మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో | FactCheck: Purandeswari False Allegations About Liquor Sales In AP, Facts Inside - Sakshi
Sakshi News home page

FactCheck: మద్యంపై పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు.. వాస్తవాలు ఇవిగో

Published Wed, Oct 11 2023 9:10 AM | Last Updated on Wed, Oct 11 2023 10:40 AM

Fact Check: Purandeswari Lies About Liquor Sales In Ap - Sakshi

మద్యంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారు. డిస్టిలరీలన్నీ చంద్రబాబు అనుమతిచ్చినవేనని తెలిసినా ఆ విషయాన్ని పురంధేశ్వరి దాటవేశారు. మద్యం నిధులు మళ్లించింది చంద్రబాబేనని తేలుతున్నా నోరెత్తని ఆమె.. పైపెచ్చు కాకిలెక్కలు చెబుతూ.. ఈ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మద్యం వినియోగం తగ్గిందని  కేంద్ర శాఖ తేల్చిచెప్పిన కానీ, ఇవేవీ పట్టించుకోకుండా ‘ఈనాడు’ రూట్లోనే ఏపీ బీజేపీ చీఫ్‌ వెళ్తున్నారు. ఏపీలో మద్యం వ్యాపారంపై సీబీఐతో దర్యాప్తు జరిపించండి’ అంటూ ఈ నెల 9న ఈనాడు దినపత్రికలో ప్రచురితమైన వార్త పూర్తిగా అవాస్తవంగా తేలింది. 8వ తేదీన పురంధేశ్వరి చేసిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారం. ఆమె చేసిన ఆరోపణలు, వాస్తవాలు... ఇవిగో.

ఆరోపణ: ఏపీలో చీప్‌ లిక్కర్‌ అమ్మకాలు వేలాది ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. మద్యం పేరిట భారీ అవినీతికి తెరలేపి వేల కోట్ల రూపాయలు స్వాహా చేస్తున్నారు.  
వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం. సమాజంపై మద్యం వినియోగం ప్రభావాన్ని తగ్గించడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు రాష్ట్రంలో దశలవారీగా మద్య నియంత్రణ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టింది.

రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను ఈ ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వంలో 4,380 మద్యం దుకాణాలుండగా ఈ ప్రభుత్వం వాటిని 2,934కి తగ్గించింది. మద్యం, బీరు గరిష్ట స్వాధీన పరిమితి కూడా ఈ ప్రభుత్వమే తగ్గించింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో ఉన్న బెల్ట్‌ షాపులను ఈ ప్రభుత్వమే తొలగించింది. మద్యం విక్రయాలను నిరుత్సాహపరిచేందుకు అదనపు ఎక్సైజ్‌ టాక్స్‌ (ఏఆర్‌ఈటీ) విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి.

మద్యం దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు మద్య విమోచన ప్రచార కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రచార కార్యక్రమాలు నిర్వహించింది. గత ప్రభుత్వంలో ఐఎమ్‌ఎల్‌ (మద్యం), బీరు విక్రయాలు చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ప్రభుత్వం వచ్చాకే గణనీయంగా తగ్గాయి. గత ప్రభుత్వంలో 2017–18లో అంటే 360.85 లక్షల కేసుల మద్యం అమ్మకాలు జరిగితే, 2018–19లో ఆ సంఖ్య 384.36 లక్షల కేసులకు పెరిగింది. అలాగే 2017–18లో బీర్ల అమ్మకాలు 227.26 లక్షల కేసులుంటే.. 2018–19లో ఆ సంఖ్య 277.16 లక్షల కేసులకు పెరిగింది.

ఈ ప్రభుత్వం వచ్చాక మద్యం, బీర్ల అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. ఈ మాట చెప్పింది ఎవరో కాదు.. కేంద్ర ప్రభుత్వమే. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) నివేదిక ప్రకారం 2015–16లో రాష్ట్రంలో పురుషుల్లో 34.9 శాతం, మహిళల్లో 0.4 శాతం మద్యం సేవించేవారు. 2019–21 నాటికి రాష్ట్రంలో మద్యం సేవించే పురుషులు 31.2 శాతానికి, మహిళలు 0.2 శాతానికి తగ్గారు. దీనికి సంబంధించిన టేబుల్‌ కూడా చూడవచ్చు.

ఆరోపణ: వైయస్సార్సీపీలోని కీలక నేతలే మద్యం తయారీ పరిశ్రమలను తమ చెప్పుచేతల్లోకి తీసుకున్నారు. వైయస్సార్సీపీ నాయకులకు తన కంపెనీని అప్పగించడానికి ఒక వైఎస్సార్సీపీ ఎంపీ నిరాకరిస్తే.. ఏపీఎస్‌బీసీఎల్‌ ఆ కంపెనీ నుంచి మద్యం కొనుగోలును ఆపేసింది.
వాస్తవం: ఈ ఆరోపణ పూర్తిగా నిరాధారం, అవాస్తవం. ఈ ప్రభుత్వం వచ్చాక అంటే 2019 మే తరవాత... ఒక్క మద్యం డిస్టిలరీకి కూడా అనుమతివ్వలేదు. ఈ ప్రభుత్వం రాకముందు ఏ డిస్టిలరీలు ఉన్నాయో అవే.. మద్యం తయారీ, సరఫరా చేస్తున్నాయి. 

ఆరోపణ: మద్యంలో నాణ్యత లేదు. విషపు అవశేషాలు ఉన్నాయి. ముడి పదార్థమైన రెక్టిఫైడ్‌ స్పిరిట్‌ నుంచి హానికారక అవశేషాలను తొలగించడం లేదు. మద్యం తయారీ ధర లీటరుకు రూ.15 కాగా.. విక్రయ ధర లీటరుకు రూ.600–రూ.800 మధ్య ఉంది,
వాస్తవం: రాష్ట్రంలో మద్యం తయారీలో డిస్టిలేషన్‌ ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందనడం పూర్తిగా అవాస్తవం. ఏపీ డిస్టిలరీ (బీర్, వైన్‌ కాకుండా మద్యం తయారీ), 2006 నియమాలకు అనుగుణంగానే రాష్ట్రంలో మద్యం తయారవుతోంది. మద్యంలో ఎలాంటి హానికారక అవశేషాలు ఉండకూడదని రూల్‌ 34 చెబుతోంది. మద్యం తయారయ్యే ప్రతి ఫ్యాక్టరీలోనూ మద్యం నాణ్యతను పరీక్షించేందుకు ఒక రసాయన ల్యాబొరేటరీ కూడా ఉంది. మద్యం తయారీ ప్రక్రియను, నాణ్యతను పర్యవేక్షించడానికి ప్రతి డిస్టిలరీ పరిధిలోనూ ఒక డిస్టిలరీ ఆఫీసర్‌ ఉన్నారు.

ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగం వారు రాష్ట్రంలో 5 ప్రాంతీయ ఎక్సైజ్‌ ల్యాబొరేటరీలు ఏర్పాటుచేశారు. ఇవి విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, కర్నూలు, చిత్తూరుల్లో ఉన్నాయి. ఇవి మద్యం నాణ్యతను పరిశీలించి మద్యం నమూనాల్లో అవశేషాలు ఏ మేరకు ఉన్నాయో సర్టిఫికెట్లను కూడా ఇస్తాయి. ఇవి కోర్టుల్లో కూడా చెల్లుబాటు అవుతాయి. 

ఆధునిక పరీక్షా పద్ధతులు సాధ్యమయ్యేలా అత్యాధునిక పరికరాలతో ఈ ల్యాబొరేటరీలను ఆధునికీకరించింది ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ విభాగం. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ, బీఐఎస్‌ ప్రమాణాలకు అనుగుణంగా అత్యంత వేగంగా, కచ్చితంగా పరీక్షలు చేసేలా ఈ ల్యాబొరేటరీలు తయారయ్యాయి. ఈ అత్యాధునిక పరికరాల కోసం రూ.12.5 కోట్లు ఖర్చు చేశారు. ఎసిటల్‌ డీహైడ్, ఇథైల్‌ ఎసిటేట్, మెథనాల్‌ వంటి వాటిని నిశితంగా పరిశీలించే వీలు ఇప్పుడు డిస్టిలరీల్లోని ల్యాబొరేటరీల్లోనూ, ప్రాంతీయ ల్యాబొరేటరీల్లోనూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో విశ్లేషించిన శాంపిళ్ల వివరాలను టేబుల్లో చూడొచ్చు. ఇక మద్యం ఎమ్మార్పీ విలువ విషయానికొస్తే... అందులో15 శాతం తయారీ ఖర్చు కాగా, మిగిలిన 85 శాతం ఏపీఎస్‌బీసీఎల్, ప్రభుత్వ ఆదాయం.

ఆరోపణ: రాష్ట్రంలో 80 శాతం మద్యం అమ్మకాలు నగదు లావాదేవీల ద్వారానే నిర్వహిస్తూ అవినీతికి పాల్పడుతున్నారు.
వాస్తవం: వాస్తవానికి రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నగదు అమ్మకాలే కాదు.. డిజిటల్‌ చెల్లింపుల విధానాన్నీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ అమలు చేస్తోంది. రోజువారీ వేతనాలు తీసుకునే కూలీలు నగదు ద్వారానే మద్యం కొంటున్నారు కనుక ఆ విధానాన్నీ కొనసాగిస్తోంది. మద్యం విక్రయాల మొత్తాన్ని ఏ రోజుకా రోజు సమీపంలోని ఎస్‌బీఐ శాఖలో జమ చేసి చలానాలు అందజేస్తోంది. మద్యం నిల్వలు, విక్రయాలు, బ్యాంకుల్లో జమ చేసిన మొత్తం అన్నింటిపై బెవరేజెస్‌ కార్పొరేషన్‌ పకడ్బందీగా రికార్డులు నిర్వహిస్తోంది.

ఆరోపణ: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు. ఆ విధంగా మద్యం అమ్మకాల మొత్తం రూ.57,600 కోట్లు అయితే అందులో రూ.25 వేల కోట్లు అక్రమంగా మళ్లించేస్తున్నారు.
వాస్తవం: రాష్ట్రంలో రోజూ 80 లక్షల మంది ఒకొక్కరూ సగటున రూ.200 విలువైన మద్యాన్ని సేవిస్తున్నారు అనేది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే కేంద్ర జాతీయ కుటుంబ ఆరోగ్య నివేదిక(ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్‌) నివేదిక ప్రకారం 2019–21లో రాష్ట్రంలో 18.7 శాతం మంది అంటే దాదాపు 40 లక్షల మంది మాత్రమే మద్యం సేవిస్తున్నారు. అలాంటప్పుడు రూ.25వేల కోట్లు అక్రమంగా మళ్లిస్తున్నారు అనేది కూడా అసంబద్ధం, అవాస్తవం.

ఆరోపణ: లంచాలిచ్చే కంపెనీల నుంచే ఏపీఎస్‌బీసీఎల్‌ మద్యం కొనుగోలు చేస్తోంది. 
వాస్తవం: రాష్ట్రంలో 2015లో ఇచ్చిన నోటిఫికేషన్‌ను అనుసరించే ప్రస్తుతం బెవరేజస్‌ కార్పొరేషన్‌ మద్యం కొంటోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తరవాత అంటే 2019 తరువాత ఆ విధానంలో ఎలాంటి మార్పూ జరగలేదు. కాంపిటేటివ్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా రాష్ట్రంలో మద్యం కొనుగోళ్లు పూర్తి పారదర్శకంగా, నిబంధనల మేరకే ఉన్నాయని 19–09–2022న నివేదిక ఇచ్చింది.

ఆరోపణ: రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై స్పెషల్‌ డ్యూటీ (పన్ను) వసూలు చేస్తున్నారు. కానీ ఆ మొత్తం ఎక్కడికి వెళ్తోందో తెలియడం లేదు.
వాస్తవం: వాస్తవానికి అది స్పెషల్‌ డ్యూటీ (పన్ను) కాదు. అది స్పెషల్‌ మార్జిన్‌. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమ పథకాలు కోసం ప్రభుత్వం 2021 నవంబరు 9న ప్రత్యేక జీవో జారీ చేసి ఆ స్పెషల్‌ మార్జిన్‌ వసూలు చేస్తోంది. ఆ నిధుల్ని సంక్షేమ పథకాల కోసం వెచ్చిస్తోంది. అందువల్ల ఆ స్పెషల్‌ మార్జిన్‌ రాష్ట్ర ఖజానాకు వెళ్లదు. 

ఆరోపణ: రాష్ట్రంలో గడచిన రెండేళ్లలో కాలేయ సంబంధ వ్యాధులతో మరణించిన వారు 25 శాతం పెరిగారు. ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి అవినీతికి పాల్పడుతున్నారు.
వాస్తవం: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. ఈ విషయాన్ని ప్రతి మద్యం సీసాపైనా స్పష్టంగా కనిపించేలా చేస్తోంది ప్రభుత్వం. అతిగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయని, ముఖ్యంగా కాలేయం వంటివి దెబ్బతింటాయన్నది అందరికీ తెలిసిన విషయమే. అంతేతప్ప, ప్రభుత్వం విక్రయించే మద్యంలో నాణ్యత లేకపోవడం వల్లనో, విషపూరిత అవశేషాలు ఉండటం వల్లనో కాదు.

విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో గత పదేళ్లలో నెలకు సగటున 20 మంది మాత్రమే కాలేయ సంబంధిత వ్యాధులతో ఆసుపత్రిలో చేరారు. వారిలో కూడా 95 శాతం మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని ఆ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నివేదిక కూడా ఇచ్చారు. దీన్నిబట్టి ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవమని అర్థమవుతోంది.

అందువల్ల పురంధేశ్వరి రాసిన లేఖలో అన్నీ అవాస్తవాలే. మద్యం విక్రయాలను నిరుత్సాహపరచడమే ఈ ప్రభుత్వ విధానం. పూర్తిగా నాణ్యమైన మద్యాన్ని తయారుచేసి, ఎలాంటి అవినీతికీ ఆస్కారం లేకుండా అమ్మకాలు జరిపేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది.
చదవండి: Fact Check: కళ్లు తెరిచి చూడు రామోజీ..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement