వైఎస్సార్‌సీపీపై బురదజల్లేందుకు టీడీపీ దిగజారుడు రాజకీయం
పాత కక్షలతోనే కారు దహనం చేశారని తేల్చిన పోలీసులు
సింగరాయకొండ వివాదంపై ఎల్లో మీడియాలో అసత్య ప్రచారం
సింగరాయకొండ/ఒంగోలు టౌన్: ఎక్కడ చిన్న గొడవ జరిగినా అది వైఎస్సార్‌సీపీకి అంటగట్టడం ఎల్లో బ్యాచ్‌కు అలవాటుగా మారింది. జరిగిన ఘటనపై టీడీపీ నేతలు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. వెనువెంటనే వారి అనుకూల ఛానల్స్‌లో అసత్య కథనాలు మొదలైపోతాయి. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో జరిగిన కారు దహనం ఘటన దానికి నిదర్శనంగా నిలిచింది. మూలగుంటపాడు పంచాయతీ విద్యానగర్‌లో టీడీపీ నేత చిగురుపాటి శేషగిరిరావు నివాసముంటున్నాడు.
శుక్రవారం అర్ధరాత్రి అతని ఇంటి ఆవరణలోని కారుపై కొందరు పెట్రోలు పోసి తగలబెట్టారు. అయితే ఇది పాత కక్షల నేపథ్యంలో జరిగిందని, రాజకీయాలకు సంబంధంలేదని బాధితుడితోపాటు పోలీసులు చెబుతున్నా పచ్చ నేతలు దానికి రాజకీయ రంగు పులిమి శిలవలు పలవలు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఒంగోలులో ఏఎస్పీ (క్రైం) శ్రీధర్‌రావు మీడియాకు వివరించారు. వ్యక్తిగత విద్వేషాలతోనే శేషగిరిరావును భయభ్రాంతులకు గురిచేసేందుకు కారు దహనానికి పాల్పడ్డారని, ఇందులో రాజకీయ కోణం లేదని స్పష్టం చేశారు.
అసలు జరిగింది ఇదీ..
సింగరాయకొండ లారీ అసోసియేషన్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న శేషగిరిరావుకు అదే గ్రామానికి చెందిన లాడ్జి యజమాని కనసాని ఈశ్వర్‌రెడ్డికి మధ్య భూ వివాదం ఉంది. ఈశ్వర్‌రెడ్డికి, అశోక్ అనే వ్యక్తికి మధ్య ఒక భూ వివాదానికి సంబంధించి మధ్యవర్తిగా వ్యవహరించిన శేషగిరిరావు అందుకు సంబంధించిన సెటిల్‌మెంట్ పత్రాలను తన వద్దనే ఉంచుకొన్నాడు. అయితే ఆ పత్రాలను తనకు ఇవ్వవలసిందిగా ఈశ్వర్‌రెడ్డి కొద్ది రోజులుగా అడుగుతున్నా ప్రయోజనం లేకుండా పోయింది. అంతేకాకుండా ఈశ్వర్ రెడ్డి మీద శేషగిరిరావు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.
దీంతో కక్ష పెంచుకున్న ఈశ్వర్ రెడ్డి తన వద్ద పనిచేసే పాలేటి అభిõÙక్ అతడి మిత్రుడైన ఒక మైనర్ సహాయంతో శేషగిరిరావు ఇంటివద్ద ఉన్న కారుపై పెట్రోలు పోసి తగలబెట్టించాడు. శేషగిరిరావు ఫిర్యాదు చేసిన వెంటనే ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్ స్పందించారు. ఈ కేసును ఛేదించేందుకు అడిషనల్ ఎస్పీ (క్రైం) శ్రీధర్ రావు, ఒంగోలు డీఎస్పీ కిశోర్ కుమార్‌ల ఆధ్వర్యంలో 6 టీంలను రంగంలోకి దించారు. అన్నీ కోణాల్లో దర్యాప్తు చేసిన పోలీసులు శనివారం మధ్యాహ్నం సింగరాయకొండ బైపాస్ వద్ద ఈశ్వర్‌రెడ్డితో పాటు మరో ఇద్దరు యువకులను అరెస్టు చేశారు.
వైఎస్సార్ సీపీపై నింద వేసేందుకు ఒత్తిడి
ఇందులో వ్యక్తిగత కక్షలు తప్ప రాజకీయ నేపథ్యం లేదు. అయితే ఈ ఘటనకు వైఎస్సార్‌సీపీయే కారణం అని ఫిర్యాదు చేయాలంటూ శేషగిరిరావుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. వాస్తవానికి ఈశ్వరరెడ్డి వైఎస్సార్‌సీపీ నాయకుడు కాదు. ఆయనకు టీడీపీ నాయకులతో సంబంధాలున్నాయి. వాస్తవాలను కప్పిపుచ్చుతూ టీడీపీ, వైఎస్సార్‌సీపీల మధ్య వివాదంగా చిత్రీకరించాలని చూడడంపై స్థానికులు విస్మయం చెందారు.
Comments
Please login to add a commentAdd a comment