వచ్చే నెల 4న ఓట్ల లెక్కింపు నేపథ్యంలో అప్రమత్తం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పోలీసులు తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. జూన్ 4న ఓట్ల లెక్కింపు సందర్భంగా అల్లర్లు, దాడులు సంభవించే అవకాశాలున్నాయన్న సమచారంతో పోలీసు యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా కార్డెన్– సెర్చ్ ఆపరేషన్లు ముమ్మరంగా నిర్వహిస్తోంది. పట్టణాలు, గ్రామాలు, అనుమానిత ప్రదేశాల్లో పోలీసు బలగాలు సోదాలు చేస్తున్నాయి.
అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలు, మద్యం మొదలైనవాటికి గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. సరైన పత్రాల్లేని వాహనాలను జప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు 276 ప్రదేశాల్లో తనిఖీలు చేసి 24 కేసులు నమోదు చేశారు. 10మందిని అరెస్ట్ చేయడంతో పాటు 8 మందికి సీఆర్‌పీసీ 41ఏ నోటీసులిచ్చారు. 2 వేల లీటర్ల నాటుసారా, 27.50 లీటర్ల అక్రమ మద్యం, 6,910 లీటర్ల అక్రమ బీరుతో పాటు అక్రమంగా నిల్వ చేసిన 4 వేల లీటర్ల డీజిల్, 25 లీటర్ల పెట్రోల్‌ను జప్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment