AP: విద్యార్థులకు ‘పద సంపద’ | English language program English Telugu word proficiency To Students In AP | Sakshi
Sakshi News home page

AP: విద్యార్థులకు ‘పద సంపద’

Published Sun, Nov 7 2021 9:21 PM | Last Updated on Mon, Nov 8 2021 3:25 PM

English language program English Telugu word proficiency To Students In AP - Sakshi

సాక్షి, అమరావతి:ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల్లో పద సంపదను పెంపొందించడం ద్వారా వారిలో భాషా నైపుణ్యాలను సమగ్రంగా అలవర్చేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు ‘లిప్‌’ (లాంగ్వేజ్‌ ఇంప్రూవ్‌మెంటు ప్రోగ్రామ్‌)ను రూపొందించారు. ప్రస్తుతం ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలుకానుంది. ఈ జిల్లాల్లో కార్యక్రమం పురోగతి, ఫలితాలు, ఇతర అంశాలను సమీక్షించిన అనంతరం మిగిలిన జిల్లాల్లో అమలుచేయనున్నారు. కోవిడ్‌ కారణంగా పాఠశాలలు చాలా రోజులుగా మూతపడి ఉండడంతో బోధనాభ్యసన ప్రక్రియలు నిలిచిపోవడంతో అది విద్యార్థుల సామర్థ్యాలపై ప్రతికూల ప్రభావం పడింది. గతంలో నేర్చుకున్న అంశాల్లోనూ వెనుకబడ్డారు. ముఖ్యంగా భాషా సామర్థ్యాలు లోపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాకానుక కింద విద్యార్థులకు అవసరమైన పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్‌లు, నోట్‌బుక్‌లతో పాటు ఈ విద్యా సంవత్సరంలో ఆంగ్లం, తెలుగు డిక్షనరీలను కూడా అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీటి ద్వారా ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు చేరుకోవడానికి వీలుగా ‘లిప్‌’ కార్యక్రమాన్ని రూపొందించారు.

ప్రతిరోజూ కొత్త పదాల అభ్యాసం
ఈ లిప్‌ కార్యక్రమం ద్వారా తెలుగు, ఇంగ్లీçషు భాషల్లోని పదాలను విద్యార్థులు అర్థంచేసుకుని నేర్చుకునేందుకు 100 రోజులపాటు సమగ్ర ప్రణాళికతో అమలుచేయనున్నారు. ఇందులో భాగంగా..

  • 1, 2, తరగతుల విద్యార్థులు ప్రతిరోజూ రెండేసి కొత్త పదాలను, 3 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు మూడేసి పదాలను (ఆంగ్లం, తెలుగులలో), 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు ఐదేసి పదాలను (ఆంగ్లం, తెలుగు, హిందీ భాషలలో) రోజూ నేర్చుకునేలా చేస్తారు. 
  • ఇలా ప్రణాళిక ముగిసే నాటికి ఆంగ్ల, తెలుగు, హిందీ భాషలలో కలిపి 1, 2 తరగతుల విద్యార్థులు 400 పదాలను, 3 నుంచి 5వ తరగతి విద్యార్థులు 600 పదాలను, 6 నుంచి 10వ తరగతి విద్యార్థులు 1,500 పదాలను చదవడం, రాయడం, అర్థంచేసుకోవడం వంటి నైపుణ్యాలు విద్యార్థుల్లో పెంపొందేలా చేస్తారు.

లక్ష్యాలు ఇలా..

  •  సరైన ఉచ్ఛారణ..
  • భాషా దోషాలు లేకుండా రాయడం, చక్కని చేతిరాత నైపుణ్యం..
  • మూడు భాషలను నేర్చుకోవడం ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవడం..
  • ప్రాథమిక స్థాయి నుంచే భాషా సామర్థ్యాలను అలవర్చుకోవడం ద్వారా విద్యార్థులు భావవ్యక్తీకరణ నైపుణ్యం పెంపొందించుకోవడం..
  • తద్వారా అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకుని ప్రపంచ పౌరుడిగా ఎదగడం.

అమలు ఇలా..

  •  జగనన్న విద్యాకానుక కింద అందించిన ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ.. ప్రాథమిక విద్యార్థుల కోసం ఎస్‌సీఈఆర్టీ రూపొందించిన చిత్రాలతో కూడిన డిక్షనరీల నుంచి రోజూ ఈ పదాలను విద్యార్థులకు నేర్పించనున్నారు. 
  • పాఠ్య ప్రణాళికలో భాగంగానే ఆయా భాషోపాధ్యాయులు తమ తరగతి బోధన ప్రారంభించే ముందు ఈ కొత్త పదాలపై విద్యార్థులతో అభ్యాసం చేయిస్తారు. 
  •  ఈ పదాలను ఒక క్రమపద్ధతిలో నేర్పించడానికి అవసరమైన పదజాల పట్టికను భాషా నిపుణులతో రూపొందించి పంపిణీ చేయిస్తారు. 
  • ఇక విద్యార్థులు ఏ మేరకు అవగాహన చేసుకున్నారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ప్రతి 15 రోజులకోసారి 15 పదాలతో పరీక్షను నిర్వహిస్తారు. వీటి ఆధారంగా విద్యార్థులకు ఏ, బీ, సీ, డీ, ఈ గ్రేడ్లు ఇస్తారు. 
  • ఈ అభ్యాసాన్ని కొనసాగిస్తూ ప్రతి విద్యార్థి ‘ఏ’ గ్రేడ్‌లోకి వచ్చేలా చేస్తారు. 
  • అలాగే.. పాఠశాలల వారీగా ప్రతినెలా సమీక్షించి వాటికి స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. 
  • తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 11,20,862 విద్యార్థులు, టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు ఈ కార్యక్రమం అమలులో భాగస్వాములుగా ఉంటారని ఈ కార్యక్రమం రూపొందించి అమలుచేస్తున్న జోన్‌–2 రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ డి. మధుసూదనరావు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement