సాక్షి, తాడేపల్లి: ఏపీ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేశారంటూ కొన్ని మీడియా సంస్థల్లో.. అవాస్తవంతో కూడిన కథనాలు ప్రచురిస్తున్నాయి. అయితే సీఎంవో విడుదల చేసిన ఒక స్పష్టమైన ప్రకటన ఆధారంగా.. ఈ ఘటనకు సంబంధించిన వాస్తవ వివరాలు ఇలా ఉన్నాయి.
రాజులపూడి ఆరుద్ర, వైఫ్ ఆఫ్ భువనేశ్వర్‌కు తనకు రెండు స్థిరాస్తులు ఉన్న్టటు చెప్తున్నారు. ఇందులో ఒకటి కాకినాడ జిల్లా అన్నవరం వద్ద కాగా, రెండోది అమలాపురంలో ఉంది. అన్నవరం సమీపంలో ఉన్న స్థలాన్ని అమ్మకోనీయకుండా అడ్డుపడుతున్నారంటూ “స్పందన’’ కార్యక్రమం ద్వారా ఆరుద్ర, సెప్టెంబరు 12న కాకినాడ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును తీవ్రంగా పరిగణించిన కాకినాడ ఎస్పీ సెప్టెంబరు 14నే శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.
ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరు కానిస్టేబుళ్లను గన్‌మెన్‌గా, ఇంటిలిజెన్స్ విభాగం నుంచి తొలగించి వారికి ఏఆర్‌కు పంపారు. ఎఫ్‌ఐఆర్‌కూడా నమోదుచేసి విచారణ చేపట్టారు. తమపై తీసుకుంటున్న చర్యలను నిలుపుదల చేయాలంటూ ఇద్దరు కానిస్టేబుళ్లు హైకోర్టును కోర్టును ఆశ్రయించగా, అక్టోబరు 30న న్యాయస్థానం 8 వారాలపాటు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పిటిషనర్ ఆరుద్ర ఆరోపించినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్ ప్రస్తుతం ఎమ్మెల్యేకు గన్‌మ్యాన్‌గా లేరు.
అమ్మడానికి వీల్లేదు!
ఇక అమలాపురం ఆస్తికి సంబంధించి కూడా వివరాలు ఇలా ఉన్నాయి. పిటిషనర్ ఆరుద్ర. ఆమె భర్త భువనేశ్వర్.. ఐదుగురు సంతానంలో ఒకరు. అందులో సోమశేఖర్ నాల్గవ సంతానం కాగా పిటిషనర్ భర్త 5వ సంతానం. వారి తండ్రి రాజులపూడి వైకుంఠ రావు చనిపోయేముందు తన భార్య అయిన సీతమ్మకి ఒక అన్‌రిజిస్టర్డ్ వీలునామా రాసి ఉన్నారు. దాని ద్వారా పొందిన హక్కుతో రాజులపూడి సీతమ్మ 15.8.2007 న ఒక అన్‌రిజిస్టర్ వీలునామా రాసి ఉన్నారు. దాని ప్రకారం తన ఐదవ సంతానం అయిన రాజులపూడి భువనేశ్వర్- తాను ఇచ్చిన ఆస్తిని ఉన్నంతకాలం అనుభవించవచ్చు. కానీ అమ్ముకోవడానికి వీల్లేదు. అతని తదనంతరం తన నాల్గవ కుమారుడైన రాజులపూడి సోమశేఖర్ కుమారుడైన భరత్ కుమార్‌కు ఆ ఆస్తి చెందేలా.. అతను అమ్ముకునేందుకు అధికారం ఇస్తూ వీలునామా రాశారు సీతమ్మ.
పిటిషనర్ ఆరుద్ర తన కుమార్తె అయిన సాయి లక్ష్మీ చంద్ర అనారోగ్యం దృష్ట్యా సదరు ఆస్తిని అమ్మి ఆమెకు వైద్యం చేయించే ప్రయత్నం చేశారు. అయితే భరత్ కుమార్ అమలాపురం సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో దావా(O.S.No.24/2022)వేశారు. దీనిపై పిటిషనర్ ఆరుద్ర, బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ గారికి సెప్టెంబరు 26న స్పందనలో ఫిర్యాదు చేయగా, 29న ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు. తదుపరి విచారణ చేయగా, ఈ విషయం సివిల్ తగాదాగా నమోదయ్యిందని, కోర్టు పరిధిలో ఉందని రిప్లై కూడా ఇచ్చారు.
చివరగా..
రాజులపూడి ఆరుద్ర బుధవారం ఉదయం సీఎంఓ అధికారులను కలిసిన సందర్భంలో వైద్యానికయ్యే అంచనాలను పంపాలని కోరడం జరిగింది. అంతేకాక దీనికి సంబంధించి తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్‌కు సీఎంఓ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. సంబంధిత డాక్టర్లతో వైద్యం గురించి మాట్లాడాలనీ, సీఎంఆర్‌ఎఫ్‌తో ఫాలో అప్‌చేసుకోవాలని కూడా ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment