్రజలను మభ్యపెట్టే కథనాన్ని వండివార్చటం వెనక పెద్ద కథే ఉంది.
ఎందుకంటే ‘ఈనాడు’ కథనానికి ముందే టీడీపీ డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు పలు ప్రాంతాల్లో ఇంటింటికీ వెళ్లి వారికి అందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు జనమంతా తమకు అందుతున్న పథకాలపై సంతృప్తిని వ్యక్తం చేయటంతో... పథకాల ద్వారా అందిన మొత్తం కంటే ఎక్కువ మొత్తాన్ని నిత్యావసర సరుకుల ధరలు పెరగటం వల్ల కోల్పోతున్నారంటూ వారి మెదళ్లలో విషం నింపే ప్రయత్నం చేశారు ఎల్లో బ్యాచ్. దీన్ని సహించలేక చాలాచోట్ల జనం ఎదురుతిరిగారు.
అలాంటి సంఘటనే ఆదివారం అన్నమయ్య జిల్లా రాజంపేటలోనూ చోటు చేసుకుంది. దీంతో తమ కుట్రలో భాగంగా సోమవారం ‘ఈనాడు’లో కథనాన్ని రాయించింది ఎల్లో ముఠా. దీన్నే సోషల్ మీడియాలోనూ పలువురు టీడీపీ బ్యాచ్ వైరల్ చేయటం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ ధరలు పెరిగాయనే వాస్తవాన్ని కావాలని మరుగునపరిచి వైఎస్సార్‌సీపీ విధానాల వల్లే పెరుగుతున్నాయని ప్రచారం చేస్తుండటంపై టీడీపీలోనే పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు చెప్పుకునేందుకు తమ పార్టీ తరఫున ఏ అంశాలు దొరక్క చివరికి ఇలాంటి అపోహలపైనే తమవారు ఆధారపడ్డారంటూ ఓ టీడీపీ కార్యకర్తే అసహనం వ్యక్తం చేయటం గమనార్హం.
రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి...
ఏ వస్తువు ధరలైనా దెబ్బతింటే రైతును ఆదుకోవటంలోను... ధరలు పెరిగిపోతే వినియోగదారుకు సాంత్వన కలిగించటంలోను దేశంలో అన్ని రాష్ట్రాలకన్నా ఏపీ ముందుంటోంది. ఇందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నిర్దేశిత పంటలకు గనక ధర పడిపోతే, మార్కెట్‌లో జోక్యం చేసుకుని ఈ నిధితో వాటిని కనీస గిట్టుబాటు ధరకు కొనుగోలు చేస్తోంది. ఊహించని రీతిలో ధరలు పెరిగినపుడు ఆ సరుకుల్ని అందుబాటు ధరల్లో వినియోగదారుకు అందించటానికి కూడా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఉదాహరణకు ఉక్రెయిన్ యుద్ధ సమయంలో వంటనూనెల ధరలు కొండెక్కిన పరిస్థితుల్లో వాటిని రైతు బజార్ల ద్వారా అందుబాటు ధరలకే విక్రయించింది. ఇక రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడానికి సీఎం యాప్ ద్వారా ప్రతిరోజు గ్రామ స్థాయిలో మార్కెట్ ధరలను పర్యవేక్షిస్తోంది. ఇలా పొగాకు సహా ప్రధాన వ్యవసాయ వాణిజ్య పంటలకు ధరలు పతనమైన ప్రతిసారీ జోక్యం చేసుకుని మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఇలా ఇప్పటి వరకు రూ.7712 కోట్ల విలువైన 21.55 లక్షల టన్నుల పంట ఉత్పత్తులను కొనుగోలు చేశారు.
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.139.90 కోట్ల విలువైన పొగాకుతో పాటు రూ.1789 కోట్ల విలువైన పత్తిని సైతం రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. నిజానికి టీడీపీ తన ఐదేళ్ల పాలనలో ఇలా ధరలు పతనమైన సమయంలో రైతుల కోసం వెచ్చించింది కేవలం రూ.3322 కోట్లు. ధరల నియంత్రణలో భాగంగా తాజాగా రైతు బజారాల్లో సుపర్‌ఫైన్ బియ్యం, కందిపప్పు విక్రయాలకు ఈ ప్రభుత్వం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 8,990 క్వింటాళ్ల బియ్యం, 1206 క్వింటాళ్ల కందిపప్పును విక్రయించారు. ఈ మూడేళ్లలో రూ.69.10 కోట్లు విలువైన 9462.49 టన్నుల ఉల్లిపాయలను సేకరించి రైతు బజార్లలో విక్రయించారు.
దేశం కంటే మిన్నగా.. ఏపీలోనే మిల్లెట్ల పంపిణీ
ప్రస్తుతం రాగులు, కొర్రలు వంటి చిరుధాన్యాలకు ఎమ్మెస్పీ కంటే మార్కెట్ రేటు ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా ఉన్నత, మధ్య తరగతి కుటుంబాలు చిరుధాన్యాలను ఆహారం తీసుకోవడంతో డిమాండ్ పెరిగింది. అయితే వినియోగానికి తగినంత పంట ఉత్పత్తులు లేకపోవడంతో చిరుధాన్యాల రేట్లు ఎక్కువగా ఉంటున్నాయి. ఈ క్రమంలోనే పేదలకు పౌష్టికాహారం అందించడంలో భాగంగా దేశంలో తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం పీడీఎస్ ద్వారా జొన్నలు, రాగులు పంపిణీకి శ్రీకారం చుట్టింది.
ఈ ఏడాది మే నుంచి రాయలసీమ, ఉత్తరాంధ్రలో పైలెట్ ప్రాజెక్టుగా కార్డుదారులకు గరిష్టంగా రెండు కిలోల చొప్పున జొన్నలు, రాగులను సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 3,303 టన్నుల జొన్నలు, 13,052 టన్నుల రాగులను అందించింది. చిరు ధాన్యాలకు మార్కెట్‌లో మంచి రేటుండటంతో కావలసిన సరుకును సేకరించడం సవాల్‌గా మారింది. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం రైతులను చిరుధాన్యాల వైపు మళ్లేలా ప్రోత్సహిస్తోంది.
రైతులు పండించిన పంటను స్థానికంగానే పౌరసరఫరాల సంస్థ ద్వారా కొనుగోలు చేసి వాటిని పీడీఎస్‌లో ప్రజలు అందించేలా కార్యచరణ రూపొందింది. ఈ ఖరీఫ్‌లో జనవరి నుంచి జొన్నలు, రాగులను నేరుగా రైతుల నుంచి సేకరించనుంది. కేంద్ర ప్రభుత్వ మద్దతు ధరల జాబితాలో లేని కొర్రలను సైతం రాష్ట్రంలో రైతుల నుంచి సేకరించేలా ప్రత్యేక అనుమతులు సైతం తీసుకుంది. తొలిసారిగా కొర్రలను మద్దతు ధరకు అవసరమైతే మార్కెట్ ధరకు కొనుగోలు చేయనుంది.
కిలో రూ.67కే కందిపప్పు..
పేదలకు నాణ్యమైన ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీలో ఏపీ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికీ నిత్యావసరాలు అందిస్తోంది. రాష్ట్రంలో 1.48 కోట్ల రైస్ కార్డులుంటే రేషన్ తీసుకునే వారి శాతం 90కిపైగా చేరింది. మార్కెట్‌లో లభించే సన్నబియ్యం మాదిరే రేషన్ బియ్యం ఉండటంతో ఎక్కువ మంది ప్రజలు వాటిని ఆహారంగా వినియోగిస్తున్నారు. దీనికి తోడు కందిపప్పు సైతం సబ్సిడీపై కిలో రూ.67కు పంపిణీ చేస్తోంది. గడిచిన 4 నెలలుగా సరుకు అందుబాటులో లేకపోవడంతో సరఫరాల అవరోధం ఏర్పడింది.
తాజాగా హైదరాబాద్ అగ్రికల్చర్ కో ఆపరేటివ్ అసోసియేషన్ ద్వారా పౌరసరఫరాల శాఖ సుమారు 10వేల టన్నుల కందిపప్పు కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. దశల వారీ సరఫరాలో భాగంగా నవంబర్ నుంచే సరుకును అందించడంతో కార్డుదారులకు ఊరటలభించింది. డిసెంబర్ నుంచి పూర్తి స్థాయిలో కార్డుదారులుందరికీ పంపిణీ చేయనుంది. ఇకపై కందిపప్పు సరఫరాలో జాప్యం లేకుండా డిసెంబర్ చివరినాటికి నుంచి స్థానిక రైతుల ద్వారా కందులు కొనుగోలు చేయడంతో పాటు ప్రాసెసింగ్ చేసి అందించనుంది.
అంతేకాక కేంద్రం కంటే మిన్నగా గడిచిన మూడు నెలల నుంచి పౌరసరఫరాల శాఖ ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని సరఫరాల చేస్తోంది. కేంద్రం మాత్రం తాజాగా భారత్ బ్రాండ్ పేరుతో కిలో గోధుమ పిండిని రూ.27.50 ఇస్తున్నట్టు ప్రకటిచింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కిలో రూ.16కే అందిస్తోంది. ఇప్పటి వరకు 10,625 టన్నులు పంపిణీ చేయగా డిసెంబర్‌లోనూ 4వేల టన్నులకు పైగా ఫోర్టిఫైడ్ గోధుమ పిండిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. కాకపోతే... వైఎస్ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారమే నిత్యావసరంగా మారిపోయిన ‘ఈనాడు’కు ఈ వాస్తవాలతో పనేముంది!!.
'అసత్యం.. నిత్యావసరం'
Published Tue, Nov 21 2023 3:55 AM | Last Updated on Tue, Nov 21 2023 8:43 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment