కడప లోక్‌సభ స్థానంలో ప్రజల మద్దతు కరవు
కనీస స్థాయిలో రాని ప్రజా స్పందన
డబ్బులిచ్చి షర్మిల సభలకు జనాన్ని తరలిస్తున్న టీడీపీ నేతలు
వీరిలో ఎక్కువ మంది ఇతర రాష్ట్రాల వలస కూలీలే
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి, కడప వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరకలు అంటేలా దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజల మద్దతు కరవైంది. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె రోడ్‌షోల పేరిట నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు అండతో, టీడీపీ స్క్రిప్టుతో సీఎం జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల వైపు ప్రజలు కన్నెత్తి చూడటంలేదు. దీంతో ఆమె సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. దీంతో టీడీపీ పంపుతున్న అద్దె మనుషులే దిక్కయ్యారు. స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో డబ్బులిచ్చి మరీ మనుషులను తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఇలా తరలించిన వారిలో అధికశాతం బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు. షర్మిల శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేశారు. వేంపల్లె కేంద్రంగా తొలుత నిర్వహించిన సమావేశానికి చక్రాయపేట మండలం నుంచి టీడీపీ నాయకులు జనసమీకరణ చేపట్టారు. ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి వాహనాల్లో తరలించారు.
సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన టీడీపీ నేత భాస్కరరెడ్డి జనసమీకరణ బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్‌షోలకు వేంపల్లెలోని బిడాలమిట్ట, చింతరాంపల్లె ప్రాంతాల నుంచి స్థానిక కాపువీధికి చెందిన టీడీపీ నేత మునిరెడ్డి అద్దె మనుషులను తరలించారు. ముద్దనూరు, కడప ప్రాంతాలను నుంచి జనాన్ని తరలించారు.
పులివెందులలో సాయంత్రం జరిగిన సభకు కడప నుంచి జనాన్ని సమీకరించారు. చెన్నూరు, ఐటీఐ సర్కిల్, ఆజాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చారు. వీరికి కూడా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇచ్చారు. డబ్బులు తీసుకొని మధ్యలో జారుకోకుండా ముందుగా టోకెన్లు ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో టోకెన్ ఉన్న వారికి రూ.500 చొప్పున కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సన్నిహితుడు చెల్లించినట్లు సమాచారం.
సమావేశానికి రావాలని శివప్రకాష్ రెడ్డి బెదిరింపులు!
మరోవైపు షర్మిల సమావేశానికి హాజరు కావాలంటూ వైఎస్ వివేకా పెద్ద బాçవమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి స్థానికులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ టీడీపీ రెండు ఒక్కటేనని, స్థానిక నాయకత్వం తమ చేతుల్లోనే ఉంటుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం.
తొలి విడత ప్రచారంలోనూ..
తొలి విడత ప్రచారంలో షర్మిల బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఇలాగే తుఫాన్ వాహనాల ద్వారా కడప నుంచి జనాల్ని తరలించారు. 20 వాహనాలకు సరిపడా జనానికి కడప జయరాజ్ గార్డెన్‌లో బస ఏర్పాటు చేసి, నాలుగు రోజుల పాటు షర్మిల పర్యటనలకు తిప్పుకున్నారు. వీరంతా హందీలో మాట్లాడుతుండటంతో పలువురు వాకబు చేయగా, బిహార్ నుంచి వచ్చిన వలసకూలీలని, రోజు కూలీకి ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.
Comments
Please login to add a commentAdd a comment