సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద చల్లటమే పనిగా పెట్టుకున్న ‘ఈనాడు’ విద్యా హక్కు చట్టం అమలుపైనా, అమ్మఒడి పథకంపైనా తన వక్రబుద్ధిని చాటుకుంది. విద్యా హక్కు చట్టం గురించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు కనీసం పట్టించుకోకపోయినా ఈనాడు ఒక్క వార్తా రాయలేదు.
పేద పిల్లలకు మేలు జరిగే ఈ చట్టాన్ని ఎందుకు అమలుచేయడంలేదని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదు. కానీ, వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ చట్టాన్ని అమలుచేయిస్తూ పేదపిల్లలకు ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్లలోనూ చదువుకునే అవకాశం కల్పిస్తుంటే ‘ఈనాడు’కు నచ్చడంలేదు.
అందులో భాగంగానే విద్యా హక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీఓను తప్పుపడుతూ ఈనాడు సోమవారం నాటి దినపత్రికలో అసత్యపు వార్తను అచ్చేసింది. వాస్తవాలను మసిపూసి మారేడుకాయ చేస్తూ అసత్యాలతో ఆరోపణలు చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్‌చెక్’లో ఈనాడు బండారం, వార్తలోని డొల్లతనం బట్టబయలయ్యాయి. అంశాల వారీగా ఈనాడు చేసిన ఆరోపణల్లోని అవాస్తవాలను వెల్లడిస్తూ వాటిని ఖండించింది. అవి..
ఆరోపణ–1: విద్యా సంస్థల ఫీజులను ప్రభుత్వం చెల్లించాలి. ఇతర రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం ఇలాగే అమలు చేస్తున్నారు.
వాస్తవం: 2019–2020 విద్యా సంవత్సరం నుండి అమ్మఒడి పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా రాష్ట్ర ప్రభుత్వం రూ.15,000లను 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థుల విద్యా ఖర్చుల కోసం (స్కూల్ ఫీజులతో కలిపి) జమచేస్తోంది. నిజానికి.. గతంలో ఈ పథకం లేదు. ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో కానీ, దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోనూ లేదు.
గత మూడేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యా ఖర్చుల నిమిత్తం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాలోకి ఈ అమ్మఒడి నిధులు జమచేస్తోంది. 2019–20లో 42,33,098 మంది తల్లులకు రూ.6,349.60 కోట్లు, 2020–21లో 44,48,865 మంది తల్లులకు రూ.6,673.40 కోట్లు, 2021–22లో 42,62,419 మంది తల్లులకు రూ.6,393.60 కోట్లు జమచేసి విద్యా ఖర్చుల నిమిత్తం చెల్లించింది.
2వ ఆరోపణ: అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని భావించి గత ఏడాది విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాలు పొందారు..
వాస్తవం: ఈనాడు ఆరోపణ అవాస్తవం. గత సంవత్సరం విద్యాహక్కు చట్టం కింద ప్రవేశాల అమలులో ప్రభుత్వం ఎక్కడా అమ్మఒడితో సంబంధం లేకుండా ప్రభుత్వమే ఫీజులు చెల్లిస్తుందని ప్రకటన చేయలేదు. ఆ విధంగా తల్లిదండ్రులకు ప్రభుత్వం ఏ సందర్భంలోనూ ఆ విధంగా హామీ ఇవ్వలేదు.
3వ ఆరోపణ: తాజా ఉత్తర్వులతో తల్లిదండ్రులపై భారం పడింది.
వాస్తవం: ఈనాడులోని ఈ ఆరోపణ పూర్తిగా అవాస్తవం. 2019–2020 విద్యా సంవత్సరం నుండి మాత్రమే అమ్మఒడి పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాలోకి నేరుగా ప్రభుత్వం రూ.15,000లు జమచేస్తోంది. అంతకుపూర్వం ఇలాంటి పథకం ఈ రాష్ట్రంలో కానీ దేశంలోని ఏ ఇతర రాష్ట్రంలోను లేదు.
విద్యా హక్కు చట్టం ప్రకారం నిర్ధారించబడిన ఫీజు అమ్మఒడి నుండి చెల్లించిన పిదప ఇంకా విద్యా ఖర్చుల నిమిత్తం కొంత భాగం తల్లిదండ్రులకు మిగులుతుంది. గతంలో ప్రైవేట్ పాఠశాల్లో ఫీజులపై నియంత్రణలేదు. విద్యా హక్కు చట్టం అమలుచేయలేదు. ఇది తల్లిదండ్రులకు భారం కాదు.. అని ఫ్యాక్ట్‌చెక్‌లో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.
Comments
Please login to add a commentAdd a comment