మండలి ఎన్నికలకు వేళాయె | Elections for 14 MLC seats in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మండలి ఎన్నికలకు వేళాయె

Published Wed, Nov 10 2021 2:59 AM | Last Updated on Wed, Nov 10 2021 9:34 AM

Elections for 14 MLC seats in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే కోటా కింద మూడు ఎమ్మెల్సీ స్థానాలకు, స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే కోటా కింద ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ అయింది. నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 16న నోటిఫికేషన్‌ జారీచేసి అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. 

ఎమ్మెల్యే కోటా నుంచి మూడు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు రిటర్నింగ్‌ అధికారి, శాసనమండలి ఉప కార్యదర్శి పి.వి.సుబ్బారెడ్డి నోటిఫికేషన్‌ జారీచేశారు. శాసనమండలి సభ్యులు మొహమ్మద్‌ అహ్మద్‌ షరీఫ్, దేవసాని చిన్నగోవిందరెడ్డి, సోము వీర్రాజుల పదవీకాలం ఈ ఏడాది మే నెల 31వ తేదీతో ముగిసింది. ఈ ఖాళీలను భర్తీచేసేందుకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 16వ తేదీ మధ్యాహ్నం 3 వరకు అసెంబ్లీ భవనంలోని రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. ప్రభుత్వ సెలవు రోజులు మినహా మిగతా రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్లు రిటర్నింగ్‌ అధికారి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ నెల 17న నామినేషన్లను పరిశీలిస్తారు. ఈ నెల 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. అవసరమైతే ఈ నెల 29న అసెంబ్లీ భవనంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లు లెక్కిస్తారు.

8 జిల్లాల్లో ఎన్నికల కోడ్‌
రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో ఎన్నికైనవారి పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల 16వ తేదీన నోటిఫికేషన్‌ జారీచేస్తారు. అదేరోజు నుంచి నామినేషన్లు స్వీకరిస్తారు. గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి రెండేసి ఎమ్మెల్సీ స్థానాలకు, అనంతపురం, తూర్పుగోదావరి, విజయనగరం, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి డిసెంబర్‌ 10వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. ఈ స్థానిక సంస్థల నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రవర్తన నియమావళి (కోడ్‌) మంగళవారం నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు జరిగే స్థానిక సంస్థల నియోజకవర్గాల ఎమ్మెల్సీస్థానాల్లో  కోవిడ్‌–19 వ్యాప్తి నివారణకు తగిన చర్యలతో ఎన్నికలు నిర్వహించేందుకు సీనియర్‌ అధికారులను పంపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు 11 మంది పదవీకాలం ఆగస్టు 11తో పూర్తి
ప్రస్తుతం ఎన్నికలు నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు గతంలో ఎన్నికైనవారి పదవీకాలం ఈ ఏడాది ఆగస్టు 11వ తేదీతో ముగిసింది. కృష్ణా స్థానిక నియోజకవర్గాల నుంచి బుద్ధా వెంకటేశ్వరరావు, వై.రాజేంద్రప్రసాద్, గుంటూరు స్థానిక నియోజకవర్గాల నుంచి ఎ.సతీష్‌ప్రభాకర్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విశాఖపట్నం స్థానిక నియోజకవర్గాల నుంచి బి.నాగజగదీశ్వరరావు, పి.చలపతిరావుల పదవీకాలం పూర్తయింది. అనంతపురం స్థానిక నియోజకవర్గం నుంచి పయ్యావుల కేశవ్, తూర్పుగోదావరి స్థానిక నియోజకవర్గం నుంచి రెడ్డి సుబ్రహ్మణ్యం, విజయనగరం స్థానిక నియోజకవర్గం నుంచి డి.జగదీశ్వరరావు, చిత్తూరు స్థానిక నియోజకవర్గం    నుంచి జి.సరస్వతి, ప్రకాశం స్థానిక నియోజకవర్గం నుంచి మాగుంట శ్రీనివాసులురెడ్డిల పదవీకాలం ముగిసింది. (మాగుంట శ్రీనివాసులురెడ్డి స్థానం 14–3–2019 నుంచి, పయ్యావుల కేశవ్‌ స్థానం 04–06–2019 నుంచి, ఎ.సతీష్‌ ప్రభాకర్‌ స్థానం 10–7–2019 నుంచి ఖాళీ అయ్యాయి. స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగనందున అప్పట్లో ఈ స్థానాలకు ఎన్నికలు నిర్వహించలేదు.)

ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారుల నియామకం
రాష్ట్రంలో 13 జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  ఈ మేరకు మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జాయింట్‌ కలెక్టర్‌ (గ్రామ, వార్డు సచివాలయాలు–అభివృద్ధి)ను, మిగిలిన అన్ని జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు జాయింట్‌ కలెక్టర్‌ (రైతు భరోసా–రెవెన్యూ)లను ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులుగా నియమించారు.

కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రకటించరాదు, శంకుస్థాపనలు చేయరాదు
రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల నుంచి 11 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో ఆయా జిల్లాల్లో మంగళవారం నుంచే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె.విజయానంద్‌ తెలిపారు. ఈ జిల్లాల్లో ఎలక్ట్రానిక్‌ మీడియాతో పాటు ప్రింట్‌ మీడియాలో ఎటువంటి ప్రభుత్వ ప్రకటనలు జారీచేయరాదని ఆయన మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రకటనలు జారీచేసి ఉంటే అవి ప్రచురితం, ప్రసారం కాకుండా నిలుపుదల చేయడంతోపాటు ఉపసంహరించుకోవాలని సమాచారశాఖ కమిషనర్‌కు సూచించారు.

ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున ఆర్థికపరమైన గ్రాంటుతో కూడిన ఎటువంటి కొత్త ప్రాజెక్టులను, పథకాలను ప్రభుత్వం ప్రకటించరాదని తెలిపారు. ఎటువంటి హామీలు ఇవ్వకూడదని, శంకుస్థాపనలు చేయరాదని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జరిగే డిసెంబర్‌ 14వ తేదీ వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందని తెలిపారు. అప్పటివరకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లను ప్రభావితం చేసే ప్రకటనలను ప్రభుత్వం చేయరాదని ఆయన పేర్కొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement