సాక్షి, అమరావతి: వచ్చేనెల 15న విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి 77వ భారత స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లుచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వీటికి సంబంధించి శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడంలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా చూస్తూ విస్తృత ఏర్పాట్లుచేయాలన్నారు. అదేరోజు సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమానికి కూడా ఏర్పాట్లుచేయాలని సీఎస్ వారిని ఆదేశించారు. మొత్తం ఏర్పాట్లన్నింటినీ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ పోలీస్ కమిషనర్ పర్యవేక్షించాలన్నారు.
ఇక రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వివిధ సంక్షేమాభివృద్ధి పథకాలపై ప్రజల్లో విస్తృత అవగాహనకు ఆయా శాఖల వారీగా ప్రత్యేక శకటాల ప్రదర్శనను ఏర్పాటుచేయాలని జవహర్‌రెడ్డి ఆదేశించారు. ఈ వేడుకలకు హాజరయ్యే అతిథులందరికీ ప్రొటోకాల్ సహా తగిన ఏర్పాట్లు కూడా చేయాలన్నారు. రాజ్‌భవన్, హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం సహా ఇతర ప్రముఖ కార్యాలయాల భవనాలను విద్యుద్దీపాలతో అలంకరించాలని కూడా సీఎస్ సూచించారు.
పోలీసు శాఖ విస్తృత బందోబస్తు..
మరోవైపు.. వీడియో లింక్ ద్వారా సమావేశంలో పాల్గొన్న డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. పోలీస్ శాఖ పరంగా విస్తృత బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ ఏర్పాట్లన్నింటినీ విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ఏపీఎస్పీ అదనపు డీజీపీలు పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తారని చెప్పారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి.విజయకుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. శకటాల ప్రదర్శనకు ఇప్పటివరకూ 13 శాఖలు ముందుకొచ్చాయని, పర్యాటక శాఖ శకటం కూడా ఏర్పాటుచేస్తే బాగుంటుందని ఆయన చెప్పారు.
ఈ వేడుకలను ప్రజలందరూ తిలకించేందుకు వీలుగా స్క్రీన్‌లు ఏర్పాటుచేయడంతోపాటు ఆలిండియా రేడియో, దూరదర్శన్ సహా వివిధ చానాళ్ల ద్వారా ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లుచేస్తున్నామన్నారు. ఇక వేడుకల అనంతరం ఆయా శకటాలను విజయవాడ నగరంలోని ఏలూరు రోడ్డు, బందరు రోడ్డులో తిప్పనున్నట్లు చెప్పారు.
విద్యార్థులకు ప్రత్యేక బస్సులు..
అనంతరం.. ఎన్టీఅర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ.. గత ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొనేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేస్తున్నట్లు చెప్పారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ కూడా మాట్లాడారు.
అంతకుముందు.. రాష్ట్ర ప్రొటోకాల్ విభాగం సంచాలకులు ఎం. బాలసుబ్రహ్మణ్యంరెడ్డి వివిధ శాఖలపరంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్‌ఆర్) చిరంజీవి చౌదరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment