విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయిస్తున్న డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి, సీపీ టీకే రాణా తదితరులు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): కుటుంబ కలహాల కారణంగానే ఎక్కువగా ఆత్మహత్యలు జరుగుతున్నాయని డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి చెప్పారు. భార్యాభర్తలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చేలా ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో కౌన్సెలింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర పోలీస్ శాఖ, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర శాఖ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
అందులో భాగంగా బెంజిసర్కిల్ నుంచి ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియం వరకూ విద్యార్థులు, పోలీస్ సిబ్బందితో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. తొలుత బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మానసిక వైద్యుల సంఘం రూపొందించిన పోస్టర్‌ను డీజీపీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ కుటుంబ కలహాలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న వారిలో పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఉందన్నారు.
ఆరి్థక ఇబ్బందులు, అనారోగ్యాలతో కూడా కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని డీజీపీ ఆవేదన వ్యక్తం చేశారు. చదువుల విషయంలో తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి తీసుకు రావొద్దని సూచించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఒత్తిడిలేని విద్యా విధానమే లక్ష్యంగా ప్రభుత్వం విద్యారంగాన్ని ప్రక్షాళన చేస్తోందన్నారు.
అనంతరం ‘సమస్యకు ఆత్మహత్య పరిష్కారం కాదు.. మేం ఆత్మహత్య చేసుకోం’ అని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ టీకే రాణా, మానసిక వైద్యుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.ప్రభాకర్, కార్యదర్శి డాక్టర్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment