టీడీపీ దొంగ ఓట్ల వేషాలు ఇప్పుడు బయట పడుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓట్ల సవరణ కార్యక్రమంలో భాగంగా నిశిత పరిశీలనకు తోడు, ఆధార్ సీడింగ్ చేస్తుండటంతో 2019లో టీడీపీ భారీగా చేర్పించిన దొంగ ఓట్ల బాగోతం బట్టబయలవుతోంది. ఈ విషయం ప్రజల్లోకి వెళితే పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని రాజగురివింద విలవిల్లాడిపోతున్నారు. ఈ తప్పులకు వక్రభాష్యాలు చెబుతూ విష ప్రచారానికి తెరలేపారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలోనే ఇది జరిగినట్లు ఈనాడులో దుష్ప్రచారం చేస్తున్నారు.
ఆ ఓట్లన్నీ ఒకే వీధి పేరుపై 2019లోనే నమోదయ్యాయనే విషయం నిజంగా మీకు తెలియదా రామోజీ? ఇప్పుడు ఆ నకిలీ ఓట్లను తొలగిస్తుంటే.. మీరు, మీ తోక పత్రిక విషపు రాతలతో రంకెలు వేయడం ఎవరి కోసం? మీ బాబు బాగోతం బట్టబయలైందని ఆక్రోశమా? ఈ బురద ప్రభుత్వంపై చల్లి టీడీపీని రక్షించాలనే తాపత్రయమా? ‘దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు’ దొంగ ఓట్లపై ఫిర్యాదు చేయడం ద్వారా టీడీపీ కూని రాగాలు తీస్తుంటే.. ఎల్లో మీడియా తందానా అంటూ తబలా వాయిస్తుండటం అందరికీ కనిపిస్తోంది.
సాక్షి, అమరావతి: గత ఎన్నికల్లో గెలవడం కోసం తెలుగుదేశం పార్టీ అనేక అడ్డదారులు తొక్కింది. ఏకంగా ప్రజల విలువైన వ్యక్తిగత సమాచారాన్ని హైదరాబాద్‌కు చెందిన ఐటీ గ్రిడ్ అనే ప్రైవేటు సంస్థ ద్వారా తస్కరించింది. రాష్ట్రంలోని ప్రజల ఆధార్ డేటాను ఈ–ప్రగతికి అనుసంధానం చేసి, అక్కడి నుంచి ఆ సమాచారాన్ని దొంగిలించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌కు చేరవేసింది. ఈ యాప్ ద్వారా సర్వేలు నిర్వహించి ఓటు వేయరనుకున్న వారిని గుర్తించి, ఫారం–7 ద్వారా వారి ఓట్లను తొలగించింది.
వారి స్థానంలో పెద్ద ఎత్తున దొంగ ఓటర్లను చేర్పించింది. ఇప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, దొంగ ఓట్లను తొలగిస్తుంటే.. అదే పెద్ద తప్పిదమైనట్లు ఈనాడు, దాని తోకపత్రిక అడ్డగోలు కథనాలతో ప్రజలను పక్కదారి పట్టించేలా కథనాలు వండివారుస్తున్నాయి. ఈ పత్రికలు అచ్చేసిన దొంగ ఓట్ల కథనాలు, ఆయా ఇంటి నంబర్లను 2019 ఓటర్ల జాబితా, 2023 ఓటర్ల జాబితాలో పరిశీలించి చూస్తే బాబు బాగోతం స్పష్టంగా తెలిసిపోతోంది. ఇదే చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో ఇలా 36 వేలకు పైగా పక్క రాష్ట్రాలకు చెందిన దొంగ ఓటర్లను చేర్పించి గట్టెక్కారు. మరి దీనిపై కూడా ఓ కథనాన్ని వండివార్చగలరా?
2019కి ముందు చంద్రబాబు హయాంలో విజయవాడలో అసలు ఇంటి నంబర్ లేకుండా కడియాల వారి వీధి పేరుతో నమోదైన 575 ఓట్లు , 2023 ఓటర్ల జాబితాలో అదే అడ్రస్‌పై 459కు తగ్గిన ఓట్లు
రామోజీ.. అప్పుడు కనిపించలేదా?
విజయవాడలో ఒకే ఇంటి నంబర్‌పై 506 ఓట్లు అంటూ జూన్ 15న ఈనాడు ఓ కథనం అచ్చేసింది. ఇది దురుద్దేశంతో కూడిందన్న విషయం 2019, 2023 ఓటర్ల జాబితాను పరిశీలిస్తే స్పష్టంగా తెలుస్తోంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్–80 సూర్యారావుపేటలో అసలు ఇంటి నంబరు లేకుండా కేవలం కడియాల వారి వీధి పేరుతో పెద్ద ఎత్తున ఓట్లు నమోదై ఉన్నాయి. ఈనాడు రాసిన కథనంలో చెబుతున్నట్లుగా ఈ ఓట్లను పరిశీలిస్తే అవి 2019కి ముందు నమోదు చేసినవే.
కొత్తగా ఒక్క ఓటు కూడా నమోదు కాకపోగా ఈ సంఖ్య ఇంకా తగ్గింది. కనీసం ఈ పూర్వాపరాలను పరిశీలించకుండా.. కేవలం ప్రభుత్వంపై బురద చల్లాలనే ఆలోచనలతో ఈనాడు దుష్ప్రచారం చేసిందని స్పష్టమవుతోంది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పులను ఇప్పుడు ఎన్నికల సంఘం సరిదిద్దుతుంటే వాటికి వక్రీకరణలు, అబద్ధాలు జోడించి, ఎల్లో మీడియాతో ప్రచారం చేయించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా టీడీపీ వ్యూహం పన్నింది.
ఈ కథనంపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి స్పందిస్తూ 2018 నుంచి ఈ ఓట్లు ఒకే వీధి పేరుతో ఉన్నాయని స్పష్టం చేయడమే కాకుండా గణాంకాలతో సహా వివరించారు. 2018లో 674 మంది ఓటర్లు ఉంటే 2019లో 675 మంది ఇప్పుడు 516 మంది ఓటర్లు ఉన్నారని చెప్పారు. ఇప్పుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నకిలీ ఓట్లు ఉంటే తొలగిస్తామని స్పష్టం చేశారు. అలాగే గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఒకే ఇంటి నంబర్‌పై 800 ఓట్లు ఉన్నాయంటూ ఈనాడు తోకపత్రిక మరో కథనాన్ని వండి వార్చింది.
చంద్రబాబు హయాంలోనే చేర్పించారన్న విషయాన్ని దాచిపెట్టిం ఈ ప్రభుత్వంపై, వైఎస్సార్‌సీపీపై నింద వేసింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పోలింగ్ స్టేషన్ 38కి సంబంధించి 2019, 2023 ఓటర్ల జాబితా పరిశీలిస్తే ఈ ఓట్లన్నీ 2019 జనవరి నుంచే కొనసాగుతున్న విషయం స్పష్టం అవుతోంది. అంటే ఈ ఓట్లన్నీ చంద్రబాబు నాయుడే చేర్పించారని ఇట్టే స్పష్టమవుతోంది.
ఇక ఆటలు సాగవని అక్కసు
ఒక వ్యక్తి రెండు మూడు చోట్ల ఓట్లు కలిగి ఉంటే వాటిని గుర్తించి, వారు కోరుకున్న ఒక్క చోట మాత్రమే ఉంచేలా కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహరిస్తోంది. ఇలా రాష్ట్రంలో 15 లక్షల మంది ఓటర్లు ఉంటే, పరిశీలించి 10.20 లక్షలు తొలగించినట్లు ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. కొంతకాలంగా ఓటర్ల జాబితాలో జరిగిన తప్పులను ప్రస్తుతం జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల సవరణ 2024లో సరిదిద్దనున్నట్లు హామీ ఇచ్చారు.
జూలై 21 నుంచి ఆగస్టు 21 వరకు బీఎల్‌వోలు ఇంటింటి సర్వే చేసి ఓటర్ల సవరణ చేస్తారని, ఈ సమయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బీఎల్‌వోలతో కలిసి సర్వేలో పాల్గొనాలని కోరారు. దీంతో ఇంతకాలం దొంగ ఓట్లతో గెలుస్తూ వచ్చిన తెలుగుదేశం పార్టీ.. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని దుష్ప్రచారం సాగిస్తోంది. ఇందులో భాగంగానే ‘దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లు’ దొంగ ఓట్లంటూ ఫిర్యాదులు కూడా చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment