గుంటూరు జిల్లా తెనాలిలోని ఓ లాడ్జి యజమాని కస్టమర్లు రాకపోవడంతో ఓ కొత్త పథకం వేశాడు. లాడ్జిలోని గదులన్నిటికీ ఒక్కో విద్యుత్ మీటర్ బిగించాడు. లాడ్జిని అద్దె ఇల్లుగా మార్చేశాడు. ఒక భవనానికి ఒక మీటరే ఉండాలి. కానీ ఇక్కడ గదికో మీటర్ ఉంది.
అపార్ట్‌మెంట్లలో ఫ్లాట్‌కు ఒక మీటర్ చొప్పున ఉంటుంది. అయితే కార్పొరేట్ కాలేజీల నిర్వాహకులు ఒక అపార్ట్‌మెంట్ తీసుకుని అందులో హాస్టల్ పెడుతున్నారు. అంటే ఒకే యాజమాన్యం కిందకు మొత్తం బిల్డింగ్ వచి్చంది. కానీ మీటర్లు మాత్రం ఫ్లాట్‌కు ఒకటి చొప్పున ఉన్నాయి.
ఏలూరుకు చెందిన ఒక వినియోగదారుడి మొబైల్ నంబర్‌కు నాలుగు విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. వీటిలో ఒక సరీ్వసును మాత్రమే ఆయన వాడుతున్నాడు. మిగతా మూడు ఎవరివో, తనకెందుకు బిల్లు వస్తుందో ఆయనకు తెలియడం లేదు. అంటే.. ఆయన సెల్ నంబర్‌తో అనుసంధానమైన ఇతర సరీ్వసులను వేరెవరో అక్రమంగా వినియోగిస్తుండాలి.
సాక్షి, అమరావతి: ఇవి ఇటీవల విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి వచ్చిన కొన్ని ఉదంతాలు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా అనేక విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. వీటిలో చాలావరకు అక్రమ సర్వీసులే. కాగా కొన్ని విద్యుత్ శాఖలోని కింది స్థాయి ఉద్యోగుల తప్పిదాల వల్ల వినియోగదారులకు మంజూరయ్యాయి. ఇలాంటివాటిపై ఇప్పుడు విద్యుత్ శాఖ ప్రధానంగా దృష్టి సారించింది. నిబంధనలకు విరుద్ధంగా అదనంగా వాడుతున్న మీటర్లను తొలగించడంతోపాటు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోనుంది. బాధ్యుల్లో విద్యుత్ శాఖ సిబ్బంది ఉంటే వారిపైనా శాఖాపరమైన చర్యలు చేపట్టనుంది.
‘డీపీఈ’ ఎప్పట్నుంచో చేస్తున్నదే..
ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థల్లో డిటెన్షన్ ఆఫ్ ఫిలపరేషన్ ఎనర్జీ (డీపీఈ) విభాగం అనేది ప్రత్యేకంగా ఉంటుంది. అక్రమ విద్యుత్ సర్వీసులను కనిపెట్టడం దీని విధి. ఇప్పుడు తాజాగా విద్యుత్ సర్వీసుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించే ప్రక్రియను ఇది జోడించింది. ఇలా చేయడం వల్ల ఒక ఆధార్‌పై ఎన్ని విద్యుత్ సర్వీసులు మంజూరయ్యాయనేది ఖచ్చితంగా తెలుస్తుంది. తద్వారా అక్రమ కనెక్షన్లను ఏరిపారేయవచ్చనేది విద్యుత్ శాఖ అధికారుల వ్యూహం. అంతేకాకుండా ఒక భవనానికి ఒకే యజమాని ఒకటి కంటే ఎక్కువ మీటర్లు వాడటాన్ని అడ్డుకోవచ్చు.
అవి అసత్య ప్రచారాలంటున్న అధికారులు
డిస్కమ్‌లు (విద్యుత్ పంపిణీ సంస్థలు) చేస్తున్న ఈ పనిపై కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఒక భవనంలో వేర్వేరు పోర్షన్లలో వేర్వేరు కుటుంబాలు ఉన్నప్పటికీ స్మార్ట్ మీటర్ ఏర్పాటు చేసి, అన్ని సర్వీసులకు కలిపి ఒకే బిల్లును జారీ చేస్తారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు. దీంతో స్లాబులు మారిపోయి విద్యుత్ బిల్లు పెరుగుతుందని అసత్య ప్రచారం చేస్తున్నారు. తద్వారా సంక్షేమ పథకాలకు దూరమవుతారని ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారు.
ఈ అసత్య ప్రచారాలను ఆంధ్రప్రదేశ్ దక్షిణ, మధ్య, తూర్పు ప్రాంత పంపిణీ సంస్థల సీఎండీలు హెచ్.హరనాథరావు, జె. పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు ఖండించారు. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఉత్తర్వులకు అనుగుణంగా ఒక వంట గది ఉన్న ఇంటికి ఒకే సర్వీసును మంజూరు చేస్తామని చెబుతున్నారు. వివిధ వర్గాలకు ప్రభుత్వం వర్తింపజేసే సంక్షేమ పథకాలకు తాము చేపట్టిన ప్రక్షాళన చర్యల వల్ల ఎటువంటి భంగం వాటిల్లదని ‘సాక్షి’కి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment