మిరుమిట్ల మాటున ముప్పు | Excessive electric lights at night are a danger to life | Sakshi
Sakshi News home page

మిరుమిట్ల మాటున ముప్పు

Published Wed, Feb 8 2023 4:30 AM | Last Updated on Wed, Feb 8 2023 7:32 AM

Excessive electric lights at night are a danger to life - Sakshi

సాక్షి, అమరావతి: ఏదైనా నగరంలో రాత్రివేళ ఎత్తయిన భవనంపై నుంచి చూస్తే ఎలా కనిపిస్తుంది?!... మిరుమిట్లు గొలిపే విద్యుత్‌ కాంతి వెలుగులతో ఆ నగరం అంతా మెరిసిపోతూ ఉంటుంది. నిశిరాత్రే పట్టపగలు మాదిరిగా గోచరిస్తుంది. అయితే ఇదంతా ఒక పార్శ్వం మాత్రమే. ఆ మిరుమిట్ల వెలుగుల చాటున పర్యావరణానికి, జీవజాలానికి పెనుముప్పు పొంచి ఉందనే విషయం చాలామందికి తెలియదు. కాంతి కాలుష్యం వర్తమాన ప్రపంచానికి పెను సవాల్‌గా మారుతోందని ప్రముఖ సైన్స్‌ జర్నల్‌ ‘సైన్స్‌ మ్యాగజైన్‌’ అధ్యయనం ఇప్పుడు కలకలం రేపుతోంది. 

దేశంలో ఏటా 20 శాతం పెరుగుతున్న స్కై గ్లో 
అభివృద్ధి పేరుతో నగరాల్లో రాత్రుళ్లు మితిమీరిన విద్యుత్‌ వెలుగులు సహజసిద్ధంగా ఉండాల్సిన చీకటిని పారదోలుతున్నాయి. ఈ విద్యుత్‌ కాంతుల నుంచి వెలువడే రేడియేషన్‌ను ‘స్కై గ్లో’ అని అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ‘స్కై గ్లో’ ఏటా 10 శాతం చొప్పున పెరుగుతుండటం గమనార్హం. న్కూయార్క్, వాషింగ్టన్, లండన్‌ వంటి నగరాలతోపాటు ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్‌ వంటి మహానగరాల్లోనూ ‘స్కై గ్లో’ ఏటా 20 శాతం చొప్పున పెరుగుతోంది.

ఈ ‘స్కై గ్లో’ ఆకాశంలోని చిన్న చిన్న నక్షత్రాలను సైతం మసకబారుస్తుండటంతో వాటిని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అంటున్నారు. 2011– 2022 మధ్య 10 శాతం చిన్న నక్షత్రాలు మసకబారిపోయినట్టు అధ్యయనంలో వెల్లడైంది. 

అంతరిస్తున్న కార్పెంటర్‌ తేనెటీగలు.. 
కాంతి పరావర్తనాన్ని బట్టి మొక్కల పెరుగుదల ఉంటుందన్న సంగతి తెలిసిందే. ‘స్కై గ్లో’ పూల వికాసంపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. పూలు సహజసిద్ధంగా వికసించడం లేదని.. నిర్ణీత సమయానికి కంటే ముందుగానే వికసిస్తున్నాయని అధ్యయనంలో వెల్లడైంది. దీంతో పూలపై ఆధారపడి పరాగ సంపర్కం చేసే తేనెటీగలు సందిగ్ధతకు గురవుతున్నాయి. దీంతో వాటి సంఖ్య క్రమంగా క్షీణిస్తోంది.

భారత్‌లోనే ప్రత్యేకంగా ఉండే ‘కార్పెంటర్‌ తేనెటీగ’ ఉనికి ప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. చీకట్లో పరాగ సంపర్కం జరపడం ‘కార్పెంటర్‌ తేనెటీగ’ ప్రత్యేకత. కృత్రిమ వెలుగులతో చీకటి తగ్గిపోతుండటంతో ఈ తేనెటీగలు క్రమంగా అంతరించిపోతున్నాయి. ముంబైకి 100 కి.మీ. దూరంలో ఉన్న భీమశంకర్‌ అభయారణ్యంలో శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించారు. ముంబై నగరం చిమ్మే వెలుగులతో ఆ అభయారణ్యంలో కార్పెంటర్‌ తేనెటీగలు క్రమంగా అంతరిస్తున్నాయని గుర్తించారు.  

ఏటా లక్షల పక్షులు బలి.. 
నక్షత్రాల వెలుగునే ఆధారంగా చేసుకుని వివిధ ఖండాల నుంచి పెద్ద సంఖ్యలో వలస వచ్చేపక్షులకు స్కై గ్లో నుంచి ముప్పు ఏర్పడుతోంది. విద్యుత్‌ వెలుగులతో జిగేల్‌మంటున్న భారీ భవంతులతో వలస పక్షులు సందిగ్ధతకు లోనవుతున్నాయి. పక్షులు కాంతి పరావర్తనాన్ని గుర్తించలేవు. దీంతో కృత్రిమ కాంతిని చూసి అదే తమ గమ్యస్థానమని భావిస్తున్నాయి. నేరుగా వచ్చి ఎత్తైన భవనాల అద్దాలను ఢీకొట్టి లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.

కాగా వలస పక్షుల విసర్జకాలు సేంద్రియ ఎరువుగా ఉపయోగపడుతున్నాయి. వలస వచ్చే సముద్ర పక్షులు ప్రపంచవ్యాప్తంగా ఏటా బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల (రూ.8,500 కోట్లు) విలువైన సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని అధ్యయనం వెల్లడించింది. రాష్ట్రంలో నేలపట్టు పక్షుల సంరక్షణ కేంద్రానికి వచ్చే పెలికాన్‌ పక్షులు సేంద్రియ ఎరువును అందిస్తున్నాయని రాష్ట్ర అటవీ శాఖ వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఇంతటి ప్రయోజనాన్ని అందిస్తున్న వలస పక్షులు స్కై గ్లో బారిన పడుతుండటం ఆందోళనకరమని నిపుణులు చెబుతున్నారు.  

డార్క్‌ స్కై లైటింగ్‌ విధానాలే పరిష్కారం 
ప్రమాదకరమైన ‘స్కై గ్లో’ను తగ్గించే దిశగా నిపుణులు పరిశోధనలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొన్ని దేశాలు డార్క్‌ స్కై లైటింగ్‌ను ప్రవేశపెట్టాయి. అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ నగరంలో ‘డార్క్‌ స్కై లైటింగ్‌’ అమల్లో ఉంది. అంటే మిరుమిట్లు గొలిపే కాంతిని కాకుండా తక్కువ కాంతిని వెదజల్లే లైట్లను అమరుస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా అవకాశం ఉన్నంతవరకు రాత్రి వేళల్లో సహజసిద్ధమైన చీకటి ఉండేలా చూస్తోంది. ఎత్తైన భవనాలకు ముదురు రంగులు వేస్తోంది. దాంతో కాంతి పరావర్తనం చెందదు కాబట్టి వలస పక్షులకు ఇబ్బంది ఉండదు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement