సాక్షి, అమరావతి: వ్యవసాయ విద్యుత్‌కు నగదు బదిలీపై ఎలాంటి అనుమానాలకు తావులేదని, ఏ ఒక్క రైతుకూ అన్యాయం జరగదని రాష్ట్ర ఇంధనశాఖ స్పష్టం చేసింది. రైతుల ప్రయోజనాలను కాపాడటం, ఉచిత విద్యుత్ పథకాన్ని శాశ్వతం చేసేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. నగదు బదిలీపై వ్యక్తమవుతున్న సందేహాలను ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి శుక్రవారం సమగ్రంగా నివృత్తి చేశారు.
ఏడాదిగా రైతుకు ఎంతో మేలు..
► ప్రభుత్వం చేపట్టిన చర్యలతో పగటిపూట 9 గంటల నాణ్యమైన విద్యుత్తు రైతులకు అందుతోంది. 2019 వరకు కేవలం 58 శాతం ఫీడర్లే 9 గంటల విద్యుత్ ఇవ్వగలిగే స్థాయిలో ఉండేవి. వీటి బలోపేతం కోసం ప్రభుత్వం రూ.1,700 కోట్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఖరీఫ్ సీజన్‌లోనే 89 శాతం ఫీడర్లకు పగటిపూట 9 గంటల విద్యుత్ అందుతోంది. రబీ నాటికి అన్ని ఫీడర్లు సిద్ధమవుతాయి.
► ఉచిత విద్యుత్‌కు మరో 30 ఏళ్లు ఢోకా లేకుండా చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం 10 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టు చేపడుతోంది.
► 31.3.2019 నాటికి ఉన్న బకాయిల్లో రూ. 8655 కోట్లు, 2019–20లో ప్రభుత్వం చెల్లించింది. 2014–19 మధ్య కాలంలో ఉచిత విద్యుత్ పథకానికి సంబంధించిన బకాయిలు మొత్తం రూ.7,172 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.
► వ్యవసాయానికి విద్యుత్ సరఫరాలో నాణ్యత పెంచేందుకు 7,523 మంది జూనియర్ లైన్‌మెన్‌లను ప్రభుత్వం నియమించింది. సాగు అవసరాలకు విద్యుత్ సరఫరా చేసే 11 కేవీ ఫీడర్లలో అంతరాయాలు 2018–19తో పోలిస్తే 2019–20లో 38.4 శాతం మేర తగ్గాయి.
నగదు బదిలీ ఎవరికి వర్తిస్తుంది?
► ప్రస్తుతం ఉచిత విద్యుత్ పొందుతున్న రైతులందరికీ ఇది వర్తిస్తుంది. ఏ ఒక్క రైతు తన జేబు నుంచి పైసా కూడా చెల్లించాల్సిన పనిలేదు.
మీటర్లు ఎందుకు?
► మీటర్లు అమరిస్తే ఎంత విద్యుత్ వినియోగిస్తున్నారో తెలుస్తుంది. ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందో అర్థమవుతుంది. రైతులే డిస్కమ్‌లకు చెల్లిస్తారు కాబట్టి నిలదీసి మెరుగైన సేవలు పొందవచ్చు.
► డిస్కమ్‌లు ఇప్పటివరకు వార్షిక నష్టాలన్నీ రైతుల ఖాతాలో వేస్తున్నాయి. మీటర్లు అమరిస్తే వినియోగం, వృధా తెలుస్తుంది. వీటికయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరిస్తుంది. మరమ్మతుల ఖర్చు డిస్కమ్‌లే చూసుకుంటాయి.
పరిమితులుంటాయా?
► ఉచిత విద్యుత్తు కనెక్షన్లు తగ్గిస్తారని, పరిమితులు విధిస్తారని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా తొలగించరు.
► నగదు బదిలీ ఆలస్యమైతే విద్యుత్ సరఫరా నిలిపివేస్తారన్న ప్రచారంలోనూ నిజం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సరఫరా ఆపవద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చాం.
► అనధికార కనెక్షన్‌లన్నీ క్రమబద్ధీకరిస్తారు. అదనపు లోడ్ కనెక్షన్ల్ల క్రమబద్ధీకరణ కూడా చేస్తున్నాం. కౌలు రైతులు ఎలా సాగు చేస్తున్నారో అలాగే ఇకపై కూడా ఉచిత విద్యుత్ పొందుతూ సాగు చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment