బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ | Chandrababu Kandukur Road Show Incident | Sakshi
Sakshi News home page

బాబుదే పాపం.. ప్రాణాలు తీసిన ప్రచార యావ

Published Thu, Dec 29 2022 7:47 AM | Last Updated on Thu, Dec 29 2022 8:24 AM

Chandrababu Kandukur Road Show Incident - Sakshi

రోడ్డుకు ఇరువైపులా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో ఇరుకుగా మారిన రోడ్డు

కందుకూరు(నెల్లూరు జిల్లా): ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుకి ప్రచార యావ చాలా ఎక్కువ. అనేక సందర్భాల్లో ఇది రుజువైంది. నాకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని చూపించుకునే తాపత్రయంలో ఎవరు ఎన్ని ఇబ్బందులు పడినా ఆయన పట్టించుకోడు. ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తాడు. ఈ వ్యవహారశైలే మరోసారి ప్రజల ప్రాణాలపైకి తెచ్చింది. ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి యాత్ర సందర్భంగా కందుకూరులో బుధవారం టీడీపీ నాయకులు నిర్వహించిన బహిరంగసభ కొందరి కుటుంబాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది.

కందుకూరు రూరల్‌: కందుకూరు మండలం కొండముడుసుపాళేనికి చెందిన కలవకూరి యానాది తెలుగుదేశం పార్టీకి వీరాభిమాని. ఎప్పుడు ఎక్కడ టీడీపీ సమావేశాలు జరిగినా అక్కడ వాలిపోతుంటాడు. టీడీపీ స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే కొనసాగుతున్నాడు. కందుకూరులో చంద్రబాబునాయుడిని చూసేందుకు సమావేశం వద్దకు వచ్చాడు. అక్కడ ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాటలో మృతిచెందాడు. ఈయనకు భార్య కాంతమ్మ, ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉన్నారు. పిల్లలకు వివాహాలయ్యాయి. ఎస్సీ కాలనీలో కూడా టీడీపీ నాయకుడిగా నాయకత్వం వహిస్తుంటాడు.

కందుకూరు మండలంలో ఓగూరు గ్రామానికి చెందిన గడ్డం మధుబాబు టీడీపీకి వీరాభిమాని. ఆ గ్రామ నాయకుడు చల్లా శ్రీనివాసరావు వద్దే పని చేస్తుంటాడు. శివమాల ధరించిన మధుబాబు టీడీపీ మీటింగ్‌కు వచ్చి తొక్కిసలాటలో మృత్యువాత పడ్డాడు. మధుబాబు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. భార్య మాధవి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

నేడు పోస్టుమార్టం 
తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను ప్రస్తుతం ఏరియా వైద్యశాలలోనే ఉంచారు. గురువారం పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే మృతుల కుటుంబ సభ్యులు, క్షతగాత్రుల కుటుంబసభ్యులు పెద్ద ఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఏరియా హాస్పిటల్‌ ప్రాంగణం మార్మోగిపోయింది. చంద్రబాబు సభకు వచ్చి ప్రాణాలు కోల్పోవడం మా కర్మ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

పాపం వీళ్లు 
కందుకూరు అర్బన్‌: కందుకూరు పట్టణంలోని నాంచారమ్మ కాలనీలో నివాసం ఉండే ఇదిమూడి రాజేశ్వరి అక్కడే టిఫిన్‌ కొట్టు నడుపుతూ జీవనం సాగిస్తోంది. భర్త ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తుంటాడు. వారికి పిల్లలు లేరు. రాజేశ్వరి తమ్ముడు చిలకపాటి మధు టీడీపీ బీసీ సెల్‌ నాయకుడిగా ఉన్నాడు. చంద్రబాబు మీటింగ్‌కు జన సమీకరణలో భాగంగా రాజేశ్వరి మీటింగ్‌కి వచ్చింది. గుండంకట్ట వైపున ఉండడంతో ఒక్కసారిగా తోపులాటలో కింద పడిపోయింది. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమె వైద్యశాలకు తీసుకెళ్లగానే మృతిచెందింది. ఆమెను కొండపి మండలం పెట్లూరు గ్రామానికి చెంది వ్యక్తికి ఇచ్చి వివాహం చేయగా బతుకుదెరువు నిమిత్తం కందుకూరు వచ్చి నాంచారమ్మ కాలనీలో నివాసం ఉంటోంది. రాజేశ్వరి మృతిచెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

కందుకూరు పట్టణంలోని గుర్రంవారిపాళేనికి చెందిన కాకుమాని రాజా ఆర్టీసీ డిపో వద్ద కూల్‌డ్రింక్‌ షాపు నిర్వహిస్తుంటాడు. టీడీపీపై ఉన్న అభిమానంతో చంద్రబాబును చూసేందుకు మీటింగ్‌ వద్దకు వచ్చాడు. గుండంకట్ట వద్ద నిలబడి ఉన్నాడు. అక్కడ రోడ్డు ఇరుకుగా ఉండడంతో వాహనాలు నిలిపి ఉంచారు. ఈక్రమంలో తొక్కిసలాట జరిగి మృతిచెందాడు. ఈయనకు భార్య, కళ్యాణి ఇద్దరు పిల్లలున్నారు. కుమారుడు ఇంజినీరింగ్, కుమార్తె తొమ్మిదో తరగతి చదువుతున్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో పిల్లలు చదువులు ఎలా? అంటూ భార్య, కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి.

కందుకూరు మండలం విక్కిరాలపేటకు చెందిన ఉన్నం ప్రభాకర్, గుడ్లూరు మండలం మోచర్లకు చెందిన గోచిపాతల రమేష్, తెట్టుకు చెందిన ఎస్‌కే మన్సూర్, గుండ్లపాళేనికి చెందిన మద్దులూరి రాగమ్మ, దప్పళంపాడు గ్రామానికి చెందిన చెరుకూరి మాల్యాద్రి, కందుకూరు మండలం శ్రీరంగరాజపురానికి చెందిన వంకదారి పిచ్చయ్య, వీవీపాళెం మండలం అమ్మపాలేనికి చెందిన డి.మస్తాన్, పోలినేని చెరువు గ్రామానికి చెందిన శనివరపు మణికంఠ అనే వారు ప్రాణాలతో బయటపడ్డారు. క్షతగాత్రుల్లో ఉన్నం ప్రభాకర్, గోచిపాతల రమేష్‌, ఎస్‌కే  మన్సూర్, రాగమ్మలు మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్‌ హాస్పిటల్‌కు వెళ్లారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశం గందరగోళంగా మారిపోయింది. జనం ఎటువారు అటు పరుగులు పెట్టే హడావుడిలో చెప్పులు జారిపోయి, వస్తువులు పోగొట్టుకుని అవస్థలు పడ్డారు.

పోలీసులు వెంటనే స్పందించి..
ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు పోలీసులు, స్థానికులు, తోటి కార్యకర్తలు తక్షణం స్పందించడంతో ప్రమాద బాధితుల సంఖ్య పెరగకుండా ఆపగలిగారు. ఆస్పత్రిలో సైతం వైద్య సిబ్బంది సకాలంలో వైద్యసేవలు అందించడంతో మృతుల సంఖ్య తగ్గింది. రాత్రి 7.30 గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్‌ రావడంతో ఇరుకుగా ఉండే ఎన్టీఆర్‌ సర్కిల్‌ ఒక్కసారిగా కిక్కిరిసిపోయింది.

ప్రసంగం మొదలు పెట్టేందుకు బాబు సిద్ధమైన సమయంలోనే గుండంకట్ట రోడ్డులో తొక్కిసలాట జరిగింది. అప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఎస్సై ఉన్నారు. నివారించడం ఆయన వల్ల కాలేదు. అప్పటికే పలువురు కింద పడిపోయారు. ఇది గమనించిన కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని కింద పడిన పలువురిని పక్కకి లాగిపడేశారు.
చదవండి: ‘షో’క సంద్రం.. చంద్రబాబు రోడ్‌ షోలో 8 మంది దుర్మరణం

పోలీసులతోపాటు పక్కను ఉన్నవారు స్పందించి కిందపడిపోయి ఉన్న 16 మందిని చేతులపై మోసుకుంటూ ఎన్టీఆర్‌ సర్కిల్‌లోనే ఉన్న ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తీసుకెళ్లారు. హాస్పిటల్లో ఉన్న వైద్య సిబ్బంది, డాక్టర్లు వెంటనే స్పందించి క్షతగాత్రులకు చికిత్స ప్రారంభించారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న వారిని గుండెలపై గట్టిగా ఒత్తుతూ కాపాడే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం జరుగుతుండగానే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement