నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్‌ జాగ్రత్త! | Ap Elections 2024: Chandrababu Naidu Kirayi Mutas on Mouth Talk | Sakshi
Sakshi News home page

నారావారి కిరాయి ముఠాలు.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Fri, Apr 5 2024 11:47 AM | Last Updated on Fri, Apr 5 2024 2:58 PM

Ap Elections 2024: Chandrababu Naidu Kirayi Mutas on Mouth Talk - Sakshi

పచ్చపార్టీని ఓటమి భయం వెంటాడుతోంది. ఈ ఎన్నికల్లోనూ ఘోర పరాభవం తప్పదని వారి సర్వేల్లోనే తేలిపోయింది. జనసేన-బీజేపీలతో ప్రత్యక్షంగానూ  కాంగ్రెస్ తో పరోక్షంగానూ  కమ్యూనిస్టులతో  సీక్రెట్ ఒప్పందాలతోనూ బరిలో దిగినా లాభం ఉండేలా లేదని తేలిపోయింది. దింపుడు కళ్లెం ఆశలు కూడా అడుగంటేశాయని అర్ధమైపోతోంది. ఇంత ఫ్రస్ట్రేషన్ లో వలంటీర్లపై కక్షసాధింపు కోసం తాము పన్నిన పాచిక తమనే లాగి లెంపకాయ కొట్టేయడంతో దవడ వాచిపోయింది. ఆంధ్ర ప్రదేశ్ లో జనం అంతా జగన్ మోహన్ రెడ్డి యాత్రలోనే ఉన్నారని అర్ధం అయిపోయింది. మరేం  చేయాలి?

ఈ కష్టాల్లోనే చంద్రబాబు నాయుడికి ఓ దిక్కుమాలిన ఐడియా వచ్చింది. దాంతో పాలక పక్షం ఓడిపోతోందంటూ ప్రచారం చేయించడానికి  మౌత్ టాక్ మల్లిగాళ్లకు కిరాయి డబ్బులిచ్చి ఊళ్లపైకి వదిలారు. అయితే వారిని చూసి జనం నవ్వుకుంటున్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. కొద్ది రోజులుగా మాయదారి ముఠాలు ఊళ్లల్లో తిరుగుతున్నాయి స్టూవర్ట్ పురం  దొంగల ముఠాలకన్నా ప్రమాదకరమైన ముఠాలవి.చంద్రబాబు నాయుడి రాజకీయ ప్రయోజనాలకోసం..ఆయన రాజకీయ ప్రత్యర్ధులపై విష ప్రచారం చేయడం ఈ ముఠాల పని. దీనికోసం వీరికి కిరాయి చెల్లిస్తున్నారు. ఈ ముఠాల అవసరం చంద్రబాబుకు ఎందుకొచ్చిందంటే...

తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యే. చంద్రబాబు నాయకత్వానికి కూడా. ఈ ఎన్నికల్లో కూడా  ఓడి ఇంట్లోనే ఉండాల్సి వస్తే టీడీపీ దుకాణానికి తాళాలు వేయాల్సిందే. ప్రస్తుత వాతావరణం చూస్తోంటే ఈ సారి కూడా వైఎస్సార్‌సీపీ విజయమే ఖాయమని  రక రకాల సర్వేలు చెబుతున్నాయి. టీడీపీకి ఈసారి మరింత ఘోర పరాభవం తప్పదని క్లారిటీ ఇస్తున్నారు అంతా. మే 13న ఎన్నికలు జరగనున్నాయి.  ఆలోపు కోట్లాది మంది ఆంధ్ర ప్రజల మనసులు మార్చడం తన వల్ల కాదని తెలిసిపోయింది. టీడీపీ గెలుస్తుందని  చెప్పించుకున్నా ఎవరూ నమ్మరని అర్ధమైపోయింది. ఈ తరుణంలోనే చంద్రబాబు తనకే సాధ్యమైన ఓ క్షుద్ర ఆలోచనను  మెదడులోంచి బయటకు తీశారు.

ఆ ఆలోచన ఏంటంటే..
టీడీపీ-జనసేన- బీజేపీ కూటమి గెలుస్తందని చెబితే ఎవరూ నమ్మరు కాబట్టి. వైఎస్సార్‌సీపీ గెలవదని చెబితే  ఏమైనా వర్కవుట్ అవుతుందేమో అని ఓ పుచ్చు ఐడియాను  అమలు చేస్తున్నారు.  జనం ఎక్కువగా తచ్చాడే  కూడళ్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రైళ్లల్లో  కొన్ని గుంపులను పంపిస్తున్నారు చంద్రబాబు. ఈ గుంపుల పని ఏంటంటే.. మేం  వైఎస్ఆర్.కాంగ్రెస్  కార్యకర్తలమే కానీ.. ఈ సారి మా పార్టీ ఓడిపోయేలా ఉంది" అని ప్రచారం చేస్తున్నారు. అంటే మౌత్ టాక్ పబ్లిసిటీ అన్నమాట. దీనికి గానూ ఈ గుంపులకు రోజుకింత అని కిరాయి ముట్టజెబుతున్నారు. సోషల్ మీడియాలో  పెయిడ్ బ్యాచులను  ఆరు బయట పెయిడ్ ఆర్టిస్టులను మేపినట్లే..ఈ మౌత్ టాక్  మల్లిగాళ్లను ఎన్నికల వరకు మేపాలని డిసైడ్ అయ్యారు.

పీకే ఫ్యామిలీపై విషం చిమ్మినోళ్లే..
జనం రద్దీగా ఉండే చోట వీళ్లు అమాంతం వచ్చి.. వాళ్లే మాటలు కలిపి ఈ సారి వైఎస్సార్‌సీపీ రాదండి అనేసి ప్రచారం చేస్తూ ఉంటారు. అయితే ఈ చచ్చు ఐడియా కూడా వర్కవుట్ కాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ గుంపుల్లో ఉండే వారంతా  పచ్చ కార్యకర్తలే. గతంలో ఇటువంటి కార్యకర్తలే పవన్ కల్యాణ్ కుటుంబంపైనా విషం చిమ్మారు. చంద్రబాబు నాయుడికి ఎప్పుడు కష్టం వచ్చినా మల్లిగాళ్లను పిలిపించి ఇటువంటి అసైన్ మెంట్లు ఇప్పిస్తారు చంద్రబాబు. మౌత్ టాక్తోనే  పాలక పక్షాన్ని  దెబ్బతీయాలన్న పిచ్చి ఆలోచనతో ఉన్నారు చంద్రబాబు. అసలింతకీ ఈ అయిడియా రావడానికి కారణాలేంటి? చంద్రబాబు అంతగా ఓటమి భయంతో కుంగిపోడానికి కారణాలు ఉన్నాయి. 

జనం తమ వైపు లేరు. విజయం తమ వైపు లేదు. అధికారం తమకు దక్కేలా లేదు. తెలుగుదేశం పార్టీకి ఎన్టీయార్ నాటి పూర్వ వైభవం వచ్చేలా లేదు. చంద్రబాబు, లోకేష్ లు సభలు పెడితే జనం కనపడ్డం లేదు. అదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి మీరు సిద్ధమా అని సభలు పెడితే ఇసకేస్తే రాలని జనంతో నేల కనపడ్డం లేదు. 
ఈ రెండు దృశ్యాల మధ్య తేడా చూసి చంద్రబాబు నాయుడు ఎల్లో మీడియా అధిపతులకు కళ్లు బైర్లు కమ్మి కళ్లముందు ఏమీ కనపడ్డం లేదు. తమ ఓటమి ఖాయమని స్థానిక ఎన్నికల్లో కుప్పంలో కూడా తమ పార్టీ కుప్పకూలిన రోజునే చంద్రబాబుకు అర్ధం అయిపోయింది. పార్టీయే కాదు తన సొంత నియోజక వర్గంలో తనకు కూడా ఓటమి తప్పదన్న భయం చంద్రబాబు గుండెల్లో పర్మనెంట్ గా సెటిల్ అయిపోయింది.

గుణపాఠం తప్పదా?
పేరుకి ఫార్టీ ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీ. కాలం కలిసొచ్చినపుడు..తమ పెంపుడు మీడియా  తమకి బాకా ఊదిన రోజుల్లో ఢిల్లీలో చక్రాలు తిప్పామని చెప్పించుకున్న చంద్రబాబు ఇపుడు ఏపీలో కాదు తన సొంత నియోజక వర్గంలోనే సైకిల్ చక్రాన్ని కూడా తిప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని పవన్ కల్యాణ్ తో పొత్తులు పెట్టుకున్నారు. అది సరిపోదని బిజెపి నేతలు ఛీ ఛీ అంటోన్న కాళ్లబేరాలాడి పొత్తు పెట్టుకున్నారు. తాము ముగ్గురం కలిసి బరిలో దిగినా ఒరిగేదేమీ లేదని తేలడంతో  కాంగ్రెస్ తో రహస్య పొత్తు పెట్టుకున్నారు.

వేణ్నీళ్లకు చన్నీళ్ల సాయం ఉండాలని  2014 నుంచి ఏపీలో  ఏ ఎన్నికలోనూ బోణీ కొట్టని కమ్యూనిస్టులతో సీక్రెట్ డీల్స్ పెట్టుకున్నారు. అయినా వర్కవుట్ అయ్యే లా  లేదని.. స్వయం ప్రకటిత మేథావులను తీసుకొచ్చి వారికి ఓ దుకాణం తెరిచి  ఆ దుకాణం తరపున  పాలకపక్షంపై విషం చిమ్మించే కార్యక్రమం చేస్తున్నారు. ఆ దుకాణం తరపునే  వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు వాలంటీర్లు ఇంటికి వెళ్లి పింఛన్లు ఇవ్వడానికి వీల్లేకుండా అడ్డంకులు సృష్టించారు. మండు టెండల్లో  అవ్వా తాతలను మంచాలపై తీసుకెళ్లి పింఛన్లు ఇప్పించుకుంటోన్న దృశ్యాలు  చూసి  యావత్ ఆంధ్ర ప్రదేశ్ ... చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లతో పాటు  వలంటీర్లపై ఫిర్యాదు చేయించి పింఛనుదార్ల పొట్ట కొట్టించిన నిమ్మగడ్డ రమేష్ పై నిప్పులు చెరుగుతున్నారు. శాపనార్ధాలు పెడుతున్నారు. ఈ ఎన్నికల్లోనే విపక్ష కూటమికి గూబ గుయ్యిమనేలా గుణపాఠం చెబుతామని అంటున్నారు.

దిక్కుమాలిన ఐడియాలు
రక రకాల సర్వేలు ఏపీలో YSRCP అఖండ విజయం ఖాయమని తేల్చాయి. చంద్రబాబు నాయుడు సొంతంగా చేయించుకున్న సర్వేల్లోనూ అదే తేలింది. రెక్కలు ముక్కలు చేసుకుని.. సిగ్గు లజ్జ వదిలేసి బిజెపి నేతల కాళ్లు పట్టుకుని పొత్తులు పెట్టుకున్నా  తాము  అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని తేలడంతో చంద్రబాబుకు చలి జ్వరం వచ్చేసినట్లయ్యింది. ఏం చేయాలో పాలుపలోలేదు. ఎల్లో మీడియా ఇచ్చిన చచ్చు సలహాతో వాలంటీర్ల పై ఆంక్షలు విధిస్తే ఇపుడు 66 లక్షల మంది పింఛను దార్లు తనపై పీకలదాకా కోపంతో ఉన్నారని తెలిసి చంద్రబాబుకు నవ రంధ్రాల్లోంచి భయం కారిపోతోంది. అయితే కొద్ది మంది మనసుల్లో అయినా విషం చిమ్మితే  ఆ మేరకు అయినా వైఎస్సార్‌సీపీ ఓట్లకు గండి కొట్టచ్చన్న చిల్లర ఐడియాతో చంద్రబాబు ఉన్నారు. అయితే ఇటువంటి దిక్కుమాలిన ఐడియాలు పేద ప్రజల తెలివితేటల ముందు ఎందుకూ పనికిరావంటున్నారు రాజకీయ పండితులు. 

అయితే ప్రస్తుతం ఏపీలో  మెజారిటీ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. అయిదేళ్లుగా  తమ ఖాతాల్లో నేరుగా జమ అయిన సంక్షేమ పథకాల నిధులు తమ ఇళ్లల్లో తెచ్చిన వెలుగులను తమ జీవితాల్లో తెచ్చిన మార్పులను వారు మర్చిపోలేదు. తమ జీవితాలు ఇలానే హాయిగా కొనసాగాలంటే  వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ ప్రభుత్వమే మరోసారి కొలువు తీరాలంటున్నారు.  మేమంతా సిద్ధం  బస్సుయాత్ర లో దారి పొడవునా లక్షలాదిగా తరలి వచ్చిన పేదలు  ఈ విషయాన్నే ప్రతిజ్ఞ చేసి మరీ చెబుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు వచ్చిన స్పందన చూసిన తర్వాత కూటమి నేతలకు ముచ్చెమటలు పట్టాయి. ఆ తర్వాత ఆయన బస్సుయాత్ర ఆరంభించగానే రాయలసీమ జిల్లాల్లో వడగాలులు వీస్తోన్న   భీకర వేడి వాతావరణంలోనూ  ఆరేళ్ల కుర్రాడి నుంచి ఎనభై ఏళ్ల వృద్ధుల వరకు అన్ని వయసులకు చెందిన అన్ని వర్గాల ప్రజలు మరోసారి జగన్ మోహన్ రెడ్డినే సిఎంని చేసుకోడానికి తామంతా సిద్ధం సిద్ధం అంటున్నారు. చంద్రబాబు నాయుడి తరపున పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠాలు తిరిగినట్లు..  వైఎస్సార్‌సీపీ  విజయంపై దుష్ప్రచారం చేసే ముఠాలు ఎక్కడైనా కనిపిస్తే జనం అప్రమత్తంగా ఉండాలంటున్నారు  పాలక పక్ష నేతలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement