రోడ్డు షోలో చంద్రబాబు
(సాక్షి– నెల్లూరు): అసలే 30 అడుగుల ఇరుకు రోడ్లు. దాన్లో కూడా అటూ ఇటూ ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేశారు. ఆ ఇరుకు రోడ్లో ఐదారు వేల మంది వచ్చినా... పై నుంచి డ్రోన్లతో షూటింగ్ చేస్తే చాలా భారీగా జనం తరలివచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఫొటోలను పత్రికల్లో, టీవీల్లో విస్తృతంగా ప్రచారం చేయటం ద్వారా ప్రతి సభకూ, రోడ్ షోకూ జనం పోటెత్తుతున్నారని చెప్పటం చంద్రబాబు నాయుడి ఉద్దేశం. కొద్దిరోజులుగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చంద్రబాబు రోడ్ షోలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న ఈ ఫార్ములా... బుధవారం మాత్రం నెల్లూరు జిల్లా కందుకూరులో ఎనిమిది నిండు ప్రాణాలను బలి తీసుకుంది.
ప్రత్యక్ష సాక్షుల కథనం మేరకు... ‘ఇదేం ఖర్మ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం స్థానిక ఎన్‌టీఆర్ సర్కిల్‌లో చంద్రబాబు రోడ్ షో నిర్వహించారు. ఈ సర్కిల్ రోడ్లు కాస్త ఇరుగ్గా ఉండగా... సర్కిల్ నుంచి గుండంకట్ట వెళ్లే రోడ్డు అన్నిటికన్నా ఇరుగ్గా ఉంది. దాంట్లోనే అటూ ఇటూ ఫ్లెక్సీలు పెట్టడంతో చిన్న సందులా తయారయింది. అక్కడే మురికి కాలువ పక్కన వరసగా కొందరు బైక్‌లు పార్క్ చేయగా... ఓ తోపుడు బండి, టీవీ ప్రసారాల లైవ్ వెహికల్ కూడా ఉండటంతో... కొందరు లైవ్ వెహికల్ ఎక్కారు. మరికొందరు బైకులు పట్టుకుని నిల్చున్నారు.
ఇంతలోనే చంద్రబాబు కాన్వాయ్ భారీ వాహన ర్యాలీతో వచ్చింది. ఒక్కసారిగా వాహనాలు రావడంతో ఎన్‌టీఆర్ సర్కిల్ మధ్య తన ప్రసంగ వాహనాన్ని నిలపాల్సిన చంద్రబాబునాయుడు కొంచెం ముందుకు బాగా ఇరుగ్గా ఉండే ప్రదేశంలో నిలిపారు. దాంతో ఈ నాలుగు రోడ్ల కూడలి కాస్త మరింత ఇరుగ్గా మారిపోయింది. చంద్రబాబు తన ప్రసంగం ప్రారంభించబోతూ.... గుండంకట్ట రోడ్డులో ఉన్న లైవ్ వెహికల్ ఎక్కిన వారిని దిగిపోవాలని అభ్యర్థించారు. ‘‘తమ్ముళ్లూ... మీరంతా దిగాలి’’ ‘ఏయ్ తమ్ముళ్లూ అందరూ దిగండి’ అంటూ పదే పదే కేకలు వేశారు. దీంతో ఆ ప్రాంతంలో కాస్త అలజడి నెలకొంది.
అదే సమయంలో చంద్రబాబు ప్రసంగ వాహనానికి వెనుక వైపు ఉన్న వారు ఒక్కసారిగా ముందుకు చొచ్చుకురావడంతో మరింత గందరగోళం నెలకొంది. అంతా ముందుకు రావటంతో గుండంకట్ట రోడ్డులో తోపులాట మొదలై తోపుడు బండి తిరగబడిపోయింది. బైకులపై పడింది. బైకులన్నీ వరసగా కిందికి పడిపోవటంతో... వాటిని ఆనుకుని ఉన్న కొందరు జనం కూడా అదుపు తప్పి బైకుల కింద, పక్కనున్న కాలువలోను పడిపోయారు. ఈ హఠాత్పరిమాణంతో వారు భయపడి... గట్టిగా కేకలు వేస్తూ లేవటానికి ప్రయత్నించారు.
అయితే ఆ అరుపులతో మరింత మంది కంగారుపడ్డారు. భయభ్రాంతులై ఏదో జరిగిపోతోందనుకుని పరుగులు పెట్టారు. అదే రోడ్లో నుంచి మరికొంత ముందుకు వెళ్లటానికి ప్రయత్నించారు. ఈ సంఘటనను దగ్గర్నుంచి చూస్తున్న పలువురు తెలుగుదేశం కార్యకర్తలు అరుస్తూ వారిని నిలువరించబోయారు. కానీ ఆ అరుపులతో వారంతా మరింత కంగారుపడి కింద పడ్డ వారిని పట్టించుకోకుండా తొక్కుకుంటూ వెళ్లిపోవటానికి ప్రయత్నించారు.
ఈ క్రమంలో మరింత మంది కిందపడ్డారు. అలా పడిన వారిలో చాలామంది ఊపిరాడక లేవలేకపోయారు. ఫలితంగా ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా... మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ మరణించారు. మరో ఎనిమిది మందికి సైతం తీవ్రంగా గాయాలయ్యాయి. వారంతా ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ సర్కిల్లో ఇదే తొలిసారి...
కందుకూరు ఎన్‌టీఆర్ సర్కిల్‌కు నాలుగువైపులా దక్షణం వైపు పామూరు రోడ్ , ఉత్తరం వైపు బైపాస్‌రోడ్, తూర్పు గుండంకట్ట రోడ్, పడమర ఇప్పగుంట రోడ్ ఉంటాయి. ఆ నాలుగు రోడ్లూ జంక్షన్ నుంచి కొంత ఇరుగ్గానే ఉంటాయి. కాకపోతే పామూరు రోడ్‌లో జంక్షన్ నుంచి ఓ 200 మీటర్లు వెళితే రోడ్డు వందడుగులతో విశాలంగా ఉంటుంది. గతంలో వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ఈ వందడుగుల రోడ్లోనే సభ ఏర్పాటు చేశారు. రోడ్డు విశాలంగా ఉండటంతో జనం భారీగా తరలివచ్చినా సాఫీగా సాగిపోయింది.
ఇక చంద్రబాబు నాయుడు కూడా గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇక్కడకు వచ్చినపుడు స్థానిక హైస్కూల్ గ్రౌండ్‌లో సభ నిర్వహించారు. దీంతో పాటు గతంలో దాదాపు 5 సార్లు కందుకూరుకు వచ్చిన చంద్రబాబు... ప్రతిసారీ స్థానిక అంకమ్మ దేవాలయం ప్రాంగణంలో సభను నిర్వహించారు. అది విశాలమైన ప్రాంగణం కావటంతో ఎంత మంది జనం వచ్చినా ఇబ్బంది ఉండేది కాదు. కానీ ఈ సారి ఇరుకు రోడ్లను ఎంచుకోవటంతో ఊహించని దారుణం జరిగిపోయిందని స్థానికులు వాపోతున్నారు.
ప్రసంగం ప్రారంభించకముందే....
చంద్రబాబు సభలో ప్రసంగం ప్రారంభిస్తున్నపుడే ఈ ఘోరం చోటు చేసుకోవటంతో ఆయన ప్రసంగం నిలిపేశారు. జరిగిన ఘటన తెలసుకుని, బాధితులను ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్ళాక, ఆయన కూడా ఆసుపత్రికి వెళ్లారు. పరామర్శించిన అనంతరం మళ్లీ ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చి... ఈ సంఘటన దురదృష్టకరమంటూనే... అందరూ ఆవేశంతో ఉన్నారని వ్యాఖ్యానించటం గమనార్హం.విషాద సంఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు పార్టీ తరఫున రూ.10 లక్షల వంతున ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు .
చంద్రబాబు రోడ్డు షోలో విషాద ఘటన జరిగిన ఇరుకు రోడ్డు, ఇరువైపులా ఉన్న మురుగు కాల్వలు
చంద్రబాబు పర్యటన ఇలా..
చంద్రబాబు తొలుత సింగరాయకొండ పై్ల ఓవర్ నుంచి నేరుగా ఓగూరు మీదగా కందుకూరు వాసవీ నగర్ గుడికి వచ్చి పూజలు చేశారు. అనంతరం కోటారెడ్డి సెంటర్‌కు చేరుకుని డీవీ కొండయ్య చౌదరి విగ్రహనికి పూలమాల వేశారు. అక్కడ నుంచి పోస్టాపీస్ సెంటర్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్‌కు వచ్చారు. షెడ్యూల్ కంటే గంట సేపు ఆలస్యంగా సభ మొదలుపెట్టబోయారు. కాగా శింగరాయకొండ జాతీయ రహదారిపై మల్లినేని లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా చంద్రబాబు కాన్వాయ్‌లో అపశృతి చోటు చేసుకుంది. రహదారిపై వెళ్తున్న స్కూటరిస్ట్‌ను చంద్రబాబు వాహనం డీకోనడంతో స్కూటరిస్ట్ కిందపడిపోయాడు. స్కూటర్ దెబ్బతింది.
కూలి వస్తుందని ఆశపడి మీటింగ్‌కు...
మీటింగ్‌కు వెళితే కూలి వస్తుందని ఆశపడిన ఆ మహిళ... చంద్రబాబు కందుకూరు పర్యటనకు వెళ్లి ప్రాణాలు కోల్పోయింది. ఉలవపాడు వరిగచేను సంఘానికి చెందిన యాటగిరి విజయ (54) కూలి చేసుకుని జీవిస్తోంది. ఆమె భర్త శీనయ్యది నిజామాబాద్‌లో బేల్దారి పని. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఒక అబ్బాయి. పెద్దకుమార్తె తండ్రి వద్దే ప్రై వేటు కంపెనీలో పనిచేస్తుండగా, రెండో కుమార్తె శిరీష ఉలవపాడులోని ఓ షాపులో పనిచేస్తోంది.
కుమారుడు శ్రీకర్ టెన్త్ క్లాస్. టీడీపీ నాయకులు చంద్రబాబు కార్యక్రమం కోసం ఈ సంఘం నుంచి ఆటోలు పెట్టి మహిళలకు కూలి ఏర్పాటు చేశారు. కూలి డబ్బులు వస్తాయి కదా అని మీటింగ్‌కు వెళ్లిన విజయ... అక్కడ కాల్వలో పడి ఊపిరాడక మృతి చెందింది. వీరు రెండేళ్ల క్రితం వరకు హైదరాబాద్ లో బేల్దారి పని చేసుకునేవారు. కరోనా తరువాత ఇక్కడకు వచ్చి ఆధార్, రేషన్ కార్డులు మార్పించుకుని ఇక్కడే ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment