తణుకు అర్బన్: కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధికరణకు అనుకూలంగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు సంబరాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన శనివారం పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమక్షంలో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ‘థ్యాంక్యూ సీఎం సార్..’ అంటూ కాంట్రాక్టు ఉద్యోగులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కారుమూరి మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వర్గాలకు మేలు చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని, ఉద్యోగుల సమస్యలను కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తణుకు శాఖ అధ్యక్షుడు నరసరాజు మాట్లాడుతూ ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ గుండెల్లో కొలువుదీరారని అన్నారు. సీఎంకు రుణపడి ఉంటామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నాయకులు కేశిరెడ్డి వెంకట సత్యనారాయణ (పండు), ఆర్‌వీఎస్‌ఎన్ మూర్తి, వైవీఎస్‌బీ రాయుడు, కె.కరుణాకరరావు, పీవీ నాగరాజు, పట్టపు రామకృష్ణ, పంజా రవి, సుభాషిణి, కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి కిషోర్, కాంట్రాక్టు ఉద్యోగులు పాల్గొన్నారు. కాగా, తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో సీఎం వైఎస్ జగన్ చిత్రపటానికి వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత, ఉద్యోగులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment