వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ.. | Eight Year Old Boy Support To Blind Parents In Chittoor District | Sakshi
Sakshi News home page

వయసు చిన్నది.. బాధ్యత పెద్దది: ఎనిమిదేళ్లకే ఆటో నడుపుతూ..

Sep 4 2021 7:16 AM | Updated on Sep 4 2021 7:45 AM

Eight Year Old Boy Support To Blind Parents In Chittoor District - Sakshi

ఆటో నడుపుతున్న గోపాలకృష్ణారెడ్డి, తోటి చిన్నారులతో కలసి చదువుకుంటూ..

ఎనిమిదేళ్లకే ప్రాణాలకు తెగించి ఆటో నడుపుతూ.. మరోవైపు చదువుకుంటూ.. అమ్మనాన్నలతో పాటు ఇద్దరు తమ్ముళ్ల పోషణకు తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తీరు స్థానికులను కదిలిస్తోంది.

ఆడుతూ పాడుతూ హాయిగా జీవించాల్సిన వయస్సులో ఆ బాలుడి భుజాలపై పెద్ద బాధ్యత.. అంధులైన తల్లిదండ్రులు, ఇద్దరు తమ్ముళ్ల మంచిచెడ్డలు చూసుకోవాల్సిన పరిస్థితి.. ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తో కుటుంబాన్ని పోషించాల్సిన దీనస్థితి.. ఎనిమిదేళ్లకే ప్రాణాలకు తెగించి ఆటో నడుపుతూ.. మరోవైపు చదువుకుంటూ.. అమ్మనాన్నలతో పాటు ఇద్దరు తమ్ముళ్ల పోషణకు తన రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తీరు స్థానికులను కదిలిస్తోంది.

చంద్రగిరి (చిత్తూరు జిల్లా):  మండల పరిధిలోని గంగుడుపల్లి గ్రామానికి చెందిన బండి పాపిరెడ్డికి వెదురుకుప్పం మండలం మాంబేడు గ్రామానికి చెందిన రేవతితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి గోపాలకృష్ణారెడ్డి, హిమవంతురెడ్డి, గణపతిరెడ్డి ముగ్గురు సంతానం. పాపిరెడ్డి చిన్నతనంలోనే కంటిచూపు కోల్పోయాడు. రేవతి పుట్టుకతోనే అంధురాలు. ప్రభుత్వం మంజూరు చేసిన పింఛన్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు.

కుటుంబ పోషణ కోసం..
తల్లిదండ్రులిద్దరికీ చూపులేకపోవడంతో కుటుంబ పోషణ భారమైంది. ఎనిమిదేళ్లకే గోపాలకృష్ణారెడ్డి కుటుంబ భారాన్ని మోయాల్సి వచ్చింది. తల్లిదండ్రులతో పాటు తమ్ముళ్లకు పట్టెడన్నం పెట్టేందుకు ఆటో నడపడం నేర్చుకున్నాడు. గ్రామాల్లో తిరుగుతూ ఉప్పు, పప్పు దినుసులు, ఇతర నిత్యావసరాలు విక్రయిస్తున్నాడు. స్కూల్‌ ముగిసిన తర్వాత ఇంటికొచ్చి తన తండ్రి పాపిరెడ్డిని ఆటోలో ఎక్కించుకుని గ్రామాల్లో తిరుగుతూ వంట సామగ్రి విక్రయిస్తున్నాడు.

తల్లిదండ్రులు, తమ్ముళ్లతో కలసి గోపాలకృష్ణారెడ్డి 

మమ్మల్ని పోషించేది మా బిడ్డే
మేమిద్దరం అంధులమే. మా పెద్ద కొడుకు గోపాలకృష్ణారెడ్డి మొదట సైకిల్‌ తొక్కడం నేర్చుకున్నాడు. అప్పులు చేసి బ్యాటరీ ఆటో తీసుకున్నాం. ఇంటి వద్దే వాడికి ఆటో ఎలా నడపాలో చెప్పేవాడిని. నిదానంగా ఆటో నడపడం వాడే నేర్చుకున్నాడు. ఇప్పుడు స్కూల్‌ అయిపోగానే ఉప్పు, బియ్యం, పప్పు దినుసులు వగైరా ఆటోలో తీసుకెళ్లి విక్రయిస్తుంటాడు. ఇంటి వద్ద పండించిన కూరగాయలు, ఆకుకూరలు సైతం తిరుపతికి తీసుకెళ్లి విక్రయించి, ఇంటికి వస్తుంటాడు. ఆడుకోవాల్సిన పసి వయస్సులో మమ్మల్ని పోషిస్తున్నాడు. 
– రేవతి, పాపిరెడ్డి, గోపాలకృష్ణారెడ్డి తల్లిదండ్రులు

అన్ని విధాల ఆదుకుంటాం 
పాపిరెడ్డి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటాం. ముగ్గురు పిల్లలకు మంచి చదువు చెప్పించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. ఈ మేరకు కుటుంబ సభ్యులతో మాట్లాడాను. పిల్లల చదువుతో పాటు తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత చూసుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే అంధ దంపతులకు పింఛను, అమ్మఒడి, రేషన్‌ సరుకులు, జగనన్న కాలనీలో ఇల్లును మంజూరు చేశారు. 
– నాగశైలజ, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పీడీ

ఇవీ చదవండి:
Andhra Pradesh : 27 నెలల్లో 68 మెగా పరిశ్రమలు  
మాయ‘లేడి’: చాటింగ్‌తో మొదలై.. నగ్నంగా వీడియో కాల్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement